
Rakhi: సోదర భావానికి ప్రతీక రాఖీ పూర్ణిమ. అన్నా చెల్లెలు, అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమకు వేదిక ఈ వేడుక. ఈ పండుగనే రాఖీ పండుగ, రక్షాబంధన్ అని పిలుస్తుంటారు. అన్నా, తమ్ముళ్లు తమ సోదరికి రక్షగా ఉన్నామంటూ తెలిపే ఈ పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగతో మెట్టింటి నుంచి పుట్టింటికి ఆడపడుచుల రాకతో ఊరంతా సందడిగా మారుతుంది. సంతోషవనాన్ని తలపిస్తుంది. అంతటి ఆనందరకరమైన ఈ వేడుక ఓ చెల్లికి మాత్రం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
పెద్దపల్లి జిల్లాలో అన్నకు రాఖీ కట్టడానికి వచ్చిన చెల్లి.. మృతదేహానికి రాఖీ కట్టి సాగనంపిన ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఎలిగేడు మండలం ధూళికట్టకి చెందిన కనకయ్య.. చెల్లెలు రాఖీ కట్టే సమయంలో గుండెపోటుతో కుప్పకూలాడు. అప్పటి వరకూ సంతోషంగా కళ్ల ముందే ఉన్న కనకయ్య విగతజీవిగా పడి పోవడంతో.. సంతోషంగా ఉన్న ఆ ఇంట్లో విషాదచాయలు అలుముకున్నాయి. ఇక కడసారిగా తన అన్నకు చెల్లెలు గౌరమ్మ రాఖీ కట్టి సాగనంపిన హృదయ విదారక ఘటనతో గ్రామస్తులంతా కన్నీటిపర్యంతమయ్యారు.