Chintal Jewellery Shop: స్వేచ్ఛ బ్యూరో: జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని చింతల్‌లో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు దుకాణానికి వెళ్లిన దంపతుల రెండేళ్ల కుమార్తె.. బంగారం నాణ్యతను పరీక్షించేందుకు ఉపయోగించే రసాయనాన్ని నోట్లో పెట్టుకోవడంతో అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ మృతి చెందింది . రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే..
గోపికృష్ణ, జానకి దంపతులు తమ రెండేళ్ల కుమార్తె మిషాతో కలిసి చింతల్‌లోని విష్ణు జువెలర్స్‌కు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు వెళ్లారు. తల్లిదండ్రులు ఆభరణాలను పరిశీలిస్తున్న సమయంలో చిన్నారి అక్కడ ఉన్న బంగారం నాణ్యతను పరీక్షించే రసాయనాన్ని నోట్లో పెట్టుకున్నట్లు సమాచారం. దీంతో ఆ రసాయనం కడుపులోకి వెళ్లి చిన్నారి అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయినప్పటికీ పరిస్థితి విషమించడంతో మిషా చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
దుకాణం ముందు కుటుంబ సభ్యుల ఆందోళన
చిన్నారి మృతికి విష్ణు జువెలర్స్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. రసాయనాన్ని పిల్లలకు అందుబాటులో ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దుకాణం ఎదుట శనివారం ధర్నాకు దిగారు. ఘటనపై సంబంధిత అధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: కాంగ్రెస్‌ది ‘జెన్ జీ’ థింకింగ్.. ప్రత్యర్థులకు దిమ్మతిరిగేలా మంత్రి పొంగులేటి షాకింగ్ కామెంట్స్!