Big Stories

CM KCR: మనం మనం బాధితులం.. కేజ్రీవాల్‌కు కేసీఆర్‌ ఫుల్ సపోర్ట్..

cm kcr cm kejriwal

CM KCR: బీజేపీ బాధితులంతా ఒక్కటవుతున్నారు. కేంద్రం షాకుల మీద షాకులు ఇస్తుండటంతో.. విపక్షాలన్నీ గగ్గోలు పెడుతూ ఒక్కచోటికి చేరుతున్నారు. మొన్నటి వరకూ బీహార్ సీఎం నితీష్ కుమార్ రాష్ట్రాలు చొట్టొస్తే.. ఇప్పుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సైతం అదే పని చేస్తున్నారు. రాజధానిలో కేజ్రీవాల్ ముందరి కాళ్లకు బంధాలేస్తూ.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలు, బదిలీలు, ప్రమోషన్లకు చెక్ పెడుతూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌తో ఢిల్లీ సీఎం మైండ్ బ్లాంక్ అయింది. సుప్రీంకోర్టు తీర్పును ఆర్డినెన్స్‌తో బైపాస్ చేశారంటూ మండిపడుతున్నారు. మళ్లీ కోర్టుకు వెళితే తేలేందుకు ఎన్నేళ్లు పడుతుందోనని.. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానంటు రాష్ట్రాలు తిరుగుతున్నారు. తాజాగా, తెలంగాణకు వచ్చి.. కేంద్రంపై పోరాటానికి సీఎం కేసీఆర్‌ మద్దతు కోరారు. నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా.. అంటూ ప్రగతి భవన్‌లో మంచి ఆతిథ్యం ఇచ్చి మరీ.. కేజ్రీవాల్‌తో కీలక మంతనాలు జరిపారు గులాబీ బాస్. ఆ తర్వాత తెలంగాణ, ఢిల్లీ, పంజాబ్ సీఎంలు కలిసి.. ఉమ్మడి ప్రెస్‌మీట్ పెట్టి.. కేంద్రంపై దుమ్మెత్తిపోశారు.

- Advertisement -

కర్నాటక ఓటమి తర్వాత కూడా కేంద్ర బీజేపీకి బుద్ధి రాలేదంటూ మండిపడ్డారు సీఎం కేసీఆర్. సుప్రీం తీర్పును గౌరవించకపోతే ఇక దేశం పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను అడ్డుపెట్టుకొని ఢిల్లీ సర్కారును కేంద్రం ముప్పుతిప్పలు పెడుతోందని మండిపడ్డారు. దేశంలో కేంద్రం అరాచకాలు, ఆగడాలు మితిమీరాయని.. బీజేపీయేతర ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నాయని విమర్శించారు. ఢిల్లీ పాలనాధికారాలపై తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను కేంద్రం తనకుతాను వెనక్కి తీసుకోవాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు గుర్తుకొస్తున్నాయని.. ఇందిరాగాంధీకి బుద్ధి చెప్పినట్టే.. భవిష్యత్తులో ప్రజలు మోదీ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కేజ్రీవాల్‌కు తన పూర్తి మద్దతు ప్రకటించారు సీఎం కేసీఆర్.

- Advertisement -

కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ సరికాదని.. ఆర్డినెన్స్‌తో సుప్రీం తీర్పును అవమానించారని తప్పుబట్టారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఢిల్లీ ప్రజల కోసమే కాదు.. దేశ ప్రజల కోసం తమ పోరాటమని తెలిపారు. కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ ప్రజాస్వామ్య విఘాతమని.. బీజేపీయేతర రాష్ట్రాలను కేంద్రం టార్గెట్ చేస్తోందని విమర్శించారు. షీలాదీక్షిత్‌ సీఎంగా ఉన్నప్పుడు అన్ని అధికారులు ఆమె చేతిలోనే ఉన్నాయని.. తాము గెలిచాక అధికారాలన్నీ లాగేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తీరు వల్ల ఢిల్లీ సీఎంగా తాను కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతున్నానని.. ఆవేదన వ్యక్తం చేశారు. 8 ఏళ్లు పోరాటం చేస్తే సుప్రీంకోర్టు ఇటీవల తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని.. ఆ తీర్పు వచ్చిన 8 రోజుల్లోనే ఆర్డినెన్స్ తీసుకొచ్చి తమ హక్కులను లాగేసుకున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని.. గవర్నర్లతో రాజకీయం చేస్తున్నారని.. కేంద్రం తీరు అసలేమాత్రం సరికాదన్నారు ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News