US-Iran Deal: అమెరికా, ఇరాన్.. ఇప్పుడీ రెండు దేశాలు ప్రపంచానికి ఒక తలనొప్పిగా తయారయ్యాయి. ఈ రెండు దేశాల పుణ్యమా అని ప్రపంచదేశాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు.. ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అవ్వడం అంతా ఇంతా కాదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇప్పుడు ఓ ప్రచారం జరుగుతోంది. ఈ రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదరడానికి అడుగు పడిందనేది దాని సారాంశం. ఇరు దేశాల మధ్య ఒక మెగా డీల్ జరగబోతుందనే ప్రచారం జరుగుతోంది.
నిజానికి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉంది. నిజానికి ఇప్పుడు ఈ రెండు దేశాలకు యుద్ధం చేయడం తలకు మించిన భారంగా మారుతోంది. అందుకే కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో మాత్రం ఒకే మాటపై ఉంటూ కొనసాగిస్తున్నారు. అయితే ఈసారి జరిగిన మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇరు దేశాల శాంతి ఒప్పందానికి సంబంధించిన ఒక ఫ్రేమ్ వర్క్ సిద్ధం కావడం. అమెరికా ఇరాన్ మధ్య 300 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్యాకేజీతో పాటు, వ్యూహాత్మకంగా ప్రాముఖ్యత కలిగిన హార్ముజ్ జలసంధి ఇష్యూపై చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు అణు ఒప్పందం వంటి సున్నిత అంశాలపై చర్చలు ఓ కొలిక్కి వస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ 60 రోజుల్లోనే ఈ విషయాలన్నింటిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇరాన్ వద్ద ఉన్న అధికంగా శుద్ధి చేసిన యురేనియం నిల్వలపై నియంత్రణలు విధించడం, భవిష్యత్తులో అణ్వాయుధాల అభివృద్ధి చేయబోమని హామీ ఇవ్వడం వంటి అంశాలు ఇందులో కీలకం కానున్నాయి. అంతేకాదు మరో కీలక అంశమైన హర్ముజ్ జలసంధిపై ఒప్పందాలు కీలకం కానున్నాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ మార్గాన్ని పూర్తిగా తెరవడం, మైన్స్ తొలగించడం, రవాణాపై ఆంక్షలు తగ్గించడం వంటి ప్రతిపాదనలు చర్చలో ఉన్నాయి.
అయితే ఇవన్నీ కూడా అమెరికాకు అనుకూలంగా ఉన్న అంశాలే. మరి ఇరాన్ సంగతి ఏంటనేది ఇక్కడ తేలాల్సిన విషయం. అమెరికా కూడా తన నేవీ ఆంక్షలను దశలవారీగా తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది. నిజానికి దీని వల్ల ఇరాన్‌కు ఒరిగేది ఏం లేదు. అయితే ఇరాన్‌పై ఉన్న ఆర్థిక ఆంక్షల సడలింపు, విదేశాల్లో నిలిచిపోయిన బిలియన్ల డాలర్ల ఆస్తుల విడుదల విషయంలో సానుకూలంగా ఉంటే ఇరాన్ కూడా ఒక మెట్టు దిగే అవకాశం లేకపోలేదు. అందుకే చర్చల్లో వీటిని చేర్చినట్టు తెలుస్తోంది.
గత కొంతకాలంగా ఇరాన్ మరో డిమాండ్‌ను చేస్తోంది. యుద్ధం వల్ల నష్టపోయిన తమ దేశాన్ని పునర్‌నిర్మించాల్సిన బాధ్యత అమెరికాదే అని చెబుతోంది ఇరాన్. అయితే ఇరాన్‌కు మానవతా సహాయం అందించే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా ఇప్పుడు చర్చించినట్టు తెలుస్తోంది. ఈ డీల్‌లో అత్యంత చర్చనీయమైన అంశం 300 బిలియన్ డాలర్ల నిధులు. పునర్నిర్మాణ పెట్టుబడి నిధి కింద ఈ నిధులను అమెరికా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఇరాన్ రీ డెవలప్‌మెంట్‌కు ఉపయోగపడతాయనే చర్చ జరుగుతోంది.
ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ సమాచారం అంతా అమెరికా నుంచే వస్తుంది. ఇదంతా కూడా వెస్ట్రన్ మీడియాలోనే జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయాలన్నింటిని లీక్ చేసిన అమెరికన్ గవర్నమెంట్.. ఈ ఫైల్‌పై ట్రంప్ ఇంకా సంతకం చేయలేదని.. ఆయన దయా దాక్షిణ్యాలపై ఈ డీల్ ఆధారపడి ఉందనేలా చెబుతోంది.
