Jubilee Hills By-poll: తెలంగాణలో రాజకీయాల పార్టీల మధ్య జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేడి మొదలైంది. ఇప్పటికే అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్‌లు తమ అభ్యర్థులను ప్రకటించాయి. వారంతా నియోజకవర్గాల్లో ప్రచారంలో దూసుకు పోతున్నారు. పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారంలో నిమగ్నమయ్యారు. కానీ బీజేపీ వెనుకబడిపోయింది. ఇంతకీ ఆ పార్టీ బరిలోకి దించుతుందా? లేదా అన్నదానిపై ఇంటా బయటా ఒకటే చర్చ.
తెలంగాణలో హీటెక్కిన బైపోల్ అంశం
స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడడంతో రాజకీయ పార్టీల దృష్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పడింది. ఆ సీటు దక్కించుకోవాలని అధికార కాంగ్రెస్-విపక్ష బీఆర్ఎస్, బీజేపీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. బైపోల్ నుంచి బీజేపీ డ్రాప్ అవ్వడం ఖాయమంటూ జోరుగా ప్రచారం సాగింది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తప్పుకోవడంతో బీజేపీకి కలిసొచ్చింది.
ఇప్పుడు బీజేపీ డ్రాపయితే బీఆర్ఎస్‌కు కలిసి వస్తుందని అంటున్నారు కొందరు నేతలు. మరి ఆ రెండు పార్టీల మధ్య అంతర్గతంగా ఎలాంటి ఒప్పందాలు జరిగాయి అన్నది కాసేపు పక్కనబెడదాం. ఏదో విధంగా బీజేపీకి మైలేజ్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు కొందరు నేతలు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఓ బాంబు పేల్చారు. బీజేపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నేత బొంతు రామ్మోహన్ పేరును ఆయన ప్రతిపాదన చేశారు.
బీజేపీ అభ్యర్థి ఎవరంటూ
బొంతు రామ్మోహన్‌ను తమ పార్టీలోకి తీసుకుని ఆయనకు జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వాలని బీజేపీ చీఫ్‌ని కోరారట. ఎందుకంటే రామ్మోహన్‌కు ఏబీవీపీ బ్యాక్‌గ్రౌండ్ ఉందన్నది ఎంపీ మాటల వెనుకున్న అర్థం. ఈ విషయం బయటకు రాగానే కాంగ్రెస్ నేత బొంతు రామ్మోహన్ రియాక్ట్ అయ్యారు. ఎంపీ అర్వింద్ మాటలను తోసిపుచ్చారు. బీజేపీ నుంచి తాను పోటీ చేస్తానన్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదన్నారు.
తాను బీజేపీ నేతలకు టచ్‌లో లేనని, ఎవరితో మాట్లాడలేదని స్పష్టం చేశారు. తాను ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉంటానని క్లారిటీ ఇచ్చేశారు. ఇదంతా కావాలనే కొందరు నేతలు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. బైపోల్‌లో బీజేపీ అభ్యర్థి ఎవరో ఇప్పటివరకు తెలీదు. కానీ, తాము పోటీ ఉన్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఆ పార్టీ నాయకులు.
ALSO READ: శుక్రవారం తెలంగాణ బంద్.. కారణమేంటి?
అన్నట్లు ఆ పార్టీ నుంచి ఇద్దరు మహిళా నేతల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఒకరు వీరపనేని పద్మ కాగా, మరొకరు మాధవీలత పేరు బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర బీజేపీ నాయకత్వం వీరిలో ఎవరివైపు మొగ్గు చూపుతుందో చూడాలి. అటు అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు సైలెంట్‌గా తమ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు.