BRS Party: స్వేఛ్చ బ్యేరో: నల్లగొండ కార్పొరేషన్ పరిధిలోని ఓ వార్డుకు పోటీ చేస్తున్నా.. మాజీ ఎమ్మెల్యే నాకు వార్డుకు పోటీ చేయని చెప్పడంతో పోటీ చేస్తున్నా.. ఆ వార్డులో గెలువాలంటే ప్రతి ఓటర్ కు నగదు ఇవ్వాల్సి ఉంది. కానీ పార్టీ నుంచి గానీ, మాజీ ఎమ్మెల్యే గానీ ఫండ్ ఇవ్వలేదు. అప్పులు చేసి ఇప్పటికే ప్రచారం నిర్వహించా. ఇంకా అప్పులు చేయడం నావల్ల కాదు. అప్పులు చేసి పంచినా గెలుస్తానో లేదో.. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి ముమ్మరంగా ఓటుకు ఇంత అని పంచుతుండు. ఆయనతో నేను పోటీ పడలేను. వాళ్లకు అధికారం ఉంది.’ అందుకే సైలెంట్ అయ్యా’. ఇది బీఆర్ఎస్ పార్టీ నుంచి ఓ వార్డుకు పోటీ చేస్తున్న అభ్యర్థి ఆవేదన.
బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మున్సిపల్ ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కానీ పార్టీ అసెంబ్లీ సెగ్మెంట్ల ఇన్ చార్జులు చేతులెత్తేయడంతో పార్టీ గెలుపుపై ప్రభావం పడే అవకాశం ఉంది. కీలక సమయంలో కొంతమంది దూరంగా ఉండటంతో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లోనూ లబ్ డబ్ నెలకొంది. ప్రచారం నిర్వహించినప్పటికీ పోల్ మేనేజ్ మెంట్‌లో వెనుకబడ్డారని పలువురు నేతలే బహిరంగంగా అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు అభ్యర్థులే ఖర్చు పెట్టుకోవాలని ఇన్ చార్జులు చెప్పడంతో గెలుస్తామా? లేదో తెలియదు.. అప్పులు చేసి పెట్టుకోవడం ఎందుకని అభ్యర్థులు సైతం కొన్ని మున్సిపాలిటీల్లో చేతులు ఎత్తేశారు. పార్టీ అధిష్టానం పెట్టుకున్న ఆశలను కిందిస్థాయి నేతలు తూట్లు పోడుస్తుండటం ఇప్పుడు విస్తృత చర్చజరుగుతుంది.
మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటి అర్బన్ ప్రాంతాల్లోని ప్రజలు బీఆర్ఎస్ వెంటే ఉన్నారని చెప్పాలని ఆపార్టీ అధిష్టానం ప్రణాళికలు రూపొందించింది. ఉమ్మడి జిల్లా నేతలతో సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. మున్సిపాలిటీల బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యే లేదా మాజీ ఎమ్మెల్యేకు అప్పగించారు. ఎన్నికల ప్రచారంతోపాటు ఖర్చు బాధ్యతలను వారికే అప్పగించింది. అయితే ప్రచారం చేపట్టారు. అంతవరకు ఓకే కానీ, పోల్ మేనేజ్ మెంట్ లో మాత్రం వెనుకంజ వేస్తున్నట్లు పార్టీ నేతలే పేర్కొంటున్నారు. టికెట్లను అనుచరులకు ఇప్పించుకున్నారు కానీ ఎన్నికల ఖర్చు మాత్రం ఇవ్వలేదని పార్టీ అభ్యర్థులే అభిప్రాయపడుతున్నారు. అధికారపార్టీకి చెందిన అభ్యర్థులు లక్షల్లో ఖర్చుచేస్తున్నారని వారితో పోటీ పడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నుంచి ఫండ్ వస్తుందని భావించామని కానీ రాలేదని, అసెంబ్లీ ఇన్ చార్జులు సైతం ఇవ్వడం లేదని ఎలా గెలిచేది అని మనస్సులోని ఆవేదనను పలువురు అభ్యర్థులు సన్నిహితులతో పేర్కొంటున్నారు. ఎమ్మెల్యేగానీ మాజీ ఎమ్మెల్యేను గానీ ఫండింగ్ విషయంలో అడిగితే అభ్యర్థులే పెట్టుకోవాలని, తమ దగ్గర లేవని చెబుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎన్నికల ఖర్చుకు లక్షల్లో అప్పులు చేసి ఖర్చుచేశామని, మళ్లీ అప్పులు చేసి ఎలా తీర్చాలనేది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ అప్పులు చేసినప్పటికీ తమకంటే అధికారపార్టీ అభ్యర్థులు ఎక్కువ ఖర్చుచేస్తే వారికి ధీటుగా పోటీపడలేమని పేర్కొంటున్నారు. అందుకే పోల్ మేనేజ్ మెంట్ చేయలేకపోతున్నామని పలువురు చేతులెత్తేసినట్లు విశ్వసనీయ సమాచారం.
