Mission Telangana: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాజకీయ క్షేత్రంలో పాగా వేసేందుకు భారతీయ జనతా పార్టీ తన అసలైన అస్త్రాలను ప్రయోగిస్తోంది. మొన్నటి వరకు ఒక లెక్క.. ఇకపై మరో లెక్క అన్నట్లుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పెషల్ టీమ్ రంగంలోకి దిగనుంది. పశ్చిమ బెంగాల్ వంటి క్లిష్టమైన రాష్ట్రాల్లో ఎన్నికల వ్యూహకర్తలుగా పేరుగాంచిన షా టీమ్ ఇప్పుడు తెలంగాణ గడ్డపై తిష్ట వేయనుంది. తెలంగాణలో ఈనెల 10వ తేదీన ప్రధాని మోడీ భారీ బహిరంగ సభ అనంతరం ఈ బృందం పూర్తిస్థాయిలో తెలంగాణపై దృష్టిసారించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమ తర్వాత టార్గెట్ తెలంగాణ అని మోడీ సభతో చెప్పకనే చెబుతున్న కాషాయ పార్టీకి.., త్వరలో షా టీమ్ తెలంగాణకు రానుందనడంతో మరింత జోష్ ను తెచ్చిపెడుతోంది. అధికారం కోసం కాషాయ పార్టీ నేతలు కన్న కలలు ఈ దెబ్బతో అయినా నిజమవుతాయనే ఆశతో నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ తన మిషన్ తెలంగాణను అత్యంత వ్యూహాత్మకంగా మలిచింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీని సైతం ఉక్కిరిబిక్కిరి చేసిన అమిత్ షా కోర్ టీమ్, ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా ఆపరేషన్ మొదలుపెట్టడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా, ప్రతి నియోజకవర్గంలో ఉన్న కుల సమీకరణాలు, అసమ్మతి నేతలు, మరియు ప్రజల్లో ఉన్న అసంతృప్తిపై ఈ బృందం డేటాను సేకరించనుంది.
ఢిల్లీ నుంచి వచ్చిన అమిత్ షా ప్రత్యేక దూతలు స్థానిక నేతలతో సంబంధం లేకుండా సొంతంగా సర్వేలు నిర్వహిస్తూ, ఎప్పటికప్పుడు రిపోర్టులను హైకమాండ్‌కు పంపించనున్నారు. పూర్తిస్థాయిలో మైక్రో మేనేజ్‌మెంట్ పై షా టీమ్ ఫోకస్ పెట్టనుంది. బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం నాయకత్వ సంక్షోభంలో ఉందని బీజేపీ గట్టిగా నమ్ముతోంది. ముఖ్యంగా కవిత చుట్టూ తిరుగుతున్న పరిణామాలు ఆ పార్టీకి నైతికంగా పెద్ద దెబ్బ అని బీజేపీ భావిస్తోంది. బీఆర్ఎస్‌లో అసంతృప్తితో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఆకర్షించడం ద్వారా, ఆ పార్టీ పునాదులను దెబ్బతీయాలని షా టీమ్ ప్లాన్ చేస్తోంది. బీఆర్ఎస్ ఖాళీ చేసే స్థానాన్ని కాంగ్రెస్ కాకుండా తామే భర్తీ చేయాలనేది కాషాయ దళం అసలు ఎత్తుగడ.
Also read: Rakul Preet Singh: లేడీ బాస్ గెటప్ లో ఆకట్టుకుంటున్న రకుల్ ప్రీత్ సింగ్!
ఇకపోతే.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున, సహజంగానే వచ్చే ప్రభుత్వ వ్యతిరేకతని క్యాష్ చేసుకోవాలని బీజేపీ చూస్తోంది. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో జరుగుతున్న జాప్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఇస్తున్న నిధులను హైలైట్ చేస్తూ, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడం ఈ వ్యూహంలో భాగంగా తెలుస్తోంది. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌ను ఢీకొనేందుకు అనుసరించిన బూత్ లెవల్ ఏజెంట్ వ్యవస్థను తెలంగాణలోనూ బలోపేతం చేస్తున్నారు.
పార్టీపై నిబద్ధత గల కార్యకర్తలను గుర్తించి, వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా పోలింగ్ రోజున గట్టి ప్రభావం చూపాలని భావిస్తున్నారు. షా బృందం ఆధ్వర్యంలో ఒక భారీ సోషల్ మీడియా నెట్‌వర్క్ పనిచేస్తోంది. ప్రతిపక్షాల వైఫల్యాలను ట్రోల్ చేయడం, కేంద్ర ప్రభుత్వ విజయాలను ప్రతి గడపకు చేర్చడం ద్వారా నరేటివ్ ను తమకు అనుకూలంగా మార్చుకోవడమే వీరి పనిగా తెలుస్తోంది. బెంగాల్ తరహాలో ‘షా టీమ్’ ఇక్కడ కూడా అద్భుతాలు చేస్తుందా? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. మొత్తం మీద, తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ యాక్షన్ ప్లాన్ మొదలైందని స్పష్టమవుతోంది.
Also Read: సాగునీటి ప్రాజెక్టులపై కవిత ఆరోపణలు.. నష్ట నివారణకు రంగంలోకి హరీశ్!