Amit Shah: కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ఈనెల 2న తెలంగాణలో పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ సైతం ఖరారైంది. రాష్ట్రంలో బీజేపీ చేపట్టిన లోక్ తంత్ర బచావో-అరాచకత హటావో కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించనున్న పాదయాత్రలో అమిత్ షా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా స్వయంగా పాదయాత్రలో నడవనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 2న మధ్యాహ్నం 2 గంటలకు అమిత్ షా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా కాకతీయ హోటల్‌కు వెళ్లనున్నారు. సాయంత్రం 3.45 గంటల వరకు హోటల్లోనే ఉండనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు నిజాం కాలేజీ సమీపంలోని బాబూ జగ్జీవన్ రాం విగ్రహం వద్ద నుంచి ప్రారంభమయ్యే పాదయాత్రలో అమిత్ షా పాల్గొంటారు.
అక్కడి నుంచి మొజంజాహీ మార్కెట్(ఎంజే మార్కెట్) వరకు సుమారు గంటపాటు ఈ యాత్ర కొనసాగనుంది. పాదయాత్ర ముగిసిన అనంతరం సాయంత్రం 5 గంటల నుంచి 5.30 గంటల వరకు ఎంజే మార్కెట్ వద్ద నిర్వహించే పబ్లిక్ మీటింగ్ నుద్దేశించి కేంద్ర హోంమంత్రి ప్రసంగించనున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి అమిత్ షా తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు. ఇదిలాఉండగా ఈ కార్యక్రమానికి దాదాపు లక్ష మందికి పైగా జనసమీకరణ చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సభ, పాదయాత్రను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తోంది. ఇదిలా ఉండగా, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఉన్న రిజర్వ్ సమయంలో రాష్ట్రంలోని ప్రముఖులను కలిసేందుకు, పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈనెల 5న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సైతం తెలంగాణకు రానున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన కరీంనగర్లో పాదయాత్ర నిర్వహించనున్నట్లు సమాచారం. ఆర్యవైశ్య భవన్ నుంచి కమాన్ వరకు ఈ యాత్ర కొనసాగనుందని, ఇటీవల నిర్వహించిన హిందూ ఏక్తా యాత్ర మార్గంలోనే పాదయాత్ర చేపట్టాలని ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా లోక్ తంత్ర బచావో.. అరాచకత హటావో నినాదంతో పాదయాత్రలు నిర్వహించాలని బీజేపీ జాతీయ నిర్ణయించింది. ఇందులో భాగంగానే తెలంగాణలోనూ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Also Read: ఇజ్రాయెల్ ఎన్నికల ఫలితాలు విడుదల.. నో మెజారిటీ.. హంగ్ ఏర్పడే ముప్పు?