Big Stories

KCR : ఎమ్మెల్యేల ఎర వ్యవహారంపై కేసీఆర్ వెనక్కి తగ్గారా?

నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ముగ్గురు వ్యక్తులు ప్రలోభపెట్టిన వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. తొలుత బీజేపీపై గులాబీ దళం ముప్పేట దాడి చేసింది. కేసీఆర్ గురువారంప్రెస్ మీట్ పెడతారంటూ వార్తలు వచ్చాయి. కానీ కేసీఆర్ మీడియా ముందుకు రాలేదు. మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారంపై పార్టీ నేతలతో రోజంతా సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డిలతోపాటు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఇతర ముఖ్య నేతలతో సమీక్షలు నిర్వహించారు. ఈ వ్యవహారంపై పూర్తి సమాచారంతో సమగ్ర నివేదిక రూపొందించినట్లు సమాచారం.

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై కేసీఆర్ ఎందుకు వెనక్కి తగ్గారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గులాబీ బాస్ మౌనానికి కారణాలేంటి అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసిన వ్యవహారాన్ని ఢిల్లీ వేదికగా వెల్లడించాలని కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతున్నందున లీగల్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. మరోవైపు హైదరాబాద్ లోనే ఈ అంశంపై స్పందిస్తారని వార్తలు వస్తున్నాయి.

మునుగోడు ఉపఎన్నికలో లబ్ధి పొందేందుకే టీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం టీఆర్ఎస్ డ్రామా అని కాషాయ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి , లక్ష్మణ్ ఇలా బీజేపీ కీలక నేతలందరూ కేసీఆర్ కు సవాళ్లు విసిరారు. ఈ వ్యవహారంలో నిజానిజాలు బయటకు రావాలంటే సీబీఐ దర్యాప్తు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ నుంచి కౌంటర్లు పడలేదు. ఇంత పెద్ద వ్యవహారంపై కేసీఆర్ మాట్లాడకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో పార్టీ నేతలెవరూ కూడా స్పందించవద్దని కేటీఆర్ ట్వీట్ చేయడంతో టీఆర్ఎస్ వెనక్కితగ్గిందని స్పష్టమవుతోంది.

ఇవి కూడా చదవండి

Latest News