Amaravati Farmers: అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాజధాని రైతులకు బ్యాంక్ రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. 2026 జనవరి 6 వరకు రైతులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్నట్లు మంత్రి నారాయణ బుధవారం ప్రకటించారు. రూ.1.50 లక్షల వరకు రైతుల రుణాలను మాఫీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అమరావతి పరిధిలోని తుళ్లూరు మండలం వడ్డమానులో బుధవారం మంత్రి నారాయణ పర్యటించారు. రెండో విడత రాజధాని భూసేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతులు భూసేకరణ అంగీకార పత్రాలను మంత్రికి అందజేశారు.
మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల బ్యాంక్ రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. రాజధాని కోసం రైతుల నుంచి సేకరించిన భూమిని త్వరగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. మూడేళ్లలో అంతర్జాతీయ ఎయిర్ పోర్టు, క్రీడా ప్రాంగణం పూర్తిచేయాలని సీఎం ఆదేశించారన్నారు. స్థానిక ఎమ్మెల్యే శ్రావణ కుమార్ రైతుల రుణాలు మాఫీ చేయాలని కోరారన్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని, దానికి ఆయన అంగీకరించారని చెప్పారు. అలాగే రైతుల కౌలు పెంచేందుకు సీఎం ప్రాథమికంగా అంగీకరించారన్నారు.
Also Read: వేగం పెంచిన కూటమి సర్కార్.. అడ్డంకులు తొలగిస్తూ ‘అమరావతి’ పరుగులు
గతంలో రాజధాని భూసేకరణకు భూములిచ్చిన రైతులకు రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ చేశామని, ఇప్పుడు కూడా ఇదే తరహాలో రుణమాఫీ చేస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని ఇప్పటికే సీఎం చంద్రబాబు అంగీకరించారని అన్నారు. జనవరి 6లోపు తీసుకున్న బ్యాంక్ లోన్లకు మాఫీ వర్తిస్తుందన్నారు. రెండో విడత భూసమీకరణలో సేకరించిన భూములను ఎయిర్‌పోర్ట్, రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్, స్మార్ట్ పరిశ్రమలు, స్పోర్ట్స్ సిటీకి ఉపయోగిస్తామన్నారు. అలాగే రైతులకు కేటాయించే స్థలాల్లో రోడ్లు, విద్యుత్ లైన్లు వంటి పనులు పూర్తి చేసి అందిస్తామని నారాయణ స్పష్టం చేశారు.