Choutuppal Murder: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలక పరిధిలోని మార్కండేయ నగర్ కాలనీలో అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. స్థానికంగా జోగిని గా గుర్తింపు పొందిన రాళ్లబండి సుధాకర్ (45) అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో లోపలికి ప్రవేశించిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు అనుమానిస్తున్నారు.
పథకం ప్రకారమే హతమార్చి.. నగలు, నగదుతో పరార్
సుధాకర్‌ను దారుణంగా అంతమొందించిన అనంతరం, దుండగులు ఇంట్లో ఉన్న భారీ మొత్తంలో సొత్తును అపహరించుకెళ్లారు. బాధితుడి ఇంట్లో భద్రపరిచిన సుమారు 60 తులాల విలువైన బంగారు ఆభరణాలు, అలాగే రూ. 10 లక్షల నగదును దోచుకెళ్లినట్టు అంచనా. అంతేకాకుండా.. పోలీసుల కంటపడకుండా తప్పించుకోవడానికి సుధాకర్‌కు చెందిన కారులోనే అక్కడి నుంచి పరారయ్యారు. దోపిడీ కోసమే పథకం ప్రకారం ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.
రంగంలోకి దిగిన పోలీసులు..
ఉదయాన్నే విషయం గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించి ఘటనా స్థలం నుంచి కీలక వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. ఈ దారుణంపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. పరారైన దుండగుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సీసీటీవీ ఫుటేజీలను జల్లెడ పడుతున్నారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
Also Read: ఆర్టీసీ ఢీ కొట్టిన లారీ.. స్పాట్ లో 15 మంది, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఘటనలు