BRS Party: జనవరి వస్తోంది.. సారు బయటకు వస్తారు.. ఇక తిరుగులేదని సంబరపడ్డారు ఆ పార్టీ నేతలు. కానీ జనవరి వచ్చింది. సారు కాస్త వెనుకడుగు వేసినట్లు ప్రచారం ఊపందుకుంది. కారణాలు ఏవైనా సారు మాత్రం, ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వచ్చే దాఖలాలు లేవని ప్రచారం సాగుతోంది. దీని వెనుక ఉన్న కారణం ఏదైనా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన బాధలు ఏ పార్టీకి లేవంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పదేళ్ల పాలన అనంతరం జరిగిన ఎన్నికల్లో పార్టీ అధికారం నిలబెట్టుకోలేక పోయింది. కాంగ్రెస్ గెలిచింది.. ఎవరు సీఎం కాకూడదని బీఆర్ఎస్ భావించిందో, ఆయనే సీఎం సీట్లో కూర్చొన్నారు. అయితే సీఎంగా రేవంత్ రెడ్డికి ఛాన్స్ ఊరకే రాలేదని ఇటీవల నల్గొండ గద్దర్ పాడిన పాట హిట్ సాధించిన విషయం తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ వాదులను ఏకతాటిపైకి తీసుకురావడమే కాక, రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను సీఎం సక్సెస్ చేశారు. తెలంగాణలోని ప్రతి అణువణువు తెలిసిన నేతగా రేవంత్ రెడ్డికి పేరు, అందుకే సీఎం స్థానంలో ఆయనను కాంగ్రెస్ అధిష్టానం కూర్చోబెట్టిందని చెప్పవచ్చు.
అయితే సీఎంగా రేవంత్ రెడ్డి నోటిఫికేషన్స్, పథకాలు, సంక్షేమం, అభివృద్ది, మౌలిక సదుపాయాల కల్పన వీటి లక్ష్యంగా దూసుకుపోతున్నారు. ఇదే ఇప్పుడు బీఆర్ఎస్ కు రుచించడం లేదని టాక్. గులాబీ పార్టీ ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటును సాధించక పోవడం కూడ ఆ పార్టీకి ఎదురులేని దెబ్బగా చెప్పవచ్చు. అందుకే ఎలాగైనా నిరంతరం ప్రజల్లో ఉండాలని మాజీ సీఎం కేసీఆర్ భావించారు. పార్టీని బలోపేతం చేయడంతో పాటు, క్యాడర్ ను కాపాడుకోవాలని భావించారు.
జనవరి నెలలో ప్రజల్లోకి కేసీఆర్ వస్తున్నట్లు ప్రచారం సైతం సాగింది. అంతలోనే కేసీఆర్ తనయుడు కేటీఆర్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఫార్ములా ఈ కార్ రేస్ లో అవినీతి జరిగిందంటూ ఏసీబీ కేసు నమోదు చేయడం, ఎఫ్ఐఆర్ లో కేటీఆర్ పేరు ఉండడంతో గులాబీ దళంకు చిక్కులు వచ్చాయని చెప్పవచ్చు. మొన్నటి వరకు ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత జైలులో ఉండి బెయిల్ పై బయటకు రావడం ఆనందకర విషయమే అయినప్పటికీ, అంతలోనే కేటీఆర్ పై ఏసీబీ, ఈడీ కేసు నమోదు చేయడంతో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. ఈ విషయం ప్రస్తుతం న్యాయస్థానంలో ఉండగా, కేటీఆర్ విషయం పూర్తిగా తేలిన తరువాతే కేసీఆర్ జనంలోకి వస్తారని ప్రచారం సాగుతోంది.
Also Read: CM Revanth Reddy: దాహపు కేకలకు శుభం కార్డు వేయండి.. సీఎం రేవంత్ రెడ్డి
అలాగే సంక్రాంతి తరువాత కేసీఆర్ టూర్ ఖరారు కానున్నట్లు కూడ తెలుస్తోంది. మొత్తం మీద ఒకటి వెళ్ళాక మరొక సమస్య బీఆర్ఎస్ చుట్టూ తిరుగుతుండగా, గులాబీ బాస్ ఏం చేస్తారన్నది ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది.