Allu Aravind: మెగా వర్సెస్ అల్లు.. ఎప్పటినుంచో వీరి మధ్య వివాదాలు కొనసాగుతున్నాయని వార్తలు వస్తూనే ఉన్నాయి. సందు దొరికినప్పుడల్లా ట్రోలర్స్ .. వీరి మధ్య బంధాలను బయటకు తీసి ట్రోల్ చేయడం పనిగా పెట్టుకున్నారు. అల్లు అర్జున్ మాట్లాడినప్పుడు మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడాడా.. ? అల్లు అరవింద్ మాట్లాడినప్పుడు చిరు గురించి చెప్పాడా.. ? చిరు, చరణ్ ఏదైనా ఈవెంట్ లో మాట్లాడినప్పుడు అల్లు ఫ్యామిలీ గురించే మాట్లాడారు. ఇలా ప్రతి దాంట్లో కూడా మెగా వర్సెస్ అల్లు ఉందా లేదా అని ట్రోలర్స్ వెతుక్కునే ఉన్నారు.
ఇక ఈ మధ్యనే అల్లు అరవింద్.. తండేల్ ఈవెంట్ లో దిల్ రాజు గురించి చెప్పేటప్పుడు రామ్ చరణ్ గురించి కొద్దిగా నోరుజారాడు. ఒక వారంలోనే దిల్ రాజు గేమ్ ఛేంజర్ తో అలా కిందపడిపోయి.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో పైకి లేచాడు అని సరదాగా చేసిన వ్యాఖ్యలు పెద్ద సంచలనమే సృష్టించాయి. కావాలనే అల్లు అరవింద్.. రామ్ చరణ్ ను తగ్గించి మాట్లాడాడని ట్రోలింగ్ మొదలయ్యింది. ఎప్పుడో ఉన్న వీడియోలను వెలికితీసి మరీ అల్లు అరవింద్ ను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు.
ఇక తాజాగా ఈ ట్రోలింగ్ పై అల్లు అరవింద్ నోరు విప్పాడు. తండేల్ ఈవెంట్ లో మాట్లాడడం కరెక్ట్ కాదని ఆగానని, అందుకే ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నట్లు తెలిపాడు. “ఈమధ్య తండేల్ ఈవెంట్ లో రామ్ చరణ్ స్దాయి నేను తగ్గించాననే అభియోగం తోటి నన్ను చాలా ట్రోల్ చేశారు. దానిమీద ఒక సీనియర్ రిపోర్టర్ నన్ను ప్రశ్నిస్తే ఆ సందర్భం కరెక్ట్ కాదు అని చెప్పలేదు. ఆరోజు దిల్ రాజు గారిని ఆహ్వానిస్తూ.. ఆయన ఒక్క వారం రోజుల్లోనే కష్టాలు నష్టాలను అనుభవించారు అని చెప్పడానికి.. ఉద్దేశ్యపూర్వకంగా కాకుండా యధాలాపంగా ఆ మాట అనాల్సివచ్చింది. దానికి మెగా అభిమానులు ఫీల్ అయ్యి, దాన్ని ట్రోల్ చేసి.. నన్ను ట్రోల్ చేశారు.
ఫీల్ అయిన అభిమానులకు నేను సారీ చెప్తున్నాను.. నేను ఉద్దేశ్యపూర్వకంగా చేసింది కాదు. చరణ్ నా కొడుకులాంటి వాడు. వాడు నాకున్న ఒకే ఒక్క మేనల్లుడు.. అతనికి నేను ఒకే ఒక్క మేనమామను. అందుకని ఎమోషనల్ గా చెప్తున్నాను.. వదిలేయండి. చరణ్ కు, నాకు మధ్య ఒక అద్భుతమైన బంధం ఉంది. దాన్ని చెడగొట్టకండి. అందుకే దీంతో ఆపేయండి. దిల్ రాజు జీవితం గురించి చెప్పడానికి వాడాను. ఆ మాట వాడకూడదని ఆ తరువాత నాకు అర్థమైంది. ఇక దాన్ని వదిలేయండి” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. అల్లు అరవింద్ క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదం ఇక్కడితో ఆగిపోతుందో లేదో చూడాలి.
ఇక అల్లు అరవింద్ సమర్పించిన సినిమా తండేల్. అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 7 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కోసం అల్లు అరవింద్ చాలా కష్టపడ్డాడు. ప్రతి ప్రమోషన్ లో కూడా కనిపించి సినిమాపై మారినంత హైప్ ను తీసుకొచ్చాడు. మరి ముందు ముందు టాండేల్ ఎలాంటి కలక్షన్స్ రాబడుతుందో చూడాలి.