Nidurinchu Jahapana Teaser: ఈ మధ్యకాలంలో చైల్డ్ ఆర్టిస్ట్ లు హీరోహీరోయిన్లుగా మారడం ఎక్కువ అయిపోయింది.ఇప్పటికే ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం.. హిట్స్ అందుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన తేజ సజ్జా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో మంచి సినిమాల్లో నటించిన విషయం తెల్సిందే. అయితే.. తేజ కన్నా ముందు బాలనటుడు అంటే టక్కున గుర్తొచ్చే పేరు ఆనంద్ వర్ధన్.
అప్పట్లో సినిమా ఏదైనా కానీ.. హీరో కు కొడుకు అయినా.. మనవడు అయినా ఆనంద్ వర్ధనే. ప్రేమించుకుందాం రా సినిమాలో వెంకటేష్ అక్క కొడుకుగా నటించిన ఆనంద్.. సూర్యవంశం సినిమాలో కొడుకు, మనవడుగా నటించి మెప్పించాడు. ఇక ఇదే సినిమాను హిందీకిలో అమితాబ్ బచ్చన్ రీమేక్ చేయగా అందులో కూడా ఆనంద్ వర్ధనే బాలనటుడుగా నటించాడు. ప్రియరాగాలు, మనసంతా నువ్వే, పెళ్లి పీటలు, శ్రీ మంజునాథ, మావిడాకులు.. ఇలా దాదాపు 25 హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు.
ఇక 2004 తరువాత ఆనంద్.. చదువుపై దృష్టిపెట్టినట్లు సమాచారం. ఇన్నాళ్లకు ఆనంద్ హీరోగా మారాడు. ఆనంద వర్ధన్ హీరోగా నటిస్తున్న చిత్రం నిదురించు జహాపనా. ప్రసన్న కుమార్ దేవరపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఏఆర్ ఏఆర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శ్యామ్ మేదిరి నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ఆనంద్ వర్ధన్ సరసన నవమి గాయక్, రోషిని సహోట నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Sookshmadarshini: మీర్పేట్ మర్డర్ కేసు.. గురుమూర్తిని ఇన్స్పైర్ చేసిన ఈ సినిమాలో అసలేముంది..?
ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రిలీజ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ” మనిషి నిద్రపోవడం వరకు సైన్స్ అయితే.. నిద్రపోయాక ఏం జరుగుతుంది అనేది మాయ” అనే డైలాగ్ తో టీజర్ మొదలయ్యింది. సినిమా మొత్తం సముద్రపు ఒడ్డున జరుగుతుందన్నట్లు చూపించారు. ఆనంద్ వర్ధన్.. వీరయ్య అనే పాత్రలో కనిపించాడు. వీరయ్యకు నిద్రలో ఒక కల వస్తూ ఉంటుంది. ఆ కలలో ఒక అమ్మాయి కనిపిస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి బయట కూడా ఉందనుకొని పిచ్చివాడిలా మారతాడు. ఎవరు ఎంత చెప్పినా వీరయ్య నమ్మడు.
అసలు వీరయ్యకు ఏమైందో అని డాక్టర్ కు చూపిస్తే.. ఆయన ఈ ఆలోచనలతోనే అతను 17 ఏళ్లు మిస్ అయ్యినట్లు చెప్తాడు. అసలు 17 ఏళ్ల క్రితం వీరయ్య జీవితంలో ఏం జరిగింది.. ? ఆ కలలోకి వచ్చిన అమ్మాయి ఎవరు.. ? బయట కనిపిస్తున్న అమ్మాయి ఎవరు.. ? అసలు వీరయ్య ఎందుకు నిద్రపోకూడదు.. ? అనేది సినిమాలోనే చూసి తెలుసుకోవాలి. ఆనంద్ వర్ధన్ మొదటి సినిమానే అయినా రెండు డిఫరెంట్ పాత్రల్లో కనిపించనట్లు తెలుస్తోంది. ఇక అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈసినిమాతో ఆనంద్ వర్ధన్ హీరోగా విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.