ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని, మెగాస్టార్ చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ ఆంతర్యం ఏంటనేది అధికారికంగా ఎవరూ బయటకు చెప్పలేదు. అటు పార్టీ నుంచి కానీ, ఇటు ఇండస్ట్రీ నుంచి కానీ ఎవరూ పెద్దగా స్పందించలేదు. అయితే అసలు విషయం ఇదేనంటూ బీఆర్ఎస్ అధికారిక మీడియా ఓ కథనం ప్రసారం చేసింది, ప్రచారంలోకి తెచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా చిరంజీవి బరిలో దిగుతారనేది ఆ కథనం సారాంశం. ఓటమి భయంతో ఉన్న కాంగ్రెస్ చివరకు చిరంజీవిని బతిమిలాడుకుంటోందంటూ ఓ పథకం ప్రకారమే కథనాన్ని వండి వార్చారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో సినీ స్టార్
మెగాస్టార్ ను రంగంలోకి దించేందుకు రేవంత్ ప్లాన్
చిరంజీవితో ముఖ్యమంత్రి భేటీ వెనుక మతలబిదే
గెలిస్తే హోం మంత్రి పదవి ఇస్తామని ఆఫర్
ఢిల్లీ టూర్ లో అధిష్టానం ఎదుట ప్రతిపాదన ఉంచే చాన్స్
చిరును లేదా మరో నటుడిని రంగంలోకి దింపే అవకాశం… pic.twitter.com/974rhn4Toc
— TNews Telugu (@TNewsTelugu) August 5, 2025
కత్తిమీద సాము..
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ పై 16వేల ఓట్ల మెజార్టీ సాధించారు. అనారోగ్యం కారణంగా మాగంటి గోపీనాథ్ ఇటీవల మృతి చెందారు. దీంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఇక్కడే బీఆర్ఎస్ ఇరకాటంలో పడింది. వాస్తవానికి సింపతీ ఓటుతో ఈ ఎన్నికల్ని గట్టెక్కాలని బీఆర్ఎస్ భావిస్తోంది. గోపీనాథ్ కుటుంబ సభ్యులకే టికెట్ కేటాయించాలనుకుంటోంది. అయితే అధికార కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఉంటుందనే మాట వాస్తవం. కానీ కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. టికెట్ తనదేనంటున్నారు అజారుద్దీన్, ఆయన స్థానంలో మరో బలమైన అభ్యర్థిని నిలబెడతారా లేదా అనేది తేలాల్సి ఉంది. ఈలోగా పుకార్లతో కాంగ్రెస్ లో గందరగోళం సృష్టించేందుకు బీఆర్ఎస్ మీడియా కష్టాలు పడుతోంది. అదిగో ఫలానా అభ్యర్థికి టికెట్ ఇచ్చారు, ఇదిగో ఫలాన్ అభ్యర్థిని ఖరారు చేశారు, అజారుద్దీన్ కి హ్యాండిచ్చారంటూ కొన్నిరోజులుగా బీఆర్ఎస్ మీడియా, సోషల్ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. తాజాగా చిరంజీవి, రేవంత్ రెడ్డి టూర్ పై కూడా ఇలాంటి ఊహాగానాలే తెరపైకి తెచ్చారు. ఏకంగా చిరంజీవికే టికెట్ ఇస్తున్నారని, లేకపోతే సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరికైనా టికెట్ ఇస్తారంటూ వార్తలిచ్చారు.
బీఆర్ఎస్ ప్రచారం
తెలంగాణలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతోందంటూ బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. ఆ ప్రచారం నిజం అని ప్రజల్ని నమ్మించాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచి తీరాలి. కానీ గ్రౌండ్ లెవల్లో ఆ పరిస్థితి లేదు. బీఆర్ఎస్ లో కూడా వర్గపోరు మొదలైంది. అసలు కేసిఆర్ కుటుంబంలోనే సఖ్యత లేదు, ఇక పార్టీలో ఎక్కడ ఉంటుందనే ప్రశ్న వినపడుతోంది. ఈ దశలో పార్టీ నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించుకోవడం కేటీఆర్ సామర్థ్యానికి పరీక్ష. రిజల్ట్ తేడా కొడితే కవిత నుంచి మరిన్ని విమర్శలు మొదలవుతాయి. పార్టీని నడపడం చేతకాదంటూ ఆమె విమర్శలందుకోవడం గ్యారెంటీ. అందుకే కేటీఆర్ టెన్షన్ పడుతున్నారు. వైరి వర్గాన్ని ఇరుకున పెట్టేందుకు ఇలాంటి కథనాలు రాయిస్తున్నారని అంటున్నారు. ఇలాంటి జిమ్మిక్కులు ఎన్ని చేసినా కేటీఆర్ వ్యూహం ఫలించదని అంటున్నారు నెటిజన్లు. కాంగ్రెస్ వైపు చూస్తున్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించి అక్కడ కూడా ఉప ఎన్నికలు వచ్చేలా చేయాలని ఇటీవల కేటీఆర్ విశ్వ ప్రయత్నాలు చేశారు. చివరకు ఆ వ్యూహం ఫలించలేదు. ఇప్పుడు కనీసం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అయినా గెలవాల్సిన అత్యవసర పరిస్థితి బీఆర్ఎస్ కి ఏర్పడింది. మరి ఈ ఆటంకాన్ని కేటీఆర్ దాటగలరో లేదో చూడాలి.