Congress Rally: స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. దళిత స్పీకర్‌ను కించపరిచేలా మాట్లాడటం కేవలం ఒక వ్యక్తిని అవమానించడం కాదని, దళితుల ఆత్మగౌరవాన్ని అవమానించడమేనని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శామీర్‌పేట్‌లో భారీ ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు.
దొంగలమైసమ్మ నుంచి తుంకుంట చౌరస్తా వరకు డప్పుల దరువులు, నినాదాలతో కాంగ్రెస్ శ్రేణులు కదం తొక్కాయి. ర్యాలీలో భారీగా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డప్పుల దరువులతో కార్యకర్తల్లో ఉత్సాహం వెల్లివిరియగా.. డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ సైతం కార్యకర్తలతో కలిసి ఉత్సాహంగా స్టెప్పులు వేశారు. దీంతో ర్యాలీలో సందడి నెలకొంది. భారీ జనసందోహంతో రాజీవ్ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. కొంతసేపు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు.“పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం చేశారు? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి చేశామో చర్చిద్దాం. ప్రజల ముందే లెక్కలు తేల్చుకుందాం. తుంకుంటలోని అంబేద్కర్ విగ్రహం వద్దకైనా వచ్చి చర్చించేందుకు మేము సిద్ధం” అని వజ్రేష్ యాదవ్ సవాల్ చేశారు. దళిత స్పీకర్‌ను గౌరవించాల్సింది పోయి వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదన్నారు. దళిత స్పీకర్ ఉన్నందునే మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని విమర్శించారు. తాతా మధు, నవీన్‌రెడ్డి వెంటనే ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Also read: బిగ్ బాస్ కి టాలెంట్ అక్కర్లేదా.. రిజెక్ట్ చేయడంతో నిజాలు బయటపెట్టిన రాజకుమారి!
రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు నక్క ప్రభాకర్ గౌడ్ బీఆర్ఎస్ నేతల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ హక్కుల వల్లే నేడు ఒక దళిత బిడ్డ అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్నారని అన్నారు.“ఈరోజు ఒక దళిత నాయకుడైన స్పీకర్‌ను తిడితే.. రేపు మన పరిస్థితి ఏంటి? రాజ్యాంగం కల్పించిన హక్కులను, పదవులను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. స్పీకర్‌ను అవమానించే వ్యాఖ్యలను సహించేది లేదు” అని ప్రభాకర్ గౌడ్ హెచ్చరించారు. తాతా మధు, నవీన్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందన్నారు. మరో రెండేళ్లలో మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేస్తామని తెలిపారు.మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిందని, ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ భారీ మెజారిటీ స్థానాలు గెలుచుకుంటుందనే భయంతోనే బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చెందుతున్నారని ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యే ఎదుట చొక్కా విప్పి నిరసన వ్యక్తం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీలను పదవుల నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ర్యాలీ అనంతరం తుంకుంటలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి తోటకూర వజ్రేష్ యాదవ్, కూన శ్రీశైలం గౌడ్,నక్క ప్రభాకర్ గౌడ్ పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. రాజ్యాంగం, సామాజిక న్యాయం, దళితుల ఆత్మగౌరవ పరిరక్షణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని నాయకులు స్పష్టం చేశారు.“స్పీకర్‌ను అవమానించిన ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలి.. రాజీనామా చేయాలి” అంటూ కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఆత్మగౌరవ ర్యాలీతో శామీర్‌పేట్–తుంకుంట ప్రాంతంలో రాజకీయ వేడి మరింత పెరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గజాల కాంతం, టీపీసీసీ జనరల్ సెక్రటరీ పీసరి మహిపాల్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు బాల్‌రెడ్డి, మహేష్ గౌడ్, బీపీటీ రాజు, జిల్లా ఓబీసీ చైర్మన్, డివిజన్ అధ్యక్షులు సందీప్ గౌడ్, మల్లేష్ గౌడ్, సురేందర్ ముదిరాజ్, చాప రాజు, అలియాబాద్ మున్సిపల్ చైర్మన్ శిరీష కృష్ణారెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు రమేష్, ఆర్టీఏ సభ్యుడు జైపాల్ రెడ్డి, వేముల శ్రీనివాస్ రెడ్డి, రమణారెడ్డి, రంజిత్, మాజీ కౌన్సిలర్లు మహేష్, స్వామి యాదవ్, దేవా, సాయిపేట శ్రీనివాస్, వేణుగోపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఎద్దు నగేష్, రామన్నగారి రఘు గౌడ్, సంతోష్ గౌడ్, కిషోర్ యాదవ్, అశోక్, కోమలి, తదితరులు పాల్గొన్నారు.
Also read: ఫోన్ ఛార్జర్‌పై Qi గుర్తు ఎందుకు ఉంటుంది? దీని వెనుక ఇంత అర్థం ఉందా!