CM Revanth Reddy: బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని, బ్రిటిష్ జనతా పార్టీ అంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం పాల్గొన్నారు. ఈ సంధర్భంగా బీజేపీని ఉద్దేశించి సీఎం సంచలన కామెంట్స్ చేశారు. ముందుగా ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
ర్యాలీలో పాల్గొని సీఎం మాట్లాడుతూ.. రాజ్యాంగ పరిరక్షణకు రాహుల్ గాంధీతో కలిసి మనం ఈ పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. ఇది ఎన్నికల ర్యాలీ కాదని, ఇది ఒక యుద్ధమంటూ సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. ఈ యుద్ధం రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడేవారికి, రాజ్యాంగాన్ని మార్చాలనుకునేవారికి మధ్య జరుగుతోందన్నారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ముందుగానే గుర్తించి రాజ్యాంగ పరిరక్షణకు పోరాడుతున్నారన్నారు. ఘజనీ మహమ్మద్ హిందుస్తాన్ ను దోచుకోవడానికి ప్రయత్నించిన తరహాలో, రాజ్యాంగాన్ని మార్చాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారన్నారు. కానీ ఆయన ప్రయత్నం ఫలించడంలేదని ఎద్దేవా చేశారు.
ఆనాడు బ్రిటిషర్ల నుంచి మహాత్మా గాంధీ దేశాన్ని రక్షించినట్లు, భారతీయ జనతాపార్టీ పేరుతో చలామని అవుతున్న బ్రిటిష్ జనతా పార్టీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిలబడ్డారని సీఎం తెలిపారు. ఈ యుద్ధంలో మనమంతా రాహుల్ గాంధీతో కలసి నడవాలని, ప్రధానంగా యువతీ యువకులు ముందడుగు వేయాలని సూచించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు మనమంతా కలిసికట్టుగా పోరాడాలని, ఇది రెండు పరివార్ ల మధ్య జరుగుతున్నయుద్ధం అంటూ సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు.
Also Read: Maha Kumbh Mela: పుణ్యం కోసం వచ్చాడు.. పోలీసులకు చిక్కాడు!
ఒకటి గాంధీ పరివార్.. మరొకటి గాడ్సే పరివార్ అన్న సీఎం, గాడ్సే పరివార్ వైపు నుంచి మోదీ, గాంధీ పరివార్ వైపు నుంచి రాహుల్ గాంధీ పోరాటం సాగిస్తున్నట్లు సీఎం తెలిపారు. అందుకే మనమంతా గాంధీ పరివార్ గా రాహుల్ గాంధీకి మద్దతుగా నిలవాలని, రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని పరిరక్షించాలని సీఎం కోరారు.