Telangana Politics: గూలబీ దళాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారట పార్టీ ముఖ్య నేతలు. అందుకోసం పక్క పార్టీ నేతలపై ఫోకస్ పెంచారనే టాక్ జోరుగా వినిపిస్తోంది. నియోజకవర్గాల్లో పట్టున్న ఇతర పార్టీ నేతల వివరాలను ఆరా తీస్తుందనే చర్చ స్టార్ట్ అయింది. నియోజకవర్గంలో ఇద్దరు లీడర్ల తయారీ చేసే పనిలో పడిందంటున్నారు. పక్క పార్టీల నుంచి జాయిన్ అయ్యే నేతలకు ఆఫర్లు కూడా ఇస్తున్నారన్న ప్రచారం ఆసక్తికరంగా మారింది
వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెడుతున్న బీఆర్ఎస్
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారభించే వ్యూహాంలో బీఆర్ఎస్ ఉందంట. పార్టీ బలోపేతంపై బీఆర్ఎస్ ఇప్పటి నుంచే ఫోకస్ చేసిందంటున్నారు. నియోజకవర్గాల్లో ఇతర పార్టీలకు చెందిన బలమైన నేతలపై ఫోకస్ పెట్టిందనే చర్చ ఇంటర్నల్‌గా నడుస్తుందట. అసెంబ్లీ సెగ్మెంట్‌ల వారీగా బలమైన నేతల వివరాలు సేకరించే పనిలో పడిందంట. ఇతర పార్టీల్లో యాక్టివ్‌గా ఉన్న నాయకులు ఎవరున్నారు? అలాంటి వారిని పార్టీలో చేర్చుకుంటే ఎలా ఉంటుందని అనేదానిపై ఆరా తీస్తుందట. అలాంటి నేతలను చేర్చుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేస్తుందనే చర్చ నడుస్తోంది. నియోజకవర్గాల్లో యాక్టివ్‌గా ఉండి.. సొంత అసంతృప్తిగా ఉన్న నేతలను తమవైపుకు తిప్పుకునేందుకు ఇప్పటి నుంచే యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తుందట.
సెగ్మెంట్లలో ఇప్పటి నుంచే బలమైన నాయకత్వం కోసం ఏర్పాట్లు
రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పటిష్టమైన నాయకత్వాన్ని తయారు చేసే పనిలో గులాబీ అధిష్టానం నిమగ్నమైందనే చర్చ పార్టీ నేతల్లో నడుస్తోంది. అందుకు పక్కా ప్లాన్ ప్రకారం ముందుకు సాగుతుందట. అందులో భాగంగానే నియోజకవర్గాల వారీగా నేతల వివరాలు సేకరిస్తుందట. పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీ నేతల్లో బలమైన నేతలు ఎవరెవరు ఉన్నారు?.. వారు సామాజిక సేవా కార్యక్రమాలతో వెళ్తున్నారా…లేకుంటే పార్టీ బలం వారికి ఉందా?.. వారి రాజకీయ భవిష్యత్ ఏంటి? వారిని తమ వైపుకు తిప్పుకుంటే కలిసి వస్తుందా లేదా అనే దానిపై ఆరా తీస్తుందట. బలమైన నేతలు ఉంటే వారిని ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా చేర్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆ క్రమంలో ఇప్పటి నుంచే నియోజకవర్గాల్లో పటిష్టమైన నాయకత్వం తయారు చేసేందుకు సిద్ధమవుతుందట. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి అవకాశం ఇవ్వకుండా తామే అధికారంలోకి రావడానికి ప్రణాళిక బద్దంగా ముందుకు సాగాలని గులాబీ అధినాయకత్వం భావిస్తుందట.
మరో నేతను రాజకీయంగా ఎదగనివ్వలేదని ఆరోపణలు
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యేలనే నియోజకవర్గానికి సుప్రీంను చేసింది. నియోజకవర్గానికి పార్టీ ఇన్చార్జి బాధ్యతలు సైతం వారికే అప్పగించింది. దీంతో ఆ నియోజకవర్గాల్లో మరో నేతను రాజకీయంగా ఎదగనివ్వలేదనే ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు ఎవరైనా ఎదిగే ప్రయత్నం చేసినా వారిని అణిచివేశారని పలువురు నేతలు బహిరంగంగానే ఆరోపణలు చేశారు. ఈ పరిస్థితులతో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత రావడం.. ఆరోపణలు వచ్చిన నేతలను 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించడంతో ఓటమి చవిచూడాల్సి వచ్చిందంటున్నారు.
పార్టీ క్యాడర్‌ను గైడ్ చేసే నాయకత్వం కరువు
అటువంటి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ సెకండ్ గ్రేడ్ నాయకత్వం లేకుండా పోయింది. అంతేకాదు పార్టీ క్యాడర్ ను గైడ్ చేసే నాయకత్వం లేకుండా పోయిందనే చర్చ నడుస్తోందట. ఈ అన్ని పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న బీఆర్ఎస్ అధిష్టానం ప్రతీ నియోజకవర్గంలో ఇద్దరు లీడర్లు ఉండేలా కసరత్తు ప్రారంభించిందనే టాక్ వినిపిస్తోంది. ఎవరు పార్టీ మారినా నేతలకు కొదవలేదు.. తాము బలంగా ఉన్నామని క్యాడర్ కు భరోసా ఇచ్చేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతుందట.
రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇస్తామని భరోసా..
పార్టీలో చేరే నేతలకు ఆఫర్లు కూడా ఇస్తున్నట్లు సమాచారం. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి .. లేదా రాబోయే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇస్తామని భరోసా ఇస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రెండ్రోజుల క్రితం ఆర్మూర్‌కు చెందిన బీజేపీ నేత ఆలూరు విజయభారతి పెద్దసంఖ్యలో తన అనుచరులతో కలిసి బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆమెకు పార్టీ అలాంటి ఆఫరే ఇచ్చినట్లు ప్రచారం జరగుతోంది. డైరెక్టుగా పార్టీ అధిష్టానంతో ఒప్పందం కుదుర్చుకొని ఆమె పార్టీలో చేరినట్లు నేతలు చెవులు కొరుక్కుంటున్నారట. ఇలా మరికొన్ని నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తున్నట్లు ప్రచారం ఊపందుకుంది. ఎమ్మెల్యేగా పనిచేసిన నేతల పనితీరు ఆశించిన మేర లేకపోవడంతోనే పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్న కొందరు నేతలు
పార్టీలోని నేతల పనితీరు మార్చుకోవాలని సూచించినా మార్పు రాకపోవడం, ప్రజల్లో ఉండకుండా రాజధానిలో మకాం వేయడం, కొంతమంది నేతలు అసలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంతో పార్టీ కేడర్ లో అసంతృప్తి ఉన్నట్లు పార్టీ చేయించుకున్న సర్వేల్లో వెల్లడైనట్లు గూలబీ నేతలు అంటున్నారు. దీంతో ఆ నేతలకు చెక్ పెడితేనే రాబోయే ఎన్నికల్లో మెజార్టీ సీట్లు కైవసం చేసుకోవచ్చని భావిస్తున్న పార్టీ పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ఏది ఏమైనా గులాబీ అధిష్టానం పార్టీని గాడిలో పెట్టే పనిలో నిమగ్నం కావడంతో క్యాడర్ హర్షం వ్యక్తం చేస్తోంది.
Story By Rami Reddy, Bigtv