Chandrababu: తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా బలంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు పార్టీ అధినేత చంద్రబాబు. రెండు రాష్ట్రాలుగా విడిపోయాక.. కొందరు చేతకాని వ్యక్తులు మళ్లీ రెండు రాష్ట్రాలను కలిపేస్తామంటున్నారని.. బుద్ది, జ్ఞానం ఉండేవాళ్లు ఎవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయరని పరోక్షంగా వైసీపీ నేతలపై మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయినా.. కలిసి పనిచేస్తే దేశానికే ఆదర్శంగా నిలుస్తాయన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎక్కడ అనే వారికి ఖమ్మంలో ‘టీడీపీ శంఖారావం’ సభలో తెలుగు తమ్ముళ్ల ఉత్సాహమే సమాధానమన్నారు చంద్రబాబు.
ఆంధ్రప్రదేశ్‌లో గాడి తప్పిన పాలనను మళ్లీ గాడిలో పెడతానన్నారు. తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. జ్ఞానేశ్వర్ లాంటి నాయకులను అభివృద్ధి చేసి పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని అన్నారు.
తెలుగు ప్రజలు తనకు ఎన్నో అవకాశాలు ఇచ్చారని.. 9 ఏళ్లు సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా.. పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉండటం కూడా రికార్డే అన్నారు. రాబోయే రోజుల్లో తన రికార్డును ఎవరూ బద్దలకొట్టలేరని.. 40 ఏళ్లు ఆశీర్వదించిన తెలుగు జాతికోసం జీవితాంతం పనిచేస్తానని చంద్రబాబు చెప్పారు.
“ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు ఒక శక్తి.. ఒక వ్యవస్థ. ఆయన అధికారం కోసం పార్టీ పెట్టలేదు. హైదరాబాద్‌లో తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. నేను కోరుకునేది అధికారం కాదు.. తెలుగు వారు ఎక్కడ ఉన్నా మీ అభిమానం కోరుకుంటున్నా” అని ఖమ్మం సభలో చంద్రబాబు గుర్తు చేశారు.