Bandi Sanjay on Gaddar : కేంద్ర ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలంగాణాకు అన్యాయం జరిగిందంటూ సీఎం ప్రకటించడం, దానిపై బీజేపీ నేతల కామెంట్లతో తెలంగాణలో తీవ్ర చర్చ జరుగుతోంది. విభిన్న రంగాలకు చెందిన వ్యక్తులను పద్మ అవార్డులతో గౌరవించాలని రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. కానీ.. కేంద్రం మాత్రం ఏకపక్షంగా వ్యవహరించింది. రాష్ట్ర సర్కార్ సూచించిన వారికి అవార్డులు ఇవ్వలేదు. ఇదేమిటని.. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి అడిగితే.. కేంద్ర మంత్రి హోదాలోని వ్యక్తి మాటలు హుందాగా ఉండాలని ఆశిస్తాం. కానీ.. బండి సంజయ్ మాత్రం వితండంగా స్పందించారు. దీంతో.. రాష్ట్రంలో రెండు పార్టీల తీరుపై ప్రజల్లో చర్చ నడుస్తోంది.
పద్మ శ్రీ అవార్డులు.. దేశంలోని అత్యున్నత పౌరు పురస్కారాల్లో ఒకటి. ఇవి విభిన్న రంగాల్లో, విశేష సేవలు చేసిన వారిని ప్రభుత్వం గుర్తిస్తూ అవార్డులతో సత్కరిస్తుంటుంది. అలాంటి అవార్డుల ప్రధానం దగ్గర ఎలాంటి వ్యక్తిగత, భావజాల వైరుధ్యాలు ప్రదర్శించాల్సిన అవసరం లేదు. అదే విషయాన్ని తన చేతల ద్వారా చేసి చూపించింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలోని విభిన్న రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులకు పద్మల ద్వారా గుర్తింపు అందించాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. కానీ.. వారిలో ఒకరికీ అవార్డు ఇవ్వలేదు. పైగా.. ఇతర రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేపథ్యం ఉన్న వారికి, వేరే వారికి తెలంగాణ కేటగిరిలో అవార్డులు అందించింది. ఇదే విషయమై.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే కాదు.. ఈ గడ్డతో సంబంధం ఉన్న ప్రతీ వ్యక్తి, రాజకీయాలకు సంబంధం లేకుండా నిజానిజాలను గుర్తించే ఆలోచన ఉన్న మేధావులు.. కేంద్ర వివక్ష చూపిందని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అలాంటి చోట.. రాజకీయ వ్యాఖ్యలు చేశారు.. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. వారి పార్టీ అనుసరిస్తున్న విధానాలను, విపక్షను తన మాటల్లో ప్రదర్శించి.. విమర్శల పాలవుతున్నారు.
రేవంత్ రెడ్డి సమక్షంలో సమావేశం అయిన ఉన్నతాధికారులు తెలంగాణ రాష్ట్రం నుంచి.. గద్దర్ (పద్మవిభూషణ్), చుక్కా రామయ్య (పద్మభూషణ్), అందెశ్రీ (పద్మభూషణ్), గోరటి వెంకన్న (పద్మశ్రీ), జయధీర్ తిరుమలరావు (పద్మశ్రీ) పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. వీరిలో.. ప్రజా ఉద్యమాల ద్వారా గుర్తింపు పొందిన వ్యక్తి గద్దరు. ఎన్నో విప్లవ పోరాటాలతో దళిత, వెనుకబడిన వర్గాలకు పాటై నిలిచారు. తన పాట ద్వారా జనాలను ఉర్రూతలూగించారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో తనదైన శైలిలో పోరాటాన్ని నడిపించారు. అలాగే.. విద్యా రంగంలో విశేష కృషి చేసిన వ్యక్తి చుక్కా రామయ్య. ప్రభుత్వాలు తలపెట్టిన అనేక విద్యా సంస్కరణాల కమిటీల్లో తన వంతు పాత్ర పోషించిన వ్యక్తి. గొంగడి భుజాన వేసి ప్రజల పక్షాన పోరాడిన గోరేటి, ప్రొఫెసర్, కవి, చరిత్రకారుడు అయిన వ్యక్తి జయధీర్ తిరుమల రావు. అలాంటి వారికి పద్మ అవార్డుల్లో తీవ్ర అన్యాయం జరిగింది అన్న మాట వాస్తవమే.
