Case Against Aghori: రెండు తెలుగు రాష్ట్రాలలో లేడీ అఘోరీగా పరిచయమైన అఘోరీ మాతపై పోలీసులు కేసు నమోదు చేశారు. అది కూడా బలి ఇచ్చినట్లు ఫిర్యాదు రాగా, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే అఘోరీ కోసం పోలీసులు వెతుకుతున్నట్లు కూడా సమాచారం. అసలేం జరిగిందంటే..
తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన అఘోరీ మాత మరో వివాదంలో చిక్కుకున్నారు. ఏపీ పర్యటన సమయంలో హల్చల్ చేసి పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన అఘోరీ మాత అంటే తెలియని వారుండరు. శ్రీకాళహస్తి వివాదం నుండి మంగళగిరి వరకు ఈమె పర్యటన వివాదాల చుట్టే సాగింది. మంగళగిరిలో అయితే ఏకంగా కర్ర తీసుకొని దాడికి కూడా పాల్పడ్డారు. అంతేకాదు డిప్యూటీ సీఎం పవన్ ను తాను కలవాల్సిందేనంటూ రహదారిపై బైఠాయించి, పోలీసులు తాళ్లతో కట్టి తీసుకెళ్లే స్థితికి అఘోరీ మాత వివాదాన్ని తీసుకెళ్లారు. ఇలా ఏపీలో హల్చల్ చేసి తెలంగాణలో ఎంటర్ అయిన అఘోరీ వరంగల్ శ్మశానవాటిక కు చేరుకున్నారు.
అక్కడ చేసిన ఓ బలి ప్రస్తుతం కేసు నమోదు వరకు తీసుకెళ్ళింది. ఈనెల 19వ తేదీన వరంగల్ లోని బెస్త శ్మశానవాటిక లో పూజలు నిర్వహించారు. ఈ పూజలు ఎలా సాగాయంటే, స్థానిక ప్రజలు నిద్ర కూడా పట్టని రీతిలో సాగాయని వారు తెలుపుతున్నారు. ఏకంగా బ్రతికి ఉన్న కోడిని మంటల్లో వేసి పూజలు చేసినట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. చిన్నపిల్లలు ఉండే ప్రాంతంలో ఈ పూజలు ఏమిటని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అంతేకాదు ఈ పూజలు అఘోరీ ఎవరి కోసం, ఎందుకోసం చేశారో అర్థం కావట్లేదని స్థానికులు ధైర్యంగా లేడీ అఘోరీ కారుకు అడ్డుపడి నిలదీశారు.
ఇప్పుడు పూర్తిగా గడ్డం, మీసాలు పెంచిన ఆఘోరీ మాత్రం తాను ఏ పూజలు చేయలేదని, ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తాజాగా అఘోరీ కోడిని బలి ఇవ్వడంపై మాత్రం రోహన్ రెడ్డి అనే విద్యార్థి మామునూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అలాగే అఘోరీ మాత ఆచూకీ కోసం పోలీసులు గాలింపు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా వరంగల్లోని స్మశాన వాటికను ఆవాసంగా ఏర్పాటు చేసుకున్న అఘోరీ మాతపై పోలీసులు కేసు నమోదు చేయడంతో మరోమారు వార్తల్లో నిలిచారు.