CM Revanth Reddy help Gurukul girl Student to recover health : ములుగు జిల్లా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ భవనంపై నుంచి ప్రమద వశాత్తూ పడిపోయిన విద్యార్థిని కార్తీకను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. అక్కడినుండి నిమ్స్ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలందిస్తున్నారు. ఈ నెల తొమ్మిదో తేదీన 9వ తరగతి చదువుతున్న కార్తీక పాఠశాల మూడో అంతస్తునుంచి పడిపోయింది. దీనితో విద్యార్థినికి నడుము భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. పక్కటెముకలు విరిగాయి. ప్రస్తుతం ఆమె నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ఈ విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. వెంటనే వైద్య అధికారులను ఆ బాలికకు మెరుగైన వైద్య చికిత్సను అందించాల్సిందిగా కోరారు. కార్తీక వైద్య సేవలకు అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని ఆమెకు భరోసా ఇచ్చారు.
మంత్రి సీతక్క ఆరా
మంత్రి సీతక్క ఎప్పటికప్పుడు కార్తీక ఆరోగ్యం గురించి అధికారులను ఆరా తీస్తున్నారు. ఆసుపత్రి అధికారులను కార్తీక విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే నిమ్స్ న్యూరో సర్జన్ డాక్టర్ తిరుమల్ బృందం కార్తీకకు మంగళవారం ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ సక్సెస్ అయిందని వైద్యుల చెబుతున్నారు. ఆపరేషన్ తర్వాత కార్తీక ఇప్పుడు ఐసీయు లో కోలుకుంటోందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. సీఎం కార్యాలయం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు కార్తీక వైద్య సేవలకు అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చారు. నిమ్స్ డైరెక్టర్ బీరప్ప మాట్లాడుతూ ప్రస్తుతం కార్తీక ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని..మూడో అంతస్తునుంచి పడిపోవడంతో నడుము పక్కటెముకలు ఫ్రాక్చర్ అయ్యాయని..అందుకు సబంంధించిన అధునాతన వైద్యం అందించామని అంటున్నారు. ప్రస్తుతానికి ఆమె ప్రాణానికి హాని ఏమీ లేదని..త్వరలోనే కార్తీక కోలుకుంటుందని అన్నారు.