CM Revanth Reddy: రైతులను అడ్డుపెట్టుకొని రాజకీయ లబ్ది పొందాలని చూస్తోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో ఆయన బీఆర్ఎస్ కు సవాలు విసిరారు. మోటార్లకు మీటర్లు పెట్టినా, రైతులకు ఉచిత విద్యుత్ నిలిపివేసినా తాము వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమని అన్నారు. మేము మాట నిలబెట్టుకుంటే బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకుంటుందా? అని సవాలు విసిరారు. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించేందుకే రైతు డిస్కంను ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న విద్యుత్ వినియోగాన్ని రైతు డిస్కంకు కనెక్ట్ చేయనున్నట్లు తెలిపారు. దేశంలోనే తొలిసారి ఎక్కడాలేని విధంగా రైతు డిస్కంను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రైతు డిస్కం ఏర్పాటుతో జవాబుదారీతనం పెరుగుతుందని అన్నారు.
రైతు డిస్కం ఏర్పాటుతో ప్రభుత్వానికి అవసరాన్నిబట్టి తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేసే వెసులుబాటు కలుగుతుందని సీఎం రేంత్ రెడ్డి తెలిపారు. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ అబద్ధాల పునాదులపై పార్టీలను బతికించుకోవాలని ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. రైతులు పండించిన ప్రతీ గింజను తమ ప్రభుత్వం కొంటోందని అన్నారు. మరి కేంద్రం ఎంత కొంటోందో కిషన్ రెడ్డి చెప్పాలని సవాలు విసిరారు. కేంద్రం కనీస మద్దతు ధర నిర్ణయించినప్పటికీ.. ఒక్క గింజనైనా కొంటోందా? అని రేవంత్ నిలదీశారు. వరి, జొన్న, మొక్కజొన్నలు మొత్తం తమ ప్రభుత్వమే కొంటోందని పేర్కొన్నారు. కేంద్రం కొనకపోవడం వల్లే రాష్ట్రంలో రైతు గోస పడుతున్నాడని విమర్శించారు.
మరోవైపు జల వివాదాలను రాష్ట్రాలు సమన్వయంతో పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ చెప్పారని రేవంత్ గుర్తుచేశారు. కానీ తుమ్మిడిహట్టి కోసం కలిసి మాట్లాడటానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కోరినా స్పందించడం లేదన్నారు. పోలవరం కోసం 7 మండలాలు ఇచ్చిన మోదీ.. తెలంగాణ కోసం ఇప్పించలేరా అని ప్రశ్నించారు. మరోవైపు హైదరాబాద్ లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై జరుగుతున్న విమర్శలపైనా రేవంత్ స్పందించారు. బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టలేదా? అని ప్రశ్నించారు. కమ్మ సంఘానికి కేసీఆర్ 10 ఎకరాలు ఇవ్వలేదా? అని నిలదీశారు. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టిందే తాను అని రేవంత్ గుర్తు చేశారు.
ఎన్టీఆర్ ను కులం, ప్రాంతంతో పోల్చడం బుద్దిలేని తనం అని సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రలో తెలంగాణ వాళ్ల విగ్రహాలు ఎందుకు పెట్టడం లేదని అక్కడ పార్టీ పెట్టిన కేసీఆర్ అడగలేదు కదా అని అన్నారు. కేటీఆర్.. తన తారక రామరావు పేరు ఎందుకు మార్చుకోవడం లేదని నిలదీశారు. వివాదాలు, సెంటిమెంట్ తో రాజకీయాలు చేయాలని తాను అనుకోవడం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. తన దృష్టి అంతా అభివృద్ధి పైనే ఉందన్నారు. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక ధర్నాలకు రైతులు ఎవరు రావడం లేదని.. బీఆర్ఎస్ కార్యకర్తలు అందులో పాల్గొంటున్నారని స్వయంగా బాల్క సుమన్ చెప్పారని రేవంత్ గుర్తు చేశారు. ఇవాళ్టి వరకూ 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేసిందని రేవంత్ తెలిపారు.
Also Read: బెంగాల్లో తీవ్ర కలకలం.. మమతా మేనల్లుడిపై దాడి.. బీజేపీపై తీవ్ర విమర్శలు
తమ ప్రభుత్వం ఏడాదికి రూ.70 వేల కోట్లు అప్పు చేస్తే.. రూ.95 వేల కోట్లు అప్పు తీరుస్తోందని సీఎం రేవంత్ తెలిపారు. హరీశ్ రావు తాము తీరుస్తున్న అప్పుల గురించి ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. రూ.54 వేల కోట్లు అప్పులు తీసుకుంటామని తాము ముందే చెప్పామని.. ఎఫ్ఆర్బీఎం పరిధి దాటి అప్పులు చేయడానికి అనుమతి లేదన్న విషయాన్ని గుర్తుచేశారు. మరోవైపు హరీశ్ రావు ఎవరెవరితో మాట్లాడుతున్నారో తనకు తెలుసని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ మీద ఒట్టు వేసి తాను బీఆర్ఎస్ లోనే ఉంటా అని హరీశ్ రావు చెప్పగలరా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పబ్లిక్ మీటింగ్ వదిలేసి హరీష్ రావు ఎందుకు ఢిల్లీ వెళ్లారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయనడంలో అనుమానం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబం ఎన్ని క్షుద్ర పూజలు.. శక్తులు ప్రదర్శించినా తనను ఏం చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. 2034 వరకూ తెలంగాణ రాజకీయాల్లోనే ఉంటానని పునరుద్ఘటించారు.
Also Read: కళ్ళజోడు తీస్తే ఎన్టీఆరా? దేవాన్ష్‌పై పేర్ని నాని సెటైర్లు.. ఏకిపారేస్తున్న టీడీపీ!