Also Read: GHMC: జీహెచ్ఎంసీ చివరి రోజు.. భారీగా శంకుస్థాపనల జోరు..?
కేంద్రం అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వీభజన చేసేందుకు కసరత్తు చేస్తుంది. అయితే కొన్ని మున్సిపాలిటీలు సైతం ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల నుంచి పోయే అవకాశం ఉంది. ఇంకా కొన్ని మండలాలుగానీ, ఇతర నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీలు గానీ చేర్పులు మార్పులు జరిగే అవకాశం ఉంది. అంతేకాదు రిజర్వేషన్లు సైతం మారే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఖర్చు చేయడం ఎందుకని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో లేదు.. పెట్టిన ఖర్చు రావడానికి.. ఖర్చుచేసినా నిరూపయోగంగా మారుతుందనే భావనతోనే అసెంబ్లీ సెగ్మెంట్ల ఇన్ చార్జులు ఖర్చు చేయడంలేదని, అభ్యర్థులకు సైతం ఫండింగ్ చేయడంలేదని పలువురు పేర్కొంటున్నారు. ఈ తరుణంలో పార్టీ ఎంచుకున్న లక్ష్యాన్ని నేతలే గండికొడుతున్నట్లు స్పష్టమవుతుంది.
రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్ చార్జులను నియమించింది. అయితే వారికి పర్యవేక్షణ బాధ్యతలు, నేతల మధ్య కోఆర్డినేషన్ బాధ్యతలను పార్టీ అధిష్టానం అప్పగించింది. అయితే వారికి అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించారు. కానీ పోలింగ్ కు ఒకరోజూ ముందు పోల్ మేనేజ్ మెంట్ చేయాల్సి ఉంది. కానీ పోటీచేస్తున్న అభ్యర్థులకు ఫండింగ్ లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పార్టీ ఎన్నికల ఇన్ చార్జులుగా బాధ్యతలు అప్పగించిన బాధ్యతను సక్సెస్ చేశారా? లేదా? అనేది ఫలితాలపైనే ఆధారపడి ఉంది. అంతేకాదు వారి పనితీరుకు సైతం ఈ ఎన్నికలు గీటురాయి కానున్నాయి. దీంతో ఇన్ చార్జుల్లో ఆందోళన నెలకొంది. వీరితోపాటు పోటీచేస్తున్న అభ్యర్థుల్లోనూ కొంత నైరాశ్యం నెలకొంది. కొంతమంది ఆర్థికంగా ఉన్నవారు మాత్రం దూసుకెళ్తున్నారు. లేనివారు మాత్రం సైలెంట్ అయ్యారు. ఏది ఏమైనప్పటికీ మున్సిపాలిటీ ఎన్నికల్లో మేరకు గులాబీపార్టీ సత్తాచాటుతుందో చూడాలి.