Medak Municipality: స్వేఛ్చ బ్యూరో: ఢిల్లీలో కాంగ్రెస్, బిజెపి పార్టీలకు వైరమున్న మెదక్ బల్దియాలోకాంగ్రెస్, బిజెపి, బీఎస్పీ సహకరించుకోవడం. అనైతిక చర్య అని మాజీ డిప్యూటీ స్పీకర్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. నిత్యం కాంగ్రెస్, బిజెపి నాయకులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తు పోసుకుంటూ.. మెదక్ మున్సిపల్ పోరులో ఇరు పార్టీలు సహకరించుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. మరోసారి మెదక్ ప్రాంత ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని చెప్పారు. అభివృద్ధి పేరుతో ఎన్నికల రాగానే ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేస్తూ ప్రజలను ప్రలోభ పెడుతుందని గుర్తు చేశారు. ఎన్నికల్లో మద్యం ,డబ్బు ఏరులై పారిన ప్రభుత్వ అధికారులు, పోలీస్ శాఖ పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ఎన్నికల్లో అభ్యర్థులపై అట్రాసిటీ కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
అభ్యర్థులను ప్రచారం చేయనీయకుండా చేశారని , కేవలం అధికారం కోసమే కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని ఆరోపించారు. ప్రజలు గమనిస్తున్నారని , బిఆర్ఎస్ పై నమ్మకాన్ని ఉంచి కాంగ్రెస్ కన్నా అధిక స్థానాలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే సమయంలో మెదక్లో అవినీతి జరగకుండా చూసే బాధ్యత కౌన్సిలర్ల పై ఉందని, వారికి బి ఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కెసిఆర్ ఆదేశాల మేరకు మెదక్ లో బిఆర్ఎస్ పార్టీ గట్టిగా పని చేసిందని అందుకే ప్రజలు ఆదరించి కాంగ్రెస్ కన్నా పెద్ద మెజార్టీతో సభ్యులను గెలిపించాలని పేర్కొన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మెదక్ పట్టణాభివృద్ధి కి కృషి చేస్తామన్నారు. మున్సిపల్ శాఖలో ఏ అవినీతి జరిగిన భయపడకుండా ప్రజల ముందు ఉంచుతామని తెలిపారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం ముందుంటుందని స్పష్టం చేశారు. ఈ తీర్పును శిరసా వహించి ప్రజల కోరిక మేరకు పని చేస్తామని తెలిపారు.
అనంతరం మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ మాట్లాడుతూ.. కెసిఆర్, హరీష్ రావు మెదక్ గురించి ముందే చెప్పారని, మెదక్‌లో రౌడీయిజం నడుస్తుందని నివారించాలంటే బలంగా ప్రజలను ఏకం చేయాలని అన్నారని గుర్తు చేశారు. వార్డులో తిరుగుతుంటే ప్రజలే బిఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారని రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీని ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూస్తారని వారికి తగ్గట్టుగా అభివృద్ధి మరియు వారికున్న సమస్యలపై పోరాటం చేయాలని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ.. విపరీతమైన డబ్బులు, మద్యం పంచడంలో కాంగ్రెస్ పార్టీ ముందుందని అన్నారు. బిఆర్ఎస్ కార్యకర్తలపై అధికార పార్టీ పోలీస్ అధికారులతో ఒత్తిడి చేసి ఓట్లను దెబ్బతీయాలని ఆలోచన చేసిందని , అలాంటి పట్టించుకోకుండా ప్రజలు స్పష్టంగా బిఆర్ ఎస్ పార్టీకి మెజార్టీ ఇచ్చారని పేర్కొన్నారు. అట్రాసిటీ కేసుల పోలీస్ అధికారులు పెట్టడం సమంజసం కాదని అన్నారు. అధికార పార్టీకి పోలీసు అధికారులు ఇంతగా సహాయం చేయడం ఎక్కడ చూడలేదని విమర్శించారు.
ప్రజలు విశ్వసించి కాంగ్రెస్ కన్నా ఎక్కువ మెజార్టీతో కౌన్సిలర్లను గెలిపించడం కాంగ్రెస్ కు బుద్ధి చెప్పినట్లేనని అన్నారు. ప్రజలు మనపై ఉంచిన విశ్వాసాన్ని మరింత పెంచుతూ మెదక్ మున్సిపల్ లో ప్రతిక్షణం అభివృద్ధి పై పోరాటం చేయాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు విశ్వసించి పూర్తి మెజార్టీతో బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పియడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కెసిఆర్ సూచన మేరకు హరీష్ రావు, పద్మాదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీ పనిచేస్తుందని తెలిపారు. కంఠరెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మెదక్ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని అన్నారు. మెదక్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఆగడాలను గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ పక్షాన నిలబడతారని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో పట్టణ పార్టీ కన్వినర్ కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులుతోపాటు నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ లు రాజవ్వ,లలిత, స్వరూప, గంగామణి,జుబెర్ అహ్మద్, అనీస్ ఫాతిమా, సంధ్య, రాజశేఖర్, మహమ్మద్ గౌస్, శృతి,సోహెల్ మోహిద్దీన్, దీపక్, రాణి,ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Prathyusha: నటి ప్రత్యూష మృతి… 24 ఏళ్ల నాటి కేసులో తుది తీర్పు నేడే!