KCR Press Meet : నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ట్రాప్. తెలంగాణలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తత. రెడ్ హ్యాండెడ్ గా దొరికిన విజువల్స్ ఉండటంతో కారు పార్టీకి ఫుల్ మైలేజ్ అనుకున్నారంతా. ఇక బీజేపీ ఖేల్ ఖతం అంటూ ప్రచారం జరిగింది. కానీ, ఆ రాత్రి వరకే గులాబీ వర్గానికి పైచేయి. తెల్లారేసరికి సీన్ రివర్స్. కమలనాథులు రివర్స్ అటాక్ స్టార్ట్ చేశారు. వరుస ప్రెస్ మీట్లతో కేసీఆర్ కు సవాళ్ల మీద సవాళ్లు విసిరారు. ఇంత జరుగుతున్నా.. టీఆర్ఎస్ వర్గాలు పెద్దగా రియాక్ట్ కాకుండా.. కాస్త వాల్యూమ్ తగ్గించడం అనుమానాలకు కారణం అవుతోంది. ఎందుకీ మౌనం అంటూ చర్చ మొదలైంది.
బీజేపీ జోరు కంటిన్యూ అవుతోంది. ఆ ముగ్గురు మధ్యవర్తులతో తమకేం సంబంధం లేదని.. దొరికిన డబ్బు ఎక్కడుందని?.. అదంతా కేసీఆర్ డ్రామామేనని.. సీపీ స్టీఫెన్ రవీంద్ర టీఆర్ఎస్ తొత్తని.. సుప్రీంకోర్టు జడ్జి లేదా సీబీఐ ఎంక్వైరీ జరిపించాలంటూ ఫుల్ ఫైర్ అయ్యారు కమలనాథులు. బండి సంజయ్ మరో అడుగు ముందుకేసి యాదాద్రి గుడిలో ప్రమాణం చేద్దామంటూ గులాబీ బాస్ ను సవాల్ చేశారు. అటు, హైకోర్టులో సైతం పిటిషన్ ఫైల్ చేశారు. ఇలా వరుస చర్యలతో బీజేపీ దూకుడు మీదుంటే.. టీఆర్ఎస్ మాత్రం ఎందుకో గానీ సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయింది. స్వయంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నే పార్టీ శ్రేణులను మౌనం పాటించాలని సూచించడం ఆశ్చర్యం కలిగించింది. మరోవైపు, ఆ ముగ్గురు మధ్యవర్తుల రిమాండ్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు తిరస్కరించడం సర్కారుకు షాకింగ్ పరిణామమే. పోలీసులు హైకోర్టును ఆశ్రయించి తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు.
బుధవారం రాత్రి ఈ విషయం బ్రేక్ అవగా.. గురువారం సీఎం కేసీఆర్ స్వయంగా మీడియా ముందుకు వస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ ఆయన రాలేదు. హైదరాబాద్ లో కాదు.. ఢిల్లీలో నేషనల్ మీడియాతో మాట్లాడతారంటూ లీకులు ఇచ్చారు. అదీ జరగలేదు. లేటెస్ట్ గా, శుక్రవారం సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ ఉంటుందంటూ ప్రచారం జరుగుతోంది. ‘ఈ రోజు పెద్ద సార్ ప్రెస్ మీట్’ అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టడంతో అటెన్షన్ క్రియేట్ అయింది. మరి, నిజంగానే కేసీఆర్ మీడియా సమావేశం ఉంటుందా? నలుగురు ఎమ్మెల్యేల ట్రాప్ ఘటనపై ఆయన రియాక్షన్ ఎలా ఉండబోతోంది? బీజేపీని చెడుగుడు ఆడుకుంటారా? మాటల మంటలు రేపుతారా? అంటూ కేసీఆర్ ప్రెస్ మీట్ కోసం అంతా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.