Minister Damodar Rajanarsimha: జీవో 317 పై కేబినెట్ సబ్ కమిటీ మరోసారి సమావేశమైంది. రాష్ట్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ సబ్ కమిటీ సభ్యులు, ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో 317 జీవోపై చర్చించారు. ఈ సమావేశంలో సాధారణ పరిపాలన శాఖ జీవో 317 పై స్థానికతకు సంబంధించి రెండు రకాల ప్రతిపాదనలను కేబినెట్ సబ్ కమిటీ ముందు ప్రతిపాదించింది. ఈ అంశాలను సాధారణ పరిపాలన ముఖ్క్ష్య కార్యదర్శి, రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌తో సంప్రదించి తుది నివేదికను తమ ముందు సమర్పించాలని కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది.
ఇక జీవో 46కు సంబంధించిన అంశాలపై న్యాయ నిపుణులతో చర్చ చేసింది. ఈ సమావేశంలో రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి మహేశ్ దత్ క్కా, శివశంకర్, బూసాని వెంకటేశ్వర రావు కేబినెట్ సబ్ కమిటీ కన్సల్టెంట్, జాయింట్ సెక్రెటరీ సర్వీసెస్, జీ సునీత దేవి, మల్లికార్జున్ సహా ఇతర అధికారులు పాల్గొన్నారు.
Also Read: ఎల్ఆర్ఎస్ విషయమై శుభవార్త చెప్పిన ప్రభుత్వం
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలను పునర్వ్యవస్థీకరించింది. పది జిల్లాలను 33 జిల్లాలకు పెంచింది. ఆ తర్వాత వెంటనే ఉద్యోగులను వర్క్ టు ఆర్డర్ పేరిట కేటాయింపులు జరిపింది. శాశ్వత కేటాయింపులు జరపలేదు. జిల్లాలతో పాటు ప్రభుత్వం కొత్త జోన్లు, మల్టీ జోన్లనూ తెచ్చింది. కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లలో తమకు నచ్చిన చోటుకు అధికారులు వెళ్లడానికి అవకాశం కల్పిస్తూ 317 జీవోను 2021లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసింది. అందుకు దరఖాస్తులకు అంగీకరించింది. అయితే.. ఇక్కడ సీనియారిటీ, సీరియస్ అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో డిమాండ్ ఉన్న చోటుకు ఎక్కువ సీనియారిటీ ఉన్న ఉద్యోగులు ఎంచుకుంటే.. తక్కువ సీనియారిటీ ఉన్న ఉద్యోగులకు ఆప్షన్స్ తక్కువయ్యాయి. ఇది వివాదానికి దారి తీసింది. వీటితోపాటు మరికొన్ని సమస్యలను ఉద్యోగులు, ముఖ్యంగా టీచర్లు ముందుకు తెచ్చారు.