కానీ ఎప్పటిలాగానే ఇరాన్ ఈ విషయాలపై మౌనంగా ఉంది. ఎందుకంటే ఒప్పందంలో కొన్ని అంశాలపై అమెరికా, ఇరాన్ మధ్య భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. శాంతి చర్చలకు సంబంధించి అవగాహన ఒప్పందంపై ఇంకా ఖరారు కాలేదని, దానికి తుది రూపు ఇవ్వాల్సి ఉందని ఇరాన్ వార్తా సంస్థ తస్నిమ్ కథనం ప్రచురించింది. డ్రాఫ్ట్‌కు సంబంధించి అమెరికా మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఇరాన్ వర్గాలు కొట్టిపారేశాయి.
ఒప్పందం ఎప్పుడు తుది రూపం దాల్చుతుందో స్పష్టత లేకపోయినా.. రెండు దేశాల మధ్య చర్చలు మాత్రం వేగంగా కొనసాగుతున్నాయని తెలుస్తోంది. ఓవరాల్‌గా చూస్తే శత్రుత్వం నుంచి శాంతి దిశగా ఒక పెద్ద మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కానీ ఇదే సమయంలో ఇరు దేశాలకు ఒప్పందం కుదరడం ఇష్టం లేదన్నట్టుగా కూడా ప్రవర్తిస్తున్నాయి. ఇటీవల ఇరాన్‌పై అమెరికా మరోసారి విరుచుకుపడింది. ఇరాన్‌లోని వ్యూహాత్మక సైనిక స్థావరాలపై ఎయిర్‌స్ట్రైక్స్ చేసింది. హర్మూజ్ జలసంధిలో అమెరికన్ నేవీకి, అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు ముప్పుగా మారిన ఇరాన్ క్షిపణి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసినట్లు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది.
ఇరాన్‌కు అత్యంత కీలకమైన, వ్యూహాత్మక ఓడరేవు నగరం బందర్ అబ్బాస్‌పై అమెరికా సైన్యం దాడులు చేసింది. ఇది ఉద్రిక్తతలను పెంచింది. దీంతో ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేస్‌లను టార్గెట్ చేసుకొని దాడులు చేసింది. వీటిని అడ్డుకున్నట్టు గల్ఫ్ దేశాలు ప్రకటించాయి. ఇరు దేశాల మధ్య అత్యున్నత స్థాయి శాంతి చర్చలు జరుగుతున్న టైమ్‌లో 48 గంటల వ్యవధిలో అమెరికా రెండుసార్లు దాడులు చేసింది. ఇరాన్ ఒకసారి ప్రతిఘటించింది. మరి ఇలాంటి టైమ్‌లో ఒప్పందం ఎలా కుదురుతుంది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.
ఇదే సమయంలో క్రూడాయిల్ సరఫరాకు కీలకమైన హర్మూజ్ జలసంధి నుంచి సాగే నౌకల రాకపోకలను ఒమన్ దేశాలతో కలసి పర్యవేక్షిస్తామని ఇరాన్ ప్రకటించింది. ఇది మరింత ఉద్రిక్తతలను పెంచేలా ఉంది. ఇరాన్‌తో చేతులు కలిపి అక్కడ టోల్ వసూలు చేయాలని చూస్తే ఒమన్‌ను కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇది అనుకోకుండా జరుగుతుందా? లేక పక్కా ప్లాన్ ప్రకారమే చర్చలు జరగకుండా ఎవరైనా కుట్రలు చేస్తున్నారా? అనేది ఓ పెద్ద మిస్టరీ. కానీ ప్రస్తుతం పరిస్థితి మాత్రం ఆశించినంత ఆశాజనకంగా మాత్రం లేదు.
Also Read: బెంగాల్లో తీవ్ర కలకలం.. మమతా మేనల్లుడిపై దాడి.. బీజేపీపై తీవ్ర విమర్శలు
ఇరాన్, అమెరికా మధ్య పీస్ డీల్ జరుగుతుందా? లేదా? అనేది ఓ పెద్ద మిస్టరీ. ఇక్కడ ప్రపంచంపై పెత్తనం కోసం అమెరికా వైపు నుంచి ఈ డీల్‌ను ఆలస్యం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే భారత్, చైనా సహా అనేక దేశాల్లో చమురు మంటలు ప్రారంభమయ్యాయి. అవి ఎంత మండితే.. తమకు అంత మంచిది అనేది అమెరికా ఆలోచన. దీని కోసం ఎంత ఖర్చు చేయడానికైనా రెడీ అన్నట్టుగా ఉంది అగ్రరాజ్యం తీరు. అయితే ఇది ఎక్కువ కాలం కొనసాగే అవకాశం తక్కువ.
ఇక ఇరు దేశాల మధ్య ఎంత శత్రుత్వం ఉన్నప్పటికీ, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇరు దేశాలు శాంతి ఒప్పందాలపై సంతకాలు చేయడానికి ముందుకు రాక తప్పని పరిస్థితి. యుద్ధం చేసి అలసిపోవడం.. ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలడం.. సైనిక పరంగా భారీ నష్టం వాటిల్లడం.. అంతర్జాతీయంగా వచ్చే ఒత్తిడి లాంటివి వస్తాయి. దీని కోసమైనా ఇరు దేశాలు ఒక అంగీకారానికి రాక తప్పని పరిస్థితి వస్తుంది.
