Cm Revanth Reddy: బీజేపీ నేతల బస్తీ నిద్రపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ మీడియాతో మాట్లాడుతూ… కిషన్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. సబర్మతి ప్రక్షాళనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. సబర్మతి కోసం 15 వేల కుటుంబాలను తరలించారని చెప్పారు. గుజరాత్ రాష్ట్రాన్ని దేశానికి మోడల్, దేశానికి ఆదర్శం అంటున్నారని మరి మూసీ ప్రాజెక్టుకు ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు.
Also read: సీఎం ప్రోగ్రెస్ రిపోర్ట్ – ఈ వారం మరిన్ని కీలక నిర్ణయాలు, ముఖ్యమంత్రి రేవంత్ విజన్ అదుర్స్ అంతే!
మూసీ ప్రాజెక్టు వద్దు అంటున్నారంటే గుజరాత్ మోడల్ ఫెయిల్ అయ్యిందా? అని కిషన్ రెడ్డికి సూటిప్రశ్న వేశారు. మూసీని బాగు చేయడం బీజేపీకి ఇష్టం లేదని అన్నారు. మహారాష్ట్ర ప్రజలను మోసం చేసేందకు బీజేపీ షిండేను వాడుకుందని విమర్శించారు. అలాగే తెలంగాణలో కిషన్ రెడ్డి వాడుకుంటున్నారని చెప్పారు. పదకొండేళ్లలో ప్రధాని మోడీ ఏం చేశారని ప్రశ్నించారు. రైతులకు ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన మోడీ హామీ ఏమైందని అన్నారు.
మహారాష్ట్రను దోచుకునేందుకు ఇద్దరు గుజరాతీలు వచ్చారని విమర్శించారు. ధారావి ప్రాజెక్టు ద్వారా పెద్ద మొత్తంలో దోచుకోవాలని బీజేపీ నేతలు చూస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. వారికి అవకాశం ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరని చెప్పారు. మహారాష్ట్రకు రావాల్సిన 17 కంపెనీలను మోడీ గుజరాత్ కు తీసుకువెళ్లారని వ్యాఖ్యానించారు. మహాయతికి గుణపాఠం చెప్పేందుకు రైతులు, పేదలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.