CM Revanth – CM Chandrababu: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. తిరుమల శ్రీవారి దర్శనాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతిస్తున్నట్లు లేఖలో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఇటీవల తిరుమల దర్శనాలకు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించడం లేదన్న విమర్శలు వినిపించాయి. గతంలో ఈ విషయానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల మంత్రి కొండా సురేఖ సైతం శ్రీశైలంలో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను అసలు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కూటమి ప్రభుత్వం ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించి, సిఫారసు లేఖలను అనుమతించాలని మంత్రి సైతం కోరారు.
ఈ దశలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించినట్లు ఓ వార్త సైతం వైరల్ గా మారింది. ఈ విషయాన్ని టిటిడి ఈవో శ్యామలరావు ఖండించారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును టీటీడీ చైర్మన్ బీ.ఆర్ నాయుడు కలిశారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల గురించి చర్చ సాగింది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించేందుకు టీటీడీ అంగీకరించింది. ఈ విషయాన్ని తెలుపుతూ నారా చంద్రబాబు నాయుడు సోమవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
ప్రతి వారంలోని సోమవారం నుండి గురువారం వరకు ఏదైనా రెండు రోజుల్లో విఐపి బ్రేక్ దర్శనం కోసం రెండు లేఖలను అనుమతించడం జరుగుతుందని లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రత్యేక దర్శనం కోసం రెండు లేఖలు కూడా స్వీకరించబోతున్నట్లు చంద్రబాబు లేఖలో వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించడం జరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. మొత్తం మీద ఎన్నో ఏళ్లుగా తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించాలన్న డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో, సీఎం రేవంత్ రెడ్డి జోక్యంతో ఆ సమస్యకు ఫుల్ స్టాప్ పడింది.
Also Read: TTD News for Telangana: తెలంగాణ శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఆ లేఖలకు టీటీడీ గ్రీన్ సిగ్నల్
సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి స్వాగతం పలుకుతూ తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతిస్తున్నట్లు స్వయంగా సీఎం చంద్రబాబు లేఖ రాయడంపై స్పీకర్ ఈ మేరకు స్పందించారు. తిరుమల పవిత్రతను కాపాడడంలో తాము సైతం భాగస్వామ్యం కావడం, వారంలో రెండు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనానికి లేఖలను అనుమతించడంపై సీఎం చంద్రబాబుకు, టీటీడీకి స్పీకర్ కృతజ్ఞతలు తెలిపారు.