CM Revanth Reddy : తెలంగాణలో ప్రజా ప్రభుత్వ సంకల్పం “రైజింగ్ తెలంగాణ” కల సాకారమవుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల సాధనలో రాష్ట్రం గణనీయమైన వృద్ధి సాధించిన నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణ పురోగమిస్తోందంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఏడాది పాలనలో ప్రజా ప్రభుత్వం చేస్తున్న కృషికి ఈ పెట్టుబడులే నిదర్శమని వ్యాఖ్యానించారు.
దేశంలో విదేశీ సంస్థల పెట్టుబడులకు సంబంధించి కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య విభాగం తాజాగా వివిధ రాష్ట్రాలు సాధించిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు – ఎఫ్ డీఐల వివరాలతో ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో.. తెలంగాణ రాష్ట్రం మంచి ఫలితాల్ని రాబట్టినట్లు స్పష్టమవుతోంది. 2024 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఆరు నెలల్లోనే ఏకంగా రూ.12, 864 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. ఈ స్థాయిలో పెట్టుబడుల్ని ఆకర్షించడంతో దేశంలోని చాలా రాష్ట్రాల కంటే తెలంగాణ మంచి రాబడుల్ని సాధించింట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
గతేడాది ఇదే సమయంలో అంటే 2023 ఏప్రిల్ – సెప్టెంబర్ మధ్యలో కేవలం రూ. 9,679 కోట్లు. అంటే.. ఈ ఏడాది అదనంగా రూ.3,185 కోట్ల పెట్టుబడులు పెరిగాయి. ఇది ఏకంగా 33 శాతం అధికమని కేంద్ర ప్రభుత్వ నివేదిక తెలిపింది. ఈ ఏడాది ఆరు నెలల్లో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల్ని పరిగణలోకి తీసుకుంటే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యధిక పెట్టుబడులు ఆకర్షించిన ఆరో రాష్ట్రంగా గుర్తింపు సాధించింది. మన కంటే ముందు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, దిల్లీ మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి.
తెలంగాణాలోనూ ఒక్క హైదరాబాదే అత్యధిక విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించింది. మొత్తం పెట్టుబడుల్లో ఏకంగా 93 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే రూ. 11,970 కోట్లు హైదరాబాద్ నగరానికి వచ్చినట్లు గణాకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాకు అత్యధికంగా రూ.680.5 కోట్లు, మహబూబ్ నగర్ జిల్లాకు రూ. 116.70 కోట్లు, మెదక్ కు రూ. 96.99 కోట్ల మేర విదేశీ పెట్టుబడులు వచ్చినట్లు కేంద్రం విడుదల చేసిన నివేదిక తెలుపుతోంది.
ఈ విషయాన్ని ప్రస్తావించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) సాధనలో రాష్ట్రం గర్వించదగ్గ వృద్ధిని సాధించిందని హర్షం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ కృషికి ఈ పెట్టుబడులే నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రమాణస్వీకారం చేసిన మొదటి నెల నుంచే దావోస్, అమెరికా, దక్షిణ కొరియా లాంటి దేశాల్లో పర్యటించి.. పెట్టుబడుల సాధన కోసం ప్రయత్నాలు చేసినట్లు తెలిపిన సీఎం. ఆ ప్రయత్నాలు మంచి ఫలితాల్ని ఇస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. 2023 ఏప్రిల్ – సెప్టెంబర్ తో పోల్చితే… 2024 ఏప్రిల్ – సెప్టెంబర్ … అర్ధ సంవత్సరంలో అద్భుత లక్ష్యాలను సాధించామని అన్నారు.
Also Read : సిటీలోకి పెద్ద ఎత్తున అక్రమ మద్యం, గంజాయి చాక్లెట్లు..
ఈ స్థాయిలో పెట్టుబడులను సాధించడాన్ని ప్రభుత్వ విజయంగా చెప్పుకొచ్చిన రేవంత్ రెడ్డి.. యువత ఉపాధి – ఉద్యోగ కల్పనకు ప్రజా ప్రభుత్వం బలమైన సంకల్పంతో పని చేస్తుందనడానికి ఇది నిదర్శనమని అన్నారు. ఈ పురోగతి సాధనలో సహకరిస్తున్నప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.