Sardar Patel; సర్దార్ పటేల్ చూపిన జాతీయ సమైక్యతా స్ఫూర్తితో దేశ సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి రాంచందర్ రావు శనివారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ సమగ్రత, సార్వభౌమాధికార పరిరక్షణ కోసం తన జీవితాన్ని ధారపోసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు.
భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తూ వందలాది సంస్థానాలను ఏకం చేసి ఆధునిక భారతదేశానికి పటిష్టమైన పునాది వేసిన ఘనత పటేల్‌దేనని పేర్కొన్నారు. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దశాబ్దాల పాటు పటేల్ సేవలను మరుగున పరిచే ప్రయత్నం చేశాయని, అయితే ప్రధాని మోడీ గుజరాత్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ని నిర్మించి, దేశవ్యాప్తంగా ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’ను అధికారికంగా నిర్వహించడం ద్వారా పటేల్ కీర్తిని దశదిశలా వ్యాపింపజేశారని తెలిపారు. తెలంగాణ విముక్తిలో సర్దార్ పటేల్ పాత్ర అజరామరమని, నేటి యువత ఆయన క్రమశిక్షణ, దేశభక్తి, నిస్వార్థ సేవలను ఆదర్శంగా తీసుకుని నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఇదిలాఉండగా ఈనెల 2న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో బీజేపీ నిర్వహించే మహా పాదయాత్రకు రానున్న నేపథ్యంలో ఈ యాత్రను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని రాంచందర్ రావు పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో పాదయాత్ర విజయవంతానికి చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్లు, నాయకులు, కార్యకర్తల భాగస్వామ్యం, ప్రజల భాగస్వామ్యం, కార్యక్రమ నిర్వహణ, సమన్వయం తదితర కీలక అంశాలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.
Also Read: మంచు మనోజ్ కారులో ఎక్కితే అంతే సంగతులు.. రాజీవ్ కనకాల వైరల్ కామెంట్స్!