ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఎప్పుడైనా అవకాశం కోసం ఎదురుచూస్తుంటుంది. మంచి చాన్స్ రాగానే అధికార పార్టీని ఇరకాటంలో పెట్టి తలకిందులు చేసి ప్రజల్లో మంచి పేరు సంపాదించుకుంటుంది. ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందడం లేదని, వెనకవడిన వర్గాలకు న్యాయం చేయడం లేదని విమర్శలు చేస్తూనే మరోసారి గద్దెనెక్కెందుకు మార్గం సుగమం చేసుకుంటుంది. ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే రాబట్టుకునే ప్లాన్స్ చేస్తుంటుంది. కానీ, రాష్ట్రంలోని ప్రతిపక్ష బీఆర్ఎస్.. అందివచ్చిన అవకాశాన్ని జారవిడుచుకుంది.
బీఆర్ఎస్ అధికారానికి దూరం కావడంతో పార్టీలోనూ లుకలుకలు మొదలయ్యాయి. చాలా మంది కీలక నేతలు పార్టీ యాక్టివిటీస్‌కు దూరంగా ఉంటున్నారు.చిన్న చితకా లీడర్స్ అంటే ఏమో అనుకోవచ్చు. గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారంతా క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొనడం లేదు.కేవలం కేటీఆర్, హరీశ్ రావులు.. అప్పుడప్పుడు నగరంలోని ముఖ్యనేతలు మాత్రమే హడావుడి చేస్తున్నారు. ఇక జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు బయటకు రావడం లేదు. ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ నదీ జలాలపై చర్చ పెట్టినప్పుడు ప్రతిపక్షనేత కేసీఆర్ బయటకు వచ్చి గతంలో తాము ఏం చేశామో ప్రజలకు చెప్పాల్సింది. కానీ ఆయన రాలేదు.
డిప్యూటీ ఫ్లోర్ లీడర్ స్థానంలో ఉన్న హరీశ్ రావు గతంలో నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. అప్పుడు ఆయనకు ఆ ఫంక్షనింగ్ ఎలా ఉంటుందో తెలుసు. పాలమూరు రంగారెడ్డి విషయంపై ప్రభుత్వం ప్రశ్నలు అడినప్పుడు.. ఏపీతో గత సర్కార్ హయాంలో చేసుకున్న ఒప్పందాలపై క్లారిటీ ఇవ్వాల్సి ఉండే.. బచావత్, బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్స్ ఏం చెప్పాయి.. నీటి వాటాల కేటాయింపులు.. ఉమ్మడి ఏపీలో జరిగిన జలదోపిడీ.. బీఆర్ఎస్ వచ్చాక కట్టిన ప్రాజెక్టులు, అందుబాటులోకి వచ్చిన సాగు, ఆయకట్టు.. ఖర్చుల వివరాలు, ఏపీకి 511, తెలంగాణకు 299 టీఎంసీలకే ఎందుకు అంగీకరించాల్సి వచ్చింది.. అది శాశ్వత అగ్రిమెంటా? కదా? ఎందుకు ఎక్కువ నీటిని వినియోగించుకోవడానికి ప్రయత్నించలేదు.. అప్పుడు ఎదురైన ఇబ్బందులను సభావేదికగా వివరిస్తే బాగుండేది.కానీ, సమావేశాలను హరీశ్ రావు బహిష్కరించడం వలన డ్యామేజ్ ఎవరికి జరిగిందనేది ఆ పార్టీకి త్వరలోనే అర్థం అవుతుందని చర్చ జరుగుతున్నది.
Phone Tapping Case: బిగ్ బ్రేకింగ్.. సీఎం రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మాజీ జల సలహాదారు వెదిరె శ్రీరామ్ మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక ఏర్పడిన తొలి ప్రభుత్వానికి బంగారం లాంటి చాన్స్ వచ్చినా ఉపయోగించుకోలేదని అన్నారు. ఉమ్మడి ఏపీలో బచావత్ ట్రిబ్యునల్ 811 టీఎంసీలను కేటాయించింది. రాష్ట్రం విడిపోయాక మిగులు జలాలు, పరివాహక ప్రాంతాన్ని బట్ట జలాల కేటాయింపులు జరగాల్సి ఉంది.ఆ సమయంలో కేసీఆర్ సర్కార్ తమకు ఎక్కువ నీళ్లు కావాలని కొట్లాడలేదు. ఉమ్మడి ఏపీలో తెలంగాణకు అన్యాయం జరిగినందున ఎక్కువ వాటా డిమాండ్ చేస్తే ఫలితం ఉండేది. కానీ, 2015లో ఏపీ- తెలంగాణ ఒప్పందం ప్రకారం.. అప్పటి ప్రభుత్వం 299 టీఎంసీలకే సంతకం పెట్టారు. కానీ, అది ఏడాది వరకే టైం. మళ్లీ సమావేశమైనప్పుడు అయినా ఎక్కువ టీఎంసీలు డిమాండ్ చేయకుండా అలాగే పొడగించుకుంటూ పోయారు. ఫలితంగా ఏపీ ఎక్కువ నీళ్లు వాడుకునే చాన్స్ నాటి కేసీఆర్ సర్కార్ ఇచ్చిందని కుండబద్దలు గొట్టారు. అసలు విషయాన్ని బీఆర్ఎస్ ధైర్యంగా సభలో చెప్పి తమ తప్పును అంగీకరించి.. కాళేశ్వరం ద్వారా జరిగిన ప్రయోజనాలను వివరించి ఉంటే ఆ పార్టీ అంతో కొంత మైలేజ్ దక్కేదని ప్రస్తుతం చర్చ జరుగుతుంది. దొరికిన చాన్స్ మిస్ చేసుకుని ఇప్పుడు బాధపడితే ఏం లాభం అని పలువురు సెటైర్లు వేస్తున్నారు.