BRS- Bathukamma: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండుగ ..ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనూ ప్రాధాన్యం సంతరించుకుంటోంది. మహిళా ఓటర్లకు చేరువ కావడం, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను క్రియాశీలం చేయడం, తెలంగాణ సంస్కృతితో తమకున్న అనుబంధాన్ని చాటుకోవడం లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) బతుకమ్మ వేడుకలపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా సంబురాల నిర్వహణకు సన్నాహాలు చేయడంతోపాటు పార్టీ మహిళా నేతలతో ప్రత్యేక పాటలు, వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించడం ఈ ప్రయత్నంలో భాగంగా కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో బతుకమ్మకు విస్తృత ప్రచారం కల్పించి, ఈ పండుగతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కల్వకుంట్ల కవిత చెక్ పెట్టేలా వ్యూహం రచించింది. ఇప్పుడు అదే సాంస్కృతిక వేదికపై బీఆర్‌ఎస్ దృష్టి సారించడం చర్చ కు దారితీసింది.
మహిళా ఓటర్లపై బీఆర్‌ఎస్ బిగ్ ప్లాన్..
రాజకీయంగా మహిళా ఓటర్ల ప్రాధాన్యాన్ని గుర్తించిన బీఆర్‌ఎస్.. వారికి చేరువ అయ్యేందుకు బతుకమ్మను వేదికగా ఎంచుకున్నట్లు సమాచారం. అందుకు పార్టీ కార్యాచరణ సైతంలు స్పష్టం చేస్తుంది. పండుగ సందర్భంగా మహిళలను పెద్ద సంఖ్యలో భాగస్వాములను చేయడం, స్థానికంగా వేడుకలను నిర్వహించడం, పార్టీ మహిళా విభాగాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. పాటలు, వాల్‌పోస్టర్ల ద్వారా బతుకమ్మ సంబరాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు పార్టీ సందేశాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కార్యక్రమాలను నిర్వహించేలా మహిళా నేతలకు సూచనలు చేసింది.
కవితకు బతుకమ్మతో అనుబంధం
తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మను సాంస్కృతిక చైతన్యానికి ప్రతీకగా నిలబెట్టడంలో కవిత, ఆమె స్థాపించిన తెలంగాణ జాగృతి కీలక పాత్ర పోషించాయి. బతుకమ్మ వేడుకలను విస్తృతంగా నిర్వహించడం, మహిళలను పెద్ద సంఖ్యలో భాగస్వాములను చేయడం, తెలంగాణ సంప్రదాయాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయడం ద్వారా ఈ పండుగకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేశారు. దీంతో బతుకమ్మ ప్రస్తావన వచ్చినప్పుడు కవిత పేరు రాజకీయ, సాంస్కృతిక వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తుంటుంది.తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ కేవలం పండుగగానే కాకుండా తెలంగాణ అస్తిత్వాన్ని చాటే సాంస్కృతిక ప్రతీకగా ముందుకొచ్చింది. ఈ పరిణామంలో కవిత నిర్వహించిన కార్యక్రమాలు ఆమె రాజకీయ ప్రస్థానంలోనూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి.
బీఆర్‌ఎస్ వ్యూహం వెనుక రాజకీయ కోణం?
కవిత బీఆర్‌ఎస్‌కు దూరమై స్వతంత్ర రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ వారసత్వం, సంస్కృతి, మహిళా నాయకత్వం వంటి అంశాలకు రాజకీయంగా ప్రాధాన్యం పెరిగింది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ మహిళా నేతలు బతుకమ్మ పాటలు, వాల్‌పోస్టర్లతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవడం ఆసక్తి రేపుతోంది. గతంలో కవితకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన సాంస్కృతిక అంశంపై ఇప్పుడు పార్టీ మహిళా నాయకత్వం దృష్టి పెట్టడం ద్వారా మహిళా శ్రేణులను సమీకరించడంతోపాటు పార్టీకి తెలంగాణ సంస్కృతితో ఉన్న అనుబంధాన్ని చాటుకోవాలని భావిస్తున్నది. అన్ని జిల్లాల్లో ఈ నెల 10 నుంచి 18 వరకు సంబరాలు నిర్వహించేందుకు సిద్ధమవడం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. బతుకమ్మతో మహిళలకు చేరువ కావడం, పార్టీకి ఉన్న సాంస్కృతిక అనుబంధాన్ని మరోసారి చాటడం, మహిళా శ్రేణులను క్రియాశీలం చేయడం ముఖ్య ఉద్దేశం.
సంస్కృతి నుంచి రాజకీయాల దాకా
బతుకమ్మ తెలంగాణ ప్రజల సమష్టి సాంస్కృతిక వారసత్వం. తరతరాలుగా మహిళలు కొనసాగిస్తున్న ఈ సంప్రదాయానికి తెలంగాణ ఉద్యమ సమయంలో మరింత విస్తృత ప్రచారం లభించింది. కవిత, తెలంగాణ జాగృతితోపాటు పలువురు కళాకారులు, సాంస్కృతిక సంస్థలు, మహిళా సంఘాలు ఈ పండుగను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భాగస్వాములయ్యాయి. ఇప్పుడు వివిధ రాజకీయ పార్టీలు కూడా బతుకమ్మను ప్రజలతో అనుసంధానం పెంచుకునే వేదికగా ఉపయోగించుకుంటున్నాయి.ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ చేపడుతున్న కార్యక్రమాలు మహిళా విభాగాన్ని ఎంతవరకు క్రియాశీలం చేస్తాయి? కవిత తనకున్న బతుకమ్మ అనుబంధాన్ని స్వతంత్ర రాజకీయ వేదికపై ఎలా ముందుకు తీసుకెళ్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది. సాంస్కృతిక వేడుకగా ప్రారంభమైన బతుకమ్మ చుట్టూ రాజకీయ చర్చ జరుగుతుంది. ఏది ఏకమైనప్పటికీ ఈ పండుగకు సంబంధించిన కార్యక్రమాల నిర్వహణ, ప్రచారం, మహిళా నాయకత్వం ద్వారా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు మాత్రం ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Also Read: పాకల బీచ్‌లో విషాదం.. సముద్రంలో గల్లంతై ఇద్దరు యువకులు మృతి!