Mobile Phone Addiction Murder| చక్కగా చదువుకోమని తల్లిదండ్రులు చెబితే వినకుండా ఆ పిల్లాడు స్కూల్ కెళ్లడం మానేసి మొబైల్ ఫోన్ చూస్తూ ఇంట్లో కూర్చున్నాడు. కూలి పని చేసి ఇంటికి తిరిగి వచ్చిన తండ్రి కోపంగా అతడిని మందలించాడు. కానీ 14 ఏళ్ల కుర్రాడు తల్లిదండ్రులకు ఎదురు తిరిగాడు. మొండిగా వాదించాడు. దీంతో అతని తండ్రి గట్టిగా చితకబాదాడు. ఆ దెబ్బలకు ఆ పిల్లాడు చనిపోయాడు. ఈ ఘటన బెంగుళూరులో జరిగింది. బెంగుళూరు పోలీసులు పిల్లాడిని హత్య చేసినందుకు అతని తండ్రిని అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. బెంగుళూరు నగరంలోని కుమారస్వామి లేఅవుట్ ప్రాంతంలో నివసించే రవి కుమార్.. కార్పెంటర్ పని చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. అతని కుటుంబంలో భార్య, ముగ్గురు పిల్లలున్నారు. అయితే రవి కుమార్ పెద్ద కొడుకు తేజస్ స్కూల్ లో 9వ తరగతి చదువుతున్నాడు. తేజస్ సరిగా చదువుకోకుండా ఎక్కువగా మొబైల్ ఫోన్ చూసుకుంటూ.. సాయంత్రం స్నేహితులతో షికారు కెళుతూ ఉంటాడు. ఇదంతా గమనించిన రవికుమార్, అతని భార్య తేజస్ కు పలుమార్లు మందలించారు. స్నేహితులతో చెడు సావాసాలు, మొబైల్ ఫోన్ వ్యసనం మానేసి, చక్కగా చదువుకోమని చెప్పేవారు. కానీ తేజస్ వారి మాటలను పట్టించుకునేవాడు కాదు.
Also Read: స్కృడ్రైవర్‌తో పొడిచి పొడిచి హత్య.. భర్తను వదిలి బాయ్‌ఫ్రెండ్‌తో 4 పిల్లల తల్లి సహజీవనం
ఈ క్రమంలో రెండు రోజుల క్రితం రవికుమార్ ఉదయం ఇంటినుంచి పనికివెళ్లాడు. కానీ తేజస్ స్కూల్ కు వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు. అంతకు ముందు రోజు అర్ధరాత్రి వరకు స్నేహితులతో తిరిగి ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. మరుసటి రోజు స్కూల్ కెళ్లకుండా ఇంట్లోనే మొబైల్ ఫోన్ లో వీడియోలు చూసుకుంటూ కూర్చున్నాడు. సాయంత్రం రవికుమార్ పని నుంచి ఇంటికి రాగానే కొడుకుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. చెప్పినట్లు వినాలన గట్టిగా మందలించాడు. కానీ తండ్రి మాటలని తేజస్ పెడచెవిన పెట్టాడు. మరుసటి రోజు తేజస్ మళ్లీ స్కూల్ కు వెళ్లలేదు. దీంతో రవికుమార్ అతడిని స్కూల్ కు వెళ్లాల్సిందేనని కోపడ్డాడు.
అప్పుడు తేజస్ మొబైల్ ఫోన్ తీసుకొని యూట్యూబ్ చూసుకుంటూ కూర్చున్నాడు. ఎంత చెప్పినా లెక్కచేయకపోవడంతో రవి కుమార్ కొడుకుని కొట్టాడు. దీంతో తేజస్ తండ్రిని అని చూడకుండా తోసేశాడు. ఈ క్రమంలో కొడుకుని కొట్టడానికి రవి కుమార్ ఇంట్లో ఉన్న క్రికెట్ బ్యాట్ తీసుకొని దాడి చేశాడు. తేజస్ ఆ దెబ్బల కారణంగా కిందపడిపోయాడు. అయినా అంతటితో ఆగక రవికుమార్ ఆవేశంలో ఇలాంటి కొడుకు బతికినా చచ్చినా తనకు అవసరం లేదని చెబుతూ తేజస్ తలను గోడకేసి బాదాడు. దాంతో తేజస్ తలకు బలంగా గాయమైంది. తల నుంచి రక్తం కారుతోంది. ఈ ఘటన ఉదయం 8 గంటలకు జరిగింది. కానీ కోపంగా ఉన్న రవికుమార్ 10 గంటల వరకు కొడుకుని అలాగే వదిలేశాడు. దీంతో తేజస్ ప్రాణాలు వదిలాడు.
Also Read: దాగుడు మూతలు ఆడుతూ యువకుడి హత్య.. ప్రియురాలు అరెస్ట్
ఆ తరువాత రవికుమార్, అతని భార్య తేజస్ ని తీసుకొని ఆస్పత్రికి వెళ్లారు. అప్పటికే తేజస్ చనిపోయాడని డాక్టర్లు ధృవీకరించారు. తేజస్ ని అతని తండ్రి హత్య చేశాడని పొరుగింటి వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు రవి కుమార్ ఇంటికి చేరుకోగా.. ఇంట్లో తేజస్ అంతక్రియల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే పోలీసులు రవికుమార్ ని అదుపులోకి తీసుకొని తేజస్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు.