Perni Nani: మచిలీపట్నంలో వైఎస్సార్‌సీపీ, కూటమి నేతల మధ్య రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. స్థానిక రెవెన్యూ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో పాటు కూటమి ప్రభుత్వంపై ఆయన విమర్శల బాణాలు సంధించారు.
కూటమి నేతల వేధింపులు.. డ్రామాలు
మచిలీపట్నంలో కూటమి నాయకుల కుట్రలు, వేధింపులు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయని పేర్ని నాని మండిపడ్డారు. వారం రోజుల కిందటే తాము సమావేశం కోసం రెవెన్యూ కల్యాణ మండపాన్ని బుక్ చేసుకుంటే, కూటమి నేతలు కావాలనే తమ కంటే ఒక్క రోజు ముందు అక్కడ మీటింగ్ పెట్టి మండప యాజమాన్యాన్ని తీవ్రంగా వేధించారని ఆరోపించారు. కూటమి సమావేశాల్లో ఏకైక ఎజెండాగా తనను, పేర్ని కిట్టును తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. స్థానిక ఎమ్మెల్యే కొల్లు రవీంద్రను లక్ష్యంగా చేసుకుంటూ, ఆయన రాజకీయాల్లో కమల్ హాసన్‌ను మించిన నటన కనబరుస్తున్నారని విమర్శించారు.
పోర్టు అభివృద్ధి ఎవరి హయాంలో?
బందరు సమగ్ర అభివృద్ధి ఒక్క జగన్ హయాంలోనే సాధ్యమైందని పేర్ని నాని స్పష్టం చేశారు. ‘బందరుకు నిజమైన పోర్టును తీసుకొచ్చిన జగన్ గారిది అభివృద్ధా? లేక పోర్టు పేరుతో, గోవా షిప్‌యార్డ్ పేరుతో వ్యాపారాలు చేస్తున్న కూటమి నేతలది అభివృద్ధా?’ అని నిలదీశారు. తాను ఎన్నడూ కుల రాజకీయాలు చేయలేదని, బందరు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేశానని తెలిపారు.
స్థానిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ సన్నాహాలు
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో కూటమికి నిలబెట్టేందుకు అభ్యర్థులు కూడా లేని పరిస్థితి ఉందన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలకే ప్రాధాన్యతా క్రమంలో స్థానిక ఎన్నికల టికెట్లు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు. కార్యకర్తలందరూ ఐక్యంగా, క్రమశిక్షణతో శ్రమించి పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని పేర్ని నాని పిలుపునిచ్చారు.
Also Read: రేవంత్‌కు మైండ్ దొబ్బింది.. మంచి డాక్టర్‌కి చూపించండి: రాంచందర్ రావు