Meerpet Constable: ఖాకీ దుస్తుల్లో ఉండి రక్షించాల్సిన రక్షక భటుడే భక్షకుడిగా మారాడు. నమ్మకాన్ని వమ్ము చేస్తూ స్టేషన్‌లో భద్రపరిచిన సొత్తుపైనే కన్నేశాడు. విధుల్లో ఉండాల్సిన బాధ్యతను మరిచి, నేరస్థుడిలా ప్రవర్తించిన ఓ కానిస్టేబుల్ ఉదంతం హైదరాబాద్‌లో కలకలం రేపింది. సీజ్ చేసిన మొబైల్ నుంచి డబ్బులు కాజేసి, బంగారాన్ని తాకట్టు పెట్టిన ఈ ఘరానా మోసం పోలీసు శాఖలోనే చర్చనీయాంశమైంది.
ఫోన్ పే ట్రిక్‌తో రూ.1.70 లక్షలు మాయం
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రవణ్ కుమార్ తీవ్రమైన అవినీతికి పాల్పడ్డాడు. ఓ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్‌లో భద్రపరిచిన నిందితుడి మొబైల్ ఫోన్ శ్రవణ్ కంట పడింది. దానిని అదనుగా భావించిన అతడు, ఆ ఫోన్‌లోని ఆన్‌లైన్ పేమెంట్ యాప్స్ ద్వారా ఏకంగా రూ.1,70,000 నగదును తన బంధువుల ఖాతాలకు బదిలీ చేసుకున్నాడు. ఎవరికీ అనుమానం రాదన్న ధీమాతో ఈ డిజిటల్ చోరీకి పాల్పడ్డాడు.
బంగారానికి కన్నం.. తాకట్టులో 12 తులాల ఆభరణాలు
కేవలం ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లతోనే సరిపెట్టుకోని శ్రవణ్ కుమార్, తన దురాశను మరింత పెంచుకున్నాడు. అదే కేసులో పోలీసులు ఎంతో భద్రంగా సీజ్ చేసి ఉంచిన 12 తులాల బంగారు ఆభరణాలపై కన్నేశాడు. స్టేషన్‌లో భద్రతను విస్మరించి, ఆ బంగారాన్ని బయటకు తీసుకెళ్లి ప్రైవేటు వ్యక్తుల వద్ద తాకట్టు పెట్టాడు. ఆ వచ్చిన డబ్బును తన వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నాడు.
ఇట్టే దొరికిపోయిన వైనం
కొద్ది రోజులుగా రికార్డుల్లో తనిఖీలు చేస్తుండగా సీజ్ చేసిన ప్రాపర్టీలో తేడాలు రావడంతో గుట్టు రట్టయింది. ఉన్నతాధికారులు ఆరా తీయగా శ్రవణ్ కుమార్ బండారం బయటపడింది. వెంటనే అప్రమత్తమైన మీర్‌పేట్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి మోసానికి పాల్పడిన కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్‌ను అధికారికంగా అరెస్టు చేశారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే నేరాలకు పాల్పడితే ఇలాంటి కఠిన శిక్షలే తప్పవని ఈ ఘటన మరోసారి నిరూపించింది.
Also Read: కాంగ్రెస్ డ్రామాలను సహించేదే లేదు.. ఇండీ కూటమిపై విరుచుకుపడ్డ రాంచందర్ రావు