అమ్మ తెలంగాణమా.. ఆకలి కేకల గానమా.. అంటూ ఇక్కడి ప్రజల ఆకలి పోరాటాన్ని ఎలుగెత్తి చాటినా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అని నినదించినా, భద్రం కొడుకో.. జర పైలం కొడుకా.. అంటూ యువతకు మార్గనిర్దేశం చేసినా.. అది గద్దర్ కి మాత్రమే చెందుతుంది. అలాంటి వ్యక్తి విషయంలో బండి సంజయ్ చాలా దారుణంగా మాట్లాడారు అంటున్నారు.. తెలంగాణ ఉద్యమకారులు. గద్దర్ మావోయిస్టు అంటూ కామెంట్ చేసిన బండి.. ఆయనకు బరాబార్ అవార్డు ఇవ్వం అంటూ మాట్లాడారు. ప్రజా చైతన్యం కోసం, అన్యాయాన్ని ప్రశ్నించడం కోసం.. పోరాట మార్గానికి మద్ధతు తెలపొచ్చు కానీ.. ఆయన ఏదీ వ్యక్తిగత స్వార్థం కోసం చేయలేదన్న విషయాన్ని గుర్తించాలని చివాట్లు పెడుతున్నారు.
గద్దర్ వంటి వ్యక్తులు ఏం చేసినా అది సమాజం కోసమే అంటున్నారు. కానీ బండి సంజయ్ మాత్రం.. గద్దర్ బీజేపీ నాయకుల్ని చంపించారంటూ సంచలన కామెంట్లు చేశారు. తెలియని యువతరానికి.. గద్దర్ భుజం మీద తుపాకీతో బీజేపీ నాయకుల్ని గుర్తించి చంపినట్లుగా వక్రీకరణ చేస్తూ మాట్లాడారు. గద్దర్ వంటి వ్యక్తి మీద నిజంగానే అంత వ్యతిరేకత ఉంటే.. గతంలో ఆయన పాటలకు ఎందుకు ఉద్యమ సమయంలో గంతులేశారని ప్రశ్నిస్తున్నారు సగటు గద్దర్ అభిమానులు. ఆయన పాటలతో ఉత్తేజితులైన యువతను తమవైపు తిప్పుకునేందుకు, ఉద్యమంలో తాము నిజంగానే పాల్గొంటున్నామని నమ్మించేందుకు అప్పుడు.. గద్దర్ పాటలతోనే ధర్నాలు, నిరసనలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గతంలో గద్దర్ బీజేపీ కార్యాలయానికి వచ్చినప్పుడు.. ఆత్మీయంగా కౌగిలించుకుని స్వాగతం పలికిన నేతలే.. అవార్డు విషయంలో ప్రశ్నించినందుకు ఆయనపై బురద జల్లుతున్నారంటూ మండిపడుతున్నారు.
Also Read : ఆ విషయంలో కేంద్రం విఫలం.. సీఎం రేవంత్ రెడ్డి
ఒకవేళ.. గద్దర్ విషయంలో బీజేపీ ఆలోచనలే సరైనవి అనుకుంటే… మరి చుక్కా రామయ్య ఎంత మంది బీజేపీ కార్యకర్తల్ని చంపారని, జయధీర్ తిరుమలరావు ఎలా బీజేపీ కి అన్యాయం చేశారో చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు. మీకు నచ్చిన ప్రభుత్వాలున్న చోట.. కిక్కురుమనకుండా అవార్డులు ప్రకటించిన కేంద్రం.. ప్రతిపక్ష పార్టీలు ఉన్న చోట్ల మాత్రం వివక్ష చూపించిందంటూ అగ్రహిస్తున్నారు. అవార్డులు అనేది వ్యక్తుల కృషికి దక్కాల్సిన గుర్తింపు కానీ.. పార్టీలు, రాజకీయలతో వాటిని ముడిపెట్టి వ్యక్తుల కృషిని తక్కువ చేయడం సమంజసం కాదని అంటున్నారు.