CM Revanth Reddy – Japan Tour : తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలంటూ జపాన్ పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానం పలికారు. టోక్యోలో జరిగిన ఇండియా-జపాన్ ఎకనామిక్ పార్ట్‌నర్‌షిప్ రోడ్‌షోలో తెలంగాణ రైజింగ్ టీమ్ పార్టిసిపేట్ చేసింది. 150 మందికి పైగా జపాన్ పారిశ్రామికవేత్తలు ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. తెలంగాణ రైజింగ్ నినాదంతో తాము వచ్చామని.. ఇవాళ జపాన్‌లో తెలంగాణ ఉదయిస్తోందని సీఎం రేవంత్ అన్నారు. హైదరాబాద్‌ను డెవలప్ చేయడానికి టోక్యో నగరం నుంచి చాలా నేర్చుకున్నామని చెప్పారు. టోక్యో సిటీలో మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, ఆవిష్కరణలు అద్భుతమని కితాబు ఇచ్చారు.
జపాన్‌లో తెలంగాణ రైజింగ్ ప్రజెంటేషన్
తెలంగాణలో పెట్టుబడులకున్న అవకాశాలపై జపాన్ పారిశ్రామికవేత్తలకు ప్రెజెంటేషన్ ఇచ్చింది తెలంగాణ రైజింగ్ బృందం. లైఫ్ సైన్సెస్, EVs, AI డేటా సెంటర్లు, టెక్స్‌టైల్స్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించింది. ఫ్యూచర్ సిటీ, మూసీ రీవైవల్ ప్రాజెక్ట్ ప్రచార వీడియోలను జపాన్ దిగ్గజ పారిశ్రామికవేత్తల ముందు ప్రదర్శించారు. జెట్రో డైరెక్టర్ జనరల్ తోషిహిరో మిజుటానీ.. తెలంగాణతో సహకారానికి ఆసక్తి కనబరిచారు. భారత్, జపాన్ ఆర్థిక బంధం మరింత బలోపేతం కానుందన్న భారత రాయబారి CB జార్జ్ అన్నారు.
ఏఐ కేపిటల్‌గా హైదరాబాద్
మరోవైపు, హైదరాబాద్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్, ఎన్టీటీ డేటా, నెయిసా సంయుక్తంగా రూ. 10,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఆ మేరకు తెలంగాణ సర్కారుతో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. 400 మెగావాట్ల డేటా సెంటర్ క్లస్టర్.. 25,000 GPUలతో దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఏఐ సూపర్ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను సమకూర్చనుంది. తెలంగాణను అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా మార్చాలనే లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు సాకారం కానుంది. ఈ భారీ పెట్టుబడుల ఒప్పందంపై సీఎం రేవంత్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని చెప్పారు.
లేటెస్ట్ టెక్నాలజీతో క్లస్టర్
500 మెగావాట్ల గ్రిడ్, పునరుత్పాదక విద్యుత్ కాంబినేషన్లో ఈ క్లస్టర్ నిర్వహిస్తారు. లిక్విడ్ ఎమ్మర్షన్ లాంటి అత్యాధునిక కూలింగ్ టెక్నాలజీలను వాడనున్నారు. అత్యున్నత ఎన్విరాన్‌మెంటల్, సోషల్, గవర్నెన్స్ ప్రమాణాలతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తారు. తెలంగాణలోని విద్యా సంస్థల భాగస్వామ్యంతో ఏఐ ప్రతిభను పెంపొందించేందుకు.. రాష్ట్ర డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్‌కు ఇది దోహదం చేయనుంది.
Also Read : నేను రాను బిడ్డో.. సీఎం రేవంత్ ట్వీట్
తోషిబా రూ. 562 కోట్ల పెట్టుబడి..
సీఎం రేవంత్‌రెడ్డి జపాన్ పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం కుదిరింది. రుద్రారంలో రూ. 562 కోట్ల పెట్టుబడితో తోషిబా కొత్త ఫ్యాక్టరీ నిర్మించనుంది. తెలంగాణలో TTDI సర్జ్ అరెస్టర్స్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో రుద్రారంలో పరిశ్రమల విస్తరణ జరగనుంది. GIS తయారీ కోసం TTDI ఫ్యాక్టరీలను అప్‌గ్రేడ్ చేస్తోంది. ఆ మేరకు టోక్యోలో సీఎం రేవంత్ సమక్షంలో ఎంవోయూలపై సంతకాలు పూర్తయ్యాయి. తెలంగాణ పారిశ్రామిక విధానాలు తమను ఆకట్టుకున్నాయని సంస్థ ప్రతినిధి హిరోషి ఫురుటా అన్నారు. పెట్టుబడులకు అనుకూల గమ్యంగా తెలంగాణ ఎదుగుతోందని ప్రశంసించారు.