బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ పాలన, ఆయన ప్రత్యేక రాష్ట్రంలో తీసుకొచ్చిన మార్పులు, నిర్మాణాలు,ప్రాజెక్టుల గురించి పదే పదే ప్రస్తావిస్తుంటారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఆయన గుర్తులను చెరిపేయడానికి ప్రయత్నిస్తున్నదని సందర్భం వచ్చినప్పుడల్లా గుర్తుచేస్తుంటారు. అసలు గుర్తులు అంటే ఏమిటి? ప్రజల మనసులో చెదిరిపోకుండా ఉండేదా? కేవలం ప్రచార ఆర్భాటాలు, తనకు గుర్తింపు రావాలని కట్టిన కట్టడాలా? అనేదానిపై క్లారిటీ మాత్రం కొరవడింది. పాలకులు మంచి చేస్తే ప్రజలు వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు.సంక్షేమం, విద్య, ఆరోగ్యం, ఉద్యోగ కల్పన, మౌలిక సదుపాయాలు ఇవి చాలు. పాలకులకు బ్రహ్మరథం పట్టి మరోసారి వారికి చాన్స్ ఇస్తారు.
కేసీఆర్ తన పదేళ్ల పదవీకాలంలో చేసిన అభివృద్ధి గురించి ఆ పార్టీ నేతలు గొప్పులు చెబుతుంటారు. ఆయనకు ప్రజలు పదేళ్లు అధికారం ఇచ్చారు. ఆయన నిజంగా బంగారు తెలంగాణ చేయాలనుకుంటే ఈ సమయం సరిపోతుంది. కానీ, మొదటి టర్ములో కేసీఆర్ చూపిన తెగువ, రెండో టర్ములో తగ్గిందని ప్రజలే బహిరంగంగా విమర్శించారు.సంక్షేమం సన్నగిల్లిందని, అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని, కబ్జాలు, ధరణి పేరిట భూ అక్రమాలు పెరిగిపోయాయని రోడ్డెక్కి మరీ నిరసనలు, ఆందోళనలు చేశారు. మేధావులు, అసలైన తెలంగాణ ఉద్యమకారులకు కేసీఆర్ మోసం చేశారని వారంతా ఉద్యమరోజులను గుర్తుచేసుకుని రోడ్డెక్కారు.
ఉద్యోగులను పట్టించుకోలేదని, జీతాలు సక్రమంగా ఇవ్వలేదని, పెండింగ్ బిల్లులు చెల్లింపుల్లో నిర్లక్ష్యం, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడంలో జాప్యం వంటివి వారిలో ఆవేశం తెప్పించాయి. బిల్లులు, జీతాలు, పెన్షనర్లకు బెనిఫిట్స్ ఇవ్వడానికి డబ్బులు లేవని ప్రకటించిన నాటి సర్కారు.. ఎన్నికల సమయంలో ఒక నియోజకవర్గానికి రూ.500 నుంచి 600 కోట్లు ఖర్చు ఎలా చేసిందని విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి తోడు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చి రూ. వందల కోట్ల విలువైన ప్రజల సొమ్మును ఇతర రాష్ట్రాల్లో పబ్లిక్ హోర్డింగులు, పత్రికా, మీడియా ప్రకటనలు ఎలా ఇచ్చారని పలువురు నిలదీశారు. ప్రతిపక్షాలు సైతం నాడు కేసీఆర్ తీరుపై ఫైర్ అయ్యాయి.
Congress : ఆ ఇద్దరిలో ఒకరి మంత్రి పదవి ఔట్!
ఇకపోతే సిటీ నడిఒడ్డున అంబేడ్కర్ విగ్రహానికి రూ.200లకు పైగా కోట్లు.. కొత్త సెక్రెటేరియట్ నిర్మాణానికి రూ.1500 కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ. లక్ష కోట్లు, దళిత బంధు పేరిట ఒక్కో లబ్దిదారుడికి రూ.10 లక్షలు ఇచ్చారని.. మరి మిగతా వర్గాలైన బీసీలు గుర్తుకురాలేదా? పలువురు ప్రశ్నించారు. ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ హయాంలో హంగులు, ఆర్బాటాల కోసం వేల కోట్ల విలువైన ప్రజాధనాన్ని ఖర్చుచేశారు. కేసీఆర్ హయాంలో ఈ నిర్మాణాలు జరిగాయని భవిష్యత్ తరాలు చెప్పుకోవడానికే ప్రయారిటీ ఇచ్చారని ఆనాడు ప్రచారం జరిగింది. అడ్డగోలుగా వివిధ కార్పొరేషన్లు, బ్యాంకుల నుంచి అప్పులు తీసుకురావడం వలన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ద్రవ్యోల్బణం పెరిగిపోయిందంటూ సామాన్యులు గగ్గోలు పెట్టారు. మాట్లాడితే బీఆర్ఎస్ లీడర్లు కేసీఆర్ గుర్తులను కాంగ్రెస్ చెరిపేస్తుందని అంటుంటారు. మరి ఇవన్నీ కేసీఆర్ మిగిల్చిన గుర్తులే కదా? వాటిని కూడా కాంగ్రెస్ చెరిపేయడానికి ప్రయత్నిస్తున్నది కదా? అది తప్పా? అని హస్తం నేతలు మండిపడుతున్నారు.కేసీఆర్ గుర్తుల గురించి జనాలను అడిగితే వారే సరైన సమాధానం చెబుతారని అంటున్నారు.