MLA Harish Rao: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టి వేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. ఈ క్రమంలో నేతలంతా హరీష్‌రావు ఇంటికి చేరుకున్నారు. పరిస్థితి గమనించిన ఎమ్మెల్యే హరీష్‌రావు మీడియా ముందుకొచ్చారు.
న్యాయస్థానం తీర్పుపై నోరు విప్పారు మాజీ మంత్రి. న్యాయస్థానం ఆదేశాలు ఇంకా చేతికి రాలేదని, వచ్చిన తర్వాత ఏం చెయ్యాలనే దానిపై న్యాయవాదులతో మాట్లాడు తున్నామని చెప్పారు. కేవలం విచారణ కొనసాగించాలని మాత్రమే చెప్పిందన్నారు. తమకు న్యాయస్థానాల మీద గౌరవం ఉందన్నారు. సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలా? లేదా? అనేదానిపై న్యాయవాదుల నుంచి సలహాలు తీసుకుంటామన్నారు.
ఈనెల 9న విచారణకు కేటీఆర్ కచ్చితంగా వెళ్తారని తెలిపారు. ఇది అక్రమ కేసని భావించి బీఆర్ఎస్ పార్టీ న్యాయస్థానానికి వెళ్లిందన్నారు. విచారణకు సహకరిస్తామని కేటీఆర్ సైతం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ కోసమే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
కేవలం ప్రజల దృష్టి మరలించేందుకు ప్రభుత్వం ఈ విధంగా చేస్తోందన్నారు హరీష్‌రావు. సోమవారం విచారణకు కేటీఆర్ ఏసీబీ ఆఫీసుకు వెళ్లారని గుర్తు చేశారు. ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి పోలేదని, అలాంటప్పుడు అవినీతి ఎలా జరిగిందని ప్రశ్నించారు.
ALSO READ: కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల రాళ్ల దాడులు..
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికే ఫార్ములా ఈ కారు రేసును తీసుకొచ్చా మన్నారు. న్యాయస్థానం, అధికారుల మీద తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. దీనిపై కొందరు కాంగ్రెస్ నేతలు సోషల్‌మీడియాలో రకరకాలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు.
ఉద్యమంలో తాము పోరాటం చేశామని, అప్పుడే అరెస్ట్ అయ్యామని గుర్తు చేశారు. పార్టీ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది తర్వాత ఆలోచిస్తామన్నారు. గ్రీన్ కో సంస్థకు అప్పటి ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదన్నారు. బ్రాండ్ ఇమేజ్ కోసం గ్రీన్ కో ఖర్చు చేసిందన్నారు.