Maha Kumbh Mela: ఓ నేరస్తుడు తన పాప పరిహారం కోసం కుంభమేళాకు వచ్చాడు. తాను చేసిన పాపాలను ఆ శివయ్య మన్నించాలని కోరుకుంటూ ప్రయాగరాజ్ వద్దకు చేరుకున్నాడు. కానీ అతని పాపం పండి చిట్టచివరకు పోలీసులకు చిక్కాడు. కుంభమేళాలో శాంతిభద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా పోలీసులు పాత నేరస్తులకై వేట సాగిస్తున్నారు. ఈ సందర్భంగానే పోలీసులకు వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్లు, రెండేళ్లు గా దొరకని దొంగ పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఉత్తర ప్రదేశ్ కు చెందిన పర్వేష్ యాదవ్ మద్యం అక్రమ రవాణా చేస్తూ 2023 లో పోలీసులకు చిక్కాడు. అయితే అప్పుడు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు సాగిస్తున్న క్రమంలో పర్వేష్ పరారయ్యాడు. అప్పటి నుండి పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. అయినా పర్వేశ్ మాత్రం పోలీసులకు చిక్కని పరిస్థితి. అయితే పర్వేష్ కు భక్తి ఎక్కువ. అందుకే తన రాష్ట్రంలో తన సమీప గ్రామంలో జరుగుతున్న కుంభమేళాలో పాల్గొనాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ప్రయాగ్ రాజ్ వద్దకు వచ్చాడు. అక్కడ కుంభమేళాలో గల సత్పురుషులను పర్వేష్ కలిసి ఆశీర్వాదం పొందాడు.
ఆ తర్వాత త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించేందుకు వెళ్ళాడు. ఇక అంతే అక్కడ భద్రతా విధుల్లో ఉన్న పోలీసులు, పర్వేష్ యాదవ్ ను గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు మాత్రం శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా పాత నేరస్థుల కోసం గాలిస్తున్న క్రమంలో పర్వేష్ చిక్కడంతో పోలీసులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే పాప పరిహారం కోసం పవిత్ర స్నానం చేసేందుకు వచ్చిన పర్వేష్ అరెస్ట్ కావడంతో, పాపం పండింది.. పోలీసులకు చిక్కాడంటూ స్థానిక భక్తులు చెప్పడం విశేషం.