Parakala : ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో అనే డైలాగ్ ఇప్పటికీ ఫేమసే. ఆ డైలాగే ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో వైబ్రేషన్ పుట్టిస్తోంది. అప్పటి డైలాగ్ సినిమాలో వినిపిస్తే, ఇప్పటి డైలాగ్ మాత్రం ఓరుగల్లు పాలిటిక్స్ లో వినపడుతోంది. ఇంతకీ ఆ డైలాగ్ వెనకున్న అర్థమేంటి ? ఎవరికి మైండ్ బ్లాంక్ అవుతోంది.
తెలంగాణలో కాంగ్రెస్ వేవ్ నడుస్తోంది. అయితే ఈ పరిస్థితులు ఇప్పటికిప్పుడు రాలేదు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నెలల తరబడి రచించిన వ్యూహాలు ఇప్పటి పొలిటికల్ ఈక్వేషన్స్ ను పూర్తిగా మార్చేశాయి. కాంగ్రెస్ పార్టీ కనుమరుగయింది అని విమర్శించిన నేతలే.. రాష్ట్రంలో కాంగ్రెస్ తప్ప మరొకటి లేదు అనేలా చేయడంలో సక్సెస్ అయ్యారు రేవంత్. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో ములుగు మినహా 11 స్థానాల్లోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కేసీఆర్ కు కంచుకోటగా ఉన్న వరంగల్లో, కారు పార్టీ అభ్యర్థులను ఢీ కొట్టడానికి పక్కా వ్యూహాలతో ముందుకెళ్లింది కాంగ్రెస్. బలమైన అభ్యర్థులను బరిలోకి దింపడంలో సక్సెస్ అయ్యింది.
వరంగల్‌లోని పరకాల అసెంబ్లీ సెగ్మెంట్‌లో పోరు మరింత రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నియోజకవర్గంలో బలమైన నేతగా ఎదగడంతో, ధీటైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అందుకోసం నర్సంపేట నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగాల్సిన రేవూరి ప్రకాశ్ రెడ్డిని హస్తం గూటికి ఆహ్వానించారు. వెంటనే పరకాల సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దించారు. తనపై పోటీకి సరైన అభ్యర్థులే లేరని చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలకు టైం చూసి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన రేవూరికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మంచి పట్టు ఉంది. ఎలాంటి అవినీతి మరకలు లేకపోవడం, సౌమ్యునిగా పేరు ఉండడం అతనికి కలిసొచ్చే అంశం. అయితే తనను పరకాల అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత సైలెంట్ గా ఆపరేషన్ హస్తం కొనసాగిస్తున్నారు రేవూరి ప్రకాష్ రెడ్డి.
పరకాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు చెందిన ప్రజాప్రతినిధులను కారు పార్టీకి రాజీనామా చేయించి హస్తం గూటికి చేరుస్తున్నారు. ఆత్మకూరు మండలంలోని ఎంపీపీ మార్క సుమలత, జడ్పీటీసీ కక్కెర్ల రాధిక, ఎంపీటీసీ హర్షం వరుణ్ తోపాటు మరి కొంతమంది కీలక బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. మరుసటి రోజే పరకాల మండల కేంద్రం నుండి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను కాంగ్రెస్ పార్టీలో చేర్పించడంలో రేవురి సక్సెస్ అయ్యారు. పరకాల ఎంపీపీ స్వర్ణలత, సర్పంచులు క్రాంతి కుమార్, ఈశ్వరమ్మ, లక్ష్మీపురం ఎంపీటీసీ సునీత, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ పదవుల్లో ఉన్న కీలక నేతలు గులాబీ పార్టీకి రాజీనామా చేసి హస్తం గూటికి చేరారు.
పరకాల అసెంబ్లీ సెగ్మెంట్‌కు స్థానికేతరుడైన రేవూరి ప్రకాశ్ రెడ్డి అభ్యర్థిత్వం ఖరారు అయిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి వ్యూహం మార్చారు. గులాబీ శ్రేణులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అందులో స్థానికేతరుల ప్రభావం అసలే ఉండదని, డిపాజిట్లు కూడా రావని కీలక వ్యాఖ్యలు చేశారు. సో, ఆ వాఖ్యలకు కౌంటర్ ఇవ్వడానికి రేవూరి మౌనం పాటిస్తూనే బీఆర్ఎస్ అభ్యర్థి చల్లాకు దిమ్మతిరిగేలా సమాధానం చెబుతున్నారని చర్చ నడుస్తోంది. పార్టీ పదవుల్లో ఉన్న వారిని సైతం తన వైపు తిప్పుకోవడంలో రేవూరి సఫలమయ్యారని, ఈ పరిణామాలు బీఆర్ఎస్ అభ్యర్థిలో కలవరం పెంచాయన్నది స్థానికుల మాట.
మొత్తమ్మీద రేవూరి.. పదకం ప్రకారం తన పని తానూ చేసుకుంటూ పోతున్నాడు. వివాద రహితుడిగా పేరుగాంచిన రేవూరి సైలెంట్ గా చల్లా ధర్మారెడ్డికి షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. పక్క నియోజకవర్గ నేతలు ఇక్కడికి వచ్చి పోటీ చేస్తే.. డిపాజిట్లు వస్తాయా అన్న వాళ్లకు.. అదే స్టైల్ లో కౌంటర్లు ఇస్తున్నారు.