BRS Party: స్వేచ్ఛ బ్యూరో: పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెడుతుందా? లేదా? అనేది చర్చకు దారితీసింది. అసలు కమిటీ వేసి బీఆర్ఎస్ నేతలకు శిక్ష తరగతులు నిర్వహిస్తుందా? పార్టీ అనుబంధ సంఘాలు ఉన్నాయా? ఉంటే అవి పని చేస్తున్నాయా? అసలు పార్టీ బలోపేతం ఎప్పుడూ? మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీల ఏర్పాటు చేస్తారా? చేయరా? చేస్తే ఎప్పుడు? అనేది ప్రశ్నగా మారింది. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టని బీఆర్ఎస్ అధిష్టానం ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా దృష్టి సారించడం లేదనేది ఇప్పుడు పార్టీ కేడర్ లోనే జరుగుతుంది.
బీఆర్ఎస్ పార్టీ 2017లో పార్టీ గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు వేసింది. ఆతర్వాత పార్టీ బలోపేతంపై దృష్టిసారించలేదు. కేవలం సభ్యత్వ నమోదు చేయించింది. కానీ కమిటీలు వేయలేదు. సుమారు 8 ఏళ్లుగా పార్టీ కమిటీలు వేయలేదు. అయితే 2023 ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడం, ప్రధానప్రతిపక్ష పార్టీగానే మిగిలింది. ఆ తర్వాత వచ్చిన ఏ ఎన్నికల్లోనూ ఆశించిన ఫలితాలు సాధించలేదు. అంతేకాదు పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కొన్ని స్థానాల్లో పోటీకి దూరంగా ఉంది. రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లోనూ విజయం సాధించలేకపోయింది. దీనికి తోడు సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లోనూ అనుకున్న స్థాయిలో సత్తాచాటలేకపోయామని పార్టీ కీలక నేతలే ప్రకటించారు. కానీ ఈ ఫలితాలు రావడానికి కారణాలను మాత్రం పార్టీ అధిష్టానం సమీక్షించడం లేదని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. ఓటములపై పున:సమీక్షించకపోవడంతోనే వరుస ఓటములకు కారణమని, దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడంతోనే ప్రతికూల ఫలితాలు వస్తున్నాయనేది పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
ఏ పార్టీ అయినా క్షేత్రస్థాయి నుంచి బలంగా ఉంటేనే ఏ ఎన్నికలు వచ్చినా సత్తాచాటుతుంది. అనుకూలమైన ఫలితాలు వస్తాయి. కానీ కేడర్ ను, పార్టీని బలోపేతం చేయకుండా ఆశించిన ఫలితాలు రావాలని గులాబీ పార్టీ అధిష్టానం ఆశిస్తుంది. కానీ సంస్థాగతంగా పార్టీ నిర్మాణంపై దృష్టి సారించక పోవడమే ఓటములకు కారణమని పార్టీ సీనియర్లు బహిరంగంగానే పేర్కొంటున్నారు. పార్టీ నేతలకే పదవులు లేకుండా ఎలా పనిచేస్తారని ప్రశ్నలు సైతం ఉత్పన్నమవుతున్నాయి. కేడర్ తో ఉత్సాహంగా పనిచేయించాలంటే గ్రామ కమిటీలు పూర్తి స్థాయిలో వేసినప్పుడు మాత్రమే సాధ్యమని పలువురు పేర్కొంటున్నారు. అందుకు మాత్రం పార్టీ దృష్టిసారించడం లేదు. కనీసం పార్టీ మెంబర్ షిప్ సైతం చేస్తామని ప్రకటించిన అధిష్టానం.. ఆ దిశగా మాత్రం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఏ కార్యచరణతో ప్రజల ముందుకు వెళ్లాలో తెలియక పార్టీ నేతలు సతమతమవుతున్నారు.
Also Read: Rajya Sabha: రాజ్యసభ సీటుపై వీడనున్న సస్పెన్స్.. అదృష్టం ఎవరికి వరించెనో..?
బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సైతం పూర్తి స్థాయిలో లేదు. కమిటీలో ఉన్న నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లడంతో వాటిని కూడా భర్తీ చేయలేదు. మరోవైపు ఇతర పార్టీల నుంచి మళ్లీ బీఆర్ఎస్ లో చేరిన సీనియర్ నేతలకు సైతం పదవులు ఇవ్వలేదు. దీంతో వారు సైతం నిరాశకు గురవుతున్నారు. దీనికి తోడు ఇప్పటికీ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలే నియోజకవర్గ ఇన్ చార్జులుగా కొనసాగుతుండటంతో అక్కడ పార్టీ బలోపేతం కావడం లేదని, ప్రజల నుంచి సైతం పార్టీకి సరైన స్పందన రావడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నప్పటికీ గులాబీ పార్టీకి మాత్రం సానుకూలత రావడం లేదని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక అంశాలపై పోరాటం చేస్తే తప్ప గులాబీవైపు ప్రజలు చూస్తారని పలువురు పేర్కొంటున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మాత్రమే టీఆర్ఎస్ పార్టీ శిక్షణ తరగతులు నిర్వహించింది. అప్పుడు యాక్టీవ్ కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో నేతలు ఉండేవారు. తర్వాత అధికారంలోకి వచ్చాక ఎన్నడూ సంస్థాగత నిర్మాణంపై కానీ.. శిక్షణ తరగతుల గురించి కానీ ఆలోచన చేయలేదు. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా ఉద్యమాలను నిర్మించడంలో బీఆర్ఎస్ నాయకత్వం ఆలోచన చేయడం లేదని సొంత పార్టీ నేతలే పేర్కొంటున్నారు.
పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు.. సభ్యత్వ నమోదును ప్రారంభిస్తామని గత ఏడాది ప్రారంభంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు మీడియా ముందుకు ప్రకటించారు. గత ఏప్రిల్ 27న బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభను వరంగల్ లో గ్రాండ్ గా నిర్వహించింది. మళ్లీ బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం దగ్గరికి వస్తున్నప్పటికీ.. పార్టీ సంస్థాగత నిర్మాణంపై గులాబీ పార్టీ నాయకత్వం దృష్టి పెట్టలేదు. అన్ని జిల్లాల్లో శిక్షణా తరగతులు సైతం నిర్వహిస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ గతం లో చెప్పినా నేటికీ ఆచరణ కి నోచుకోలేదు. పార్టీకి అనుబంధ సంఘాలు ఉన్నాయా లేవా? అనేది ఇప్పుడు చర్చకు దారితీసింది. పార్టీ కీలక నేతలు తప్ప అనుబంధ సంఘాలు విద్య, నిరుద్యోగ, ఉద్యోగ, రైతు, మహిళల, ఎస్సీ, ఎస్టీ విభాగాలు పోరాట బాటపట్టిన దాఖలాలు లేవు. పదవుల కోసం నేతలు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం స్పందించి సంస్థాగత నిర్మాణంపై దృష్టిసారిస్తుందా? లేదా? అనేది పార్టీలో చర్చకుదారితీసింది.
Also Read: Loan Harassment: లోన్ రికవరీ కోసం మిమ్మల్ని వేధిస్తున్నారా?.. భయపడొద్దు.. ఇలా చేయండి..!