Jagadish Reddy: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మాజీ మంత్రి (Jagadish Reddy) జగదీష్ రెడ్డికి గడ్డుకాలమే. ఈ జిల్లాలో కాంగ్రెస్ కు అనుకూలపవనాలు వీస్తున్నాయి. అన్ని మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ (Congress) కు పట్టుంది. దీంతో ఇక్కడ బీఆర్ఎస్(BRS)ను గెలిపించుకోవడం ఆయనకు కత్తిమీద సాములాంటిదే. అంతేకాదు పనిచేస్తున్నవారికి గుర్తింపు ఇవ్వరని, కేవలం ఆయనకు ఒదిగి ఉండేవారికే ప్రయార్టీ ఇస్తారని.. ఆయన వ్యవహారశైలీతోనే గులాబీ పార్టీ జిల్లాలో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుందని ఆ పార్టీ నేతలే బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. అయినా పార్టీ అధిష్టానం మాత్రం చోద్యంచూస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికల్లో ఎలా విజయం సాధిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా బాధ్యతలను మాజీ మంత్రి జగదీష్ రెడ్డికే అప్పగించింది. ఎన్నికలు వచ్చినా ఆయనే అభ్యర్థుల లిస్టును ఫైనల్ చేశారు. ఆయన చెప్పిందే జిల్లాలో అమలయ్యేది. అయితే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ సిట్టింగ్ అభ్యర్థులపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ తిరిగి మార్పుల్లేకుండా టికెట్లు ఇప్పించుకున్నారు. దీంతో 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆయన నియోజకవర్గం సూర్యాపేట మినహా మిగిలిన 11 స్థానాల్లో ఓటమిపాలయ్యారు. దీంతో జిల్లాలోని పార్టీ నేతలు, కేడర్ లో అసంతృప్తి నెలకొంది. జగదీష్ రెడ్డిపై తీవ్రవ్యరేకత సైతం వ్యక్తమైంది. కొందరు నేతలు బహిరంగంగానే విమర్శలు చేశారు.
జగదీష్ రెడ్డి జిల్లాలో గ్రూపులకు ఆద్యం పోయడం, పనిచేస్తున్నవారికి చెక్ పెట్టారు. అనుచరులకు మాత్రమే పెద్దపీట వేశారు. దీంతో పార్టీ ఓటమికి కారణమనే ఆరోపణలు వచ్చాయి. నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయంగా మరో నేతను ఎదగనీయలేదనే పార్టీ నేతలే పేర్కొంటున్నారు. అందుకు ఉదాహరణ హుజూర్ నగర్ నియోజకవర్గంకు చెందిన మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పార్టీ మారితే ఆ నియోజకవర్గ బాధ్యతలను ఇతర నియోజకవర్గానికి చెందిన బాధ్యతలు అప్పగించారు. ఇది జగదీష్ రెడ్డి శైలీకి నిదర్శమని పలువురు అభిప్రాయపడుతున్నారు. పార్టీని నాశనం చేసిందే జగదీష్ రెడ్డి అని ఈ మధ్యకాలంలో మాజీ ఎమ్మెల్సీ కవిత సైతం మీడియా వేదికగా విమర్శలు చేసిన విషయం విదితమే.
Also Read: Supreme Court: మూడు వారాల్లో తేల్చాలి.. ఫిరాయింపులపై స్పీకర్‌కు సుప్రీం గడువు!