అమెరికా, ఇరాన్ మాత్రం ఇప్పుడు కొంత మొండిగా ముందుకు వెళుతున్నాయి. తాము ఇప్పటికే చాలా నష్టపోయాం.. ఇక నష్టపోవాల్సింది ఏమీ లేదు కాబట్టి.. ఇక వెనక్కి తగ్గేది లేదనే తీరులో ఇరాన్.. ఇంతా చేసి వెనక్కి తగ్గితే యుద్ధం చేసి వృథా కదా అనే తీరులో అమెరికా ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకే పంతం పట్టి ముందుకు వెళుతున్నాయి.
కానీ ఇది ఎక్కువ కాలం కొనసాగదు. అటో ఇటో ప్రపంచం చూడటానికైనా శాంతి ఒప్పందంపై సంతకాలు జరుగుతాయి. కానీ చరిత్రను బట్టి చూస్తే నమ్మకం లేని చోట శాంతి ఒప్పందం హండ్రెడ్ పర్సెంట్ అమలయ్యే చాన్సెస్ చాలా తక్కువనే చెప్పాలి. ఇది కేవలం యుద్ధ విరామంగా మాత్రమే పని చేస్తుంది. ఇరు దేశాలలో ఏదో ఒక దేశం సైనికంగా, ఆర్థికంగా మళ్లీ పుంజుకునే వరకు లేదా రాజకీయ నాయకత్వం మారే వరకు ఈ శాంతి కొనసాగవచ్చు. ఆ తర్వాత యథా రాజ తథా ప్రజా అన్నట్టుగా పరిస్థితులు మారే అవకాశం ఉంది.
అమెరికా, ఇరాన్ డీల్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. నిజానికి ఇప్పుడు ఈ యుద్ధానికి కారణం కూడా ఇదే. ఇరాన్ రహస్యంగా అణుబాంబు తయారు చేస్తోందని అమెరికా, దాని మిత్రదేశాలు ఇరాన్‌పై తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధించాయి. దీనివల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి 2015లో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, చైనాలు కలిసి ఇరాన్‌తో ఒక ఒప్పందం చేసుకున్నాయి. తాము అణుబాంబు తయారు చేయబోమని అంగీకరించింది. నిజానికి అంతా బాగనే జరిగింది. కానీ 2018లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందం నుంచి ఏకపక్షంగా బయటకు వచ్చేశారు. దీంతో వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. ఇరాన్‌కు కష్టాలు పెరిగాయి. అమెరికా ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో, ఇరాన్ కూడా తాము ఇకపై నిబంధనలను పాటించమని ప్రకటించింది. అణుబాంబు తయారీని కొనసాగించింది. దీంతో ట్రంప్ ఏకంగా యుద్ధానికి తెరలేపారు.
నిజానికి ఆ డీల్ అలానే కొనసాగి ఉంటే.. ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు ఇరాన్ వద్ద 60 శాతం శుద్ధి చేసిన యురేనియం ఉంది. అణుబాంబు తయారీకి అడుగు దూరంలో నిలిచింది ఇరాన్. ఇప్పుడు డీల్ కుదిరినా.. అది ఎంతకాలం అమల్లో ఉంటుందనేది మిలియన్ డాలర్ క్వశ్చన్. అందుకే ఇరు దేశాలు ఇప్పుడు ఒకరిపై ఒకరిని అనుమానంగానే చూస్తున్నాయి. అందుకే డీల్ కుదిరినా అది కేవలం పేపర్‌కే పరిమితమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
ఈసారి డీల్ పక్కాగా కుదరాలంటే ఇరు పక్షాలు పక్కాగా చర్చలు జరపాలి. ఎందుకంటే అణుబాంబు ఉంటేనే ఇరాన్‌కు రక్షణ ఉంటుందనేది ఆ దేశ ఆలోచన. ఇరాన్ వద్ద అణుబాంబు ఉంటే తమకు అసలు రక్షణ ఉండదు అనేది ఇజ్రాయెల్ ఆలోచన. ఇజ్రాయెల్ రక్షణ తమ బాధ్యత అనేది అమెరికా ఓపెన్‌గా చెప్పే స్టేట్‌మెంట్. వీటన్నింటి వల్ల ఇప్పుడు ఎక్కువగా ఇబ్బందులు పడేది గల్ఫ్ దేశాలు.. ఆ తర్వాత ప్రపంచ దేశాలు. మొత్తానికైతే ట్రంప్ ప్రపంచాన్ని అడకత్తెరలో పోకచెక్కలా మార్చేశారు. మరి దీనిని ఎలా సాల్వ్ చేస్తారనేది చూడాలి.
Also Read: బెంగాల్ సరిహద్దుల్లో భారీ ఆపరేషన్.. వలసదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న డిజిటల్ వెరిఫికేషన్!
Story by: Anup, Big Tv