కొన్నిసార్లు ఆయా సంస్థలు, కంపెనీలు చేసే పొరపాట్ల కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా తైవానీస్ ఎయిర్ లైన్స్ విషయంలోనూ ఇలాగే జరిగింది. చివరికి సదరు సంస్థ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిదంటే.. ఈ విమానయాన సంస్థలో పని చేసే ఓ క్యాబిన్ క్రూ మెంబర్ చనిపోయిన తర్వాత సిక్ లీవ్ లెటర్ ఇవ్వాలంటూ ఆమెకు ఫోన్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో జరిగిన పొరపాటుకు విమానయాన సంస్థ క్షమాపణలు చెప్పింది.
సన్ అనే 34 ఏళ్ల మహిళ తైవానీస్ ఎయిర్ లైన్స్ లో క్యాబిన్ క్రూగా పని చేస్తుంది. సెప్టెంబర్ 24న డ్యూటీలో ఉండగా ఆనారోగ్యానికి గురయ్యింది. మిలన్ నుంచి తైవాన్‌లోని టాయోయువాన్ కు వెళ్తుండగా విమానంలోనే ఆస్వస్థత ఏర్పడింది. ల్యాండింగ్ తర్వాత ఆమెకు సమీపంలోని క్లినిక్‌లో చికిత్స అందించారు. కానీ, తరువాతి రోజుల్లో ఆమె పరిస్థితి మరింత దిగజారింది. ఆమెను సెప్టెంబర్ 26న ఆసుపత్రిలో చేర్చారు. ఆ తరువాత అక్టోబర్ 8న మరొక ఆసుపత్రికి తరలించారు. అక్టోబర్ 10న హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయింది.
నన్ చనిపోయిన తర్వాత కొద్ది గంటలకు EVA ఎయిర్ ఆఫీస్ నుంచి ఆమె ఫోన్ కు కాల్ వచ్చింది. వెంటనే సిక్ లీవ్ లెటర్ ఇవ్వాడాని హెచ్ ఆర్ డిపార్ట్ మెంట్ వాళ్లు అడిగారు. ఆమె కుటుంబ సభ్యులు కోపంతో ఊగిపోయారు. తమ సంస్థకు చెందిన ఎంప్లాయీ చనిపోయిన తెలుసుకోకపోగా, పైగా సిక్ లీవ్ లెటర్ ఇవ్వమనడంపై కోపంతో ఊగిపోయారు. వెంటనే ఆమె కుంటుంబ సభ్యులు లీవ్ లెటర్ కు బదులుగా ఆమె డెత్ సర్టిఫికేట్ పంపించారు.
ఈ విషయానికి సంబంధించి నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో.. తైవానీస్ ఎయిర్ లైన్స్ స్పందించింది. ఆమె మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, ఆమె కుటుంబానికి క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు EVA ఎయిర్ ప్రకటన విడుదల చేసింది. కొత్తగా జాబ్ లో చేరిన ఓ ఉద్యోగి నన్ గురించి తెలియకుండా సిక్ లీవ్ లెటర్ అడిగినట్లు ఎయిర్ లైన్ తన ప్రకటనలో వెల్లడించింది.
విమానయాన సంస్థలో క్యాబిన్ క్రూ సభ్యులు ఎక్కువ పని భారంతో బాధపడుతున్నారని, అనారోగ్యం ఉన్నప్పుడు కూడా సరిగా సెలవులు ఇవ్వడం లేదంటున్నారు నెటిజన్లు. ఇది విచారకరమైన ఘటన అంటూ తైవాన్ ప్రజలు మండిపడుతున్నారు. సిబ్బంది ఆరోగ్యం పట్ల ఆయా సంస్థలు వ్యవహరిస్తున్న ఉదాసీనత ఫలితంగానే ఈ ఘటన జరిగిందంటున్నారు. నన్ మరణంపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తైవాన్ అధికారులు వెల్లడించారు. EVA ఎయిర్ సన్ మరణానికి ముందు సరైన సిక్ లీవ్ మంజూరు చేయలేదా? అనే అంశంపై విచారణ జరపుతున్నారు. అటు EVA ఎయిర్ ప్రెసిడెంట్ చియా మింగ్ కీలక విషయాలు వెల్లడించారు. సన్ మృతి తమ హృదయాలను కలచివేసిందన్నారు. తమ సంస్థలో జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు జరిపిస్తామన్నారు.
Read Also: రన్ వే నుంచి నేరుగా సముద్రంలోకి.. ఘోర విమాన ప్రమాదం, స్పాట్ లోనే..