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గులాబీపార్టీలో సీనియర్ నేతలు ఉన్నారు. కార్పొరేషన్లుగా పనిచేసిన వారు ఉన్నారు.ఉద్యమకాలంలో క్రీయాశీలకంగా పనిచేసిన చెరుకు సుధాకర్ ,కర్నె ప్రభాకర్ ,చకిలం శీనివాస రావు , మేడే రాజీవ్ సాగర్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, పల్లె రవికుమార్ వీరేకాదు చాలా మంది ఉన్నారు. అయితే ఆ నాయకులు రాజకీయంగా ఎదిగితే తనకు నష్టమని వారిపై కుట్రలో చేశారనే ఆరోపణలు ఉన్నాయి. పార్టీలో సైతం కీలక పదవులు ఇవ్వకుండా, అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు రాకుండా అడ్డుకున్నారనే విమర్శలు ఉన్నాయి. నకిరేకల్ కు చెందిన ఎమ్మెల్యే వీరేశంకు సైతం టికెట్టు రానివ్వకుండా చేయడంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ప్రకటించారు. అంతేకాదు కొన్ని నియోజకవర్గాల్లో గ్రూపులకు జగదీష్ రెడ్డి ఆజ్యం పోశారనే ఆరోపణలు ఉన్నాయి. పలువురు నేతలు సైతం బహిరంగంగానే ప్రకటించారు. దీంతో కొంతమంది పార్టీలో ఉన్నప్పటికీ అసంతృప్తితోనే ఉన్నారు.
మున్సిపల్ ఎన్నికల ఇన్ చార్జుల నియామకంలో తన సన్నిహితులకే టికెట్లు ఇప్పించుకున్నారని జగదీష్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా సమావేశాలకు సైతం కార్పొరేషన్లుగా పనిచేసినవారికి ఆహ్వానించడం లేదనే పలువురు ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ జిల్లాకు చెందిన నేతలు యాక్టీవ్ గాపనిచేసినవారికి ఇన్ చార్జీగా అవకాశం కల్పించలేదని సమాచారం. వారికి ఇతర జిల్లాల్లోని మున్సిపాలిటీలకు ఇన్ చార్జులుగా బాధ్యతలు అప్పగించాలని పార్టీ అధినేతకు సూచించడంతోనే వారికి బాధ్యతలు అప్పగించినట్లు ప్రచారం జరుగుతుంది.
కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు ఉద్యమకారులకు ప్రియార్టీ ఇవ్వడం లేదని జగదీష్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని, ఆయన ఉమ్మడి జిల్లాలోని ఉద్యమకారులకు ఎవరికి ప్రయారిటీ ఇచ్చారని పలువురు ప్రశ్నిస్తున్నారు. చెప్పేముందు ఆచరించాలని, అలాకాకుండా మీడియా ముందు మాత్రం మాటలు చెప్పడం ఎంతవరకు సమంజసమని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 19 మున్సిపాలిటీలకు గాను 18 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. నకిరేకల్ మున్సిపాలిటీ పదవికాలం పూర్తి కాకపోవడంతో ఎన్నికలు నిర్వహించడం లేదు. అయితే 18 మున్సిపాలిటీల్లో ఇన్ని ఒడిదుడుకుల మధ్య ఎలా విజయం సాధిస్తారనేది ఇప్పుడు విస్తృత చర్చజరుగుతుంది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో 12 స్థానాలకు 11 స్థానాల్లో విజయం సాధించింది. ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ విజయం సాధించడం కోసం ఉమ్మడి జిల్లాలోని ఇద్దరు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విస్తృత ప్రచారం చేస్తున్నారు. గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ కొంత వెనుకబడిందనే పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు.
పార్టీ అగ్రనేతలు ప్రచారానికి రాకపోవడం, జగదీష్ రెడ్డిపై పార్టీ సీనియర్లలో అసంతృప్తి ఉండటం, యాక్టీవ్ గా పనిచేసిన నేతలకు గుర్తింపును ఇవ్వకపోవడం, ఉద్యమకారులను సైతం దగ్గరకు తీయలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎలా గట్టెక్కిస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. జగదీష్ రెడ్డి పనితనానికి, ఆయన రాజకీయ భవిష్యత్ కు ఈ మున్సిపల్ ఎన్నికలు నిదర్శనంగా మారనున్నాయి. ఎలా వ్యూహాలను అనురించి గట్టెక్కిస్తారు.. మంత్రులను ఎలా ఎదుర్కుంటారు..ప్రజలను ఎలా ఆకట్టుకుంటారనేది చూడాలి.
Also Read: Telangana Municipal Elections: పవన్ కళ్యాణ్ ప్రచారం రద్దు.. తెర వెనుక ఏం జరిగింది?