CM Revanth Reddy: రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై ప్రత్యేక దృష్టిసారించి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. హైదరాబాద్ మహానగరం తో సహా, రాష్ట్రవ్యాప్తంగా త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి సీఎం పలు సూచనలు జారీ చేశారు.
వచ్చే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం జలమండలి బోర్డు సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన సీఎం, త్రాగునీటి సమస్యపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమీక్షకు సీఎం సలహాదారులు నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో జనాభాకు సరిపడే విధంగా తాగునీటి సరఫరా చేస్తున్నామని, నీటి సరఫరాకు నగరంలో మొత్తం 9.800 కిలోమీటర్ల మేర డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ద్వారా 13.79 లక్షల కనెక్షన్లతో నీటి సరఫరా చేస్తున్నట్టు సమావేశంలో అధికారులు వివరించారు. నగరానికి మంజీరా, సింగూరు, గోదావరి, కృష్ణా నుంచి నీటి సరఫరా జరుగుతుండగా, గోదావరి ఫేజ్ 2 ద్వారా మరింత నీటిని తరలించి ఉస్మాన్‌సాగర్ , హిమాయత్‌సాగర్ వరకు తాగునీటి సరఫరాకు డిజైన్ చేసిన ప్రాజెక్టుపై సమావేశంలో చర్చ జరిగింది.
హైదరాబాద్ తాగునీటి అవసరాలకు సంబంధించి కన్సల్టెన్సీ ఇచ్చిన నివేదిక ఆధారంగా నీటి లభ్యత, లిఫ్టింగ్ వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని మల్లన్నసాగర్ నుంచే గోదావరి ఫేజ్-2 తాగునీటి సరఫరా ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించారు. గతంలో ప్రతిపాదించిన 15 టీఎంసీలకు బదులు, సిటీ అవసరాల దృష్ట్యా 20 టీఎంసీల నీటిని తరలించేలా మార్పులకు ఆమోదం తెలిపారు.
హైదరాబాద్ జలమండలి ఆదాయ వ్యయాల నివేదికను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించగా, జలమండలి తమ సొంత ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించాలని, అందుకు అనుసరించాల్సిన విధానాలను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. జలమండలి కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు అవసరమయ్యే నిధులను సమకూర్చుకోవాలని, తక్కువ వడ్డీతో రుణాలు తెచ్చుకునే ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. అందుకు వీలుగా ప్రాజెక్టు డీపీఆర్లు తయారు చేయించాలని చెప్పారు.
గతంలో ఏఏ జిల్లాల్లో త్రాగునీటి ఎద్దడి సమస్య అధికంగా ప్రభావం చూపిందన్న విషయంపై సీఎం ఆరా తీశారు. వచ్చే వేసవిలో మంచినీటి సరఫరాకు సంబంధించి ఎక్కడ సమస్య తలెత్తకుండా అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ మహానగరంలో సమర్థవంతంగా మంచినీటి సరఫరా చేసే ప్రణాళికలపై సుదీర్ఘ చర్చ సాగింది. హైదరాబాద్ ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తుగా అధికారుల అప్రమత్తమై అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.
వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామీణ ప్రాంతాలలో సైతం నీటి సమస్య తలెత్తకుండా స్థానిక అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని ఉన్నతాధికారులను సీఎం కోరారు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంచినీటి సరఫరాకు సంబంధించి ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తమైందని చెప్పవచ్చు.
ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో హైదరాబాద్ జలమండలి బోర్డుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకుని మంచినీటి సరఫరాకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష
హైదరాబాద్ మహానగరంలో వినియోగదారులకు సమర్థవంతంగా మంచినీటి సరఫరా చేసే ప్రణాళికలపై చర్చ
హాజరైన సీఎం… pic.twitter.com/Rhoo0QRpxo
— BIG TV Breaking News (@bigtvtelugu) January 3, 2025