CM Revanth Reddy : పాలమూరు జిల్లాలోని చిన్న చింతకుంట మండలం అమ్మాపురంలోని శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డికి ఆలయ పూజారు, అధికారులు, జిల్లా పాలనా యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. అనంతరం స్వామివారిని దర్శింకుని ప్రత్యేక పూజలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆలయంలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.
కురుమూర్తి స్వామి ఆలయం పేదల తిరుపతిగా ప్రసిద్ధి పొందిందని కొనియాడిన సీఎం రేవంత్.. తెలంగాణ నుంచే కాకుండా కర్ణాటక నుంచి కూడా భక్తులు ఇక్కడకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని గుర్తు చేశారు. ఎంతో ముఖ్యమైన ఈ ఆలయంలో భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రూ.110 కోట్లతో ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రేవంత్ రెడ్డి… ఇంత ముఖ్యమైన ఆలయాన్ని అభివృద్ధి పనులకు అంచనాలు పంపించాలని అధికారుల్ని ఆదేశించారు.
వలసలకు మారుపేరు ఈ జిల్లా..
సరైన నీటి వనరులు లేక, పంటలు పండక.. ఏటా వేల మంది పాలమూరు నుంచి వివిధ ప్రాంతాలకు వలస వెళుతుంటారు. అలాంటి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి గత పాలకుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. నీళ్లు కోసం, నిధుల కోసమే తెలంగాణ అని చెప్పిన నాయకులు.. పదేళ్ల పరిపాలనలోనూ వలసలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై.. జిల్లాను అభివృద్ధి చేసేందుకు పట్టుదలతో పనిచేస్తామన్న రేవంత్ రెడ్డి.. ఇక్కడి ప్రాజెక్టుల్ని పూర్తి చేసి పాడిపంటలతో విలసిల్లేట్లు చేసే విధంగా ప్రభుత్వ నిర్ణయాలుంటాయని ప్రకటించారు.
నారాయణ్ పేట్ – కొడంగల్ ప్రాజెక్టు పూర్తి చేసి త్వరలోనే మక్తల్, నాగర్ కర్నూల్, కొడంగల్ ప్రాంతాలకు కృష్ణా జలాలు పారిస్తామని తెలిపారు.
ఈ జిల్లా బిడ్డను.. చరిత్ర క్షమిస్తుందా?
పాలమూరు బిడ్డాగా రాజకీయాల్లోకి ప్రవేశించి.. ఏకంగా ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించిన రేవంత్ రెడ్డి ఆసక్తికర కామెంట్లు చేశారు. తాను ఈ జిల్లా బిడ్డగా.. ఇక్కడి ప్రజలకు ఉపయోగపడే సాగునీటి ప్రాజెక్టుల్ని పూర్తి చేయకపోతే చరిత్ర క్షమించదని వ్యాఖ్యానించారు. తమ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని కొందరు ఆరోపణలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి, చిల్లర రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహించారు. తనపై కోపం ఉంటే రాజకీయంగా తనపై కక్ష సాధించాలని, అంతే తప్ప ప్రాజెక్టులను అడ్డుకోవద్దుని అభ్యర్థించారు. తరతరాల వెనుకబాటును సరిదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నాలకు..అడ్డుకుని జిల్లా అభివృద్ధిని కుంటుపరచవద్దని అన్నారు. లేదని ప్రాజెక్టులకు అడ్డంకులు సృష్టిస్తే.. పాలమూరు జిల్లా ప్రజలు మిమ్మల్ని క్షమించరని అన్నారు. అలాంటి వాళ్లంతా చరిత్ర హీనులుగా మిగిలిపోక తప్పదు హెచ్చరించారు.
మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది..
ముఖ్యమంత్రిగా తాను ఎక్కడ ఉన్నా.. జిల్లా అభివృద్ధిని కాంక్షించేవాడినని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అమర్ రాజా బ్యాటరీస్ సంస్థ.. పాలమూరు జిల్లాలో 2 వేల మంది స్థానిక నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వడానికి అంగీకరించిందని వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఏ కంపెనీలు వచ్చినా స్థానిక నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
అభివృద్ధి పరుగులు పెట్టాలి..
వెనుకబడిన పాలమూరు జిల్లాలో గ్రామ గ్రామానికి, తండాలకు బీటీ రోడ్లు వేసే బాధ్యత తనదే అని ప్రకటించిన రేవంత్ రెడ్డి, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించి జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించుకుందామంటూ అధికారులకు, ప్రజలకు పిలుపునిచ్చారు.