తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా పాల్గొంటున్నారు. నిన్న ఢిల్లీ నుండి నేరుగా మహారాష్ట్ర వెళ్లిన సీఎం పలు ప్రాంతాల్లో పర్యటించారు. ముంబాయిలోని కీలక స్థానం వర్లిలో మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. భారీగా రేవంత్ రెడ్డి కటౌట్ లను ఏర్పాటు చేశారు. ఆదిత్య విజయాన్ని కాంక్షిస్తూ సీఎం రేవంత్ రోడ్ షో నిర్వహించారు.
Also read: అంబులెన్స్‌లో మంటలు.. తృటిలో తప్పించుకున్న ఓ గర్బిణీ
ఈ రోడ్ షోకు భారీగా ప్రజలు తరలివచ్చారు. రోడ్ షోలో రేవంత్ రెడ్డి తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. ఇండియా కూటమి పథకాలను ప్రజలకు తెలిపారు. తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను అక్కడి ప్రజలకు వివరించారు. రోడ్ షోలో రేవంత్ ప్రసంగం హైలెట్ గా నిలిచింది. ఈ రోడ్ షోకు ముందు ఆయన వర్లిలోని తిరుపతి బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఎన్నికల ప్రచారానికి వెళ్లగా రేవంత్ తో పాటు శివసేన అభ్యర్థి ఆదిత్య ఠాక్రే, ముంబయి నగర కాంగ్రెస్ అధ్యక్షురాలు వర్ష గైక్వాడ్ ఉన్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల ప్రచారానికి ముందు అక్కడి కార్యకర్తలకు రేవంత్ తెలంగాణ సక్సెస్ మంత్ర గురించి వివరించినట్టు తెలుస్తోంది. వరుస ర్యాలీలు ప్లాన్ చేయాలని, కార్నర్ మీటింగ్ లు ఏర్పాటు చేసి ప్రజలకు మరింత దగ్గర అవ్వాలని వివరించినట్టు సమాచారం. ఇక మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం అనంతరం హైదరాబాద్ చేరుకున్న సీఎం మళ్లీ వారం రోజుల తరవాత తిరిగి మహారాష్ట్రకు ప్రచారంలో పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది.