CM Revanth Reddy: తెలంగాణ ప్రాజెక్టుల పూర్తికి కేంద్రం సహకరించాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో సోమవారం కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ను సీఎం రేవంత్ రెడ్డి తో పాటు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం కలిశారు. ఇటీవల తెలంగాణ నీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి, వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రజలకు త్రాగు, సాగునీటి సమస్య తలెత్తకుండా తీసుకునే చర్యలలో భాగంగా కేంద్ర మంత్రితో చర్చలు జరిపారు.
ఈ భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గోదావరి జలాలను మూసీ నదికి అనుసంధానం చేయాలని ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరామన్నారు. ఇప్పుడున్న నీటి కేటాయింపులు, నీటి వినియోగం గురించి ప్రధానంగా కేంద్ర మంత్రితో చర్చించడం జరిగిందన్నారు. నికర జలాలపై సమ్మక్క సారక్క ప్రాజెక్ట్, సీతారామ తదితర ప్రాజెక్టులను నిర్మిస్తుండగా, ఏపీ ఎందుకు అభ్యంతరం చెబుతోందని సీఎం అన్నారు. గోదావరి వరద జలాలపై కట్టే ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలంటే ముందుగా నికరజలాల ప్రాజెక్టులు లెక్క తేల్చాల్సిందేనని సీఎం అన్నారు. సముద్రంలో వృధాగా కలిసే వరద జలాలను కృష్ణా బేసిన్ కు తరలిస్తామని ఏపీ చెబుతోందని, అలాంటి సమయంలో నికరజలాలపై ఉన్న తెలంగాణ ప్రాజెక్టులకు ఎందుకు అభ్యంతరం చెబుతున్నారంటూ సీఎం ప్రశ్నించారు.
కృష్ణా డెల్టాలో ఆయకట్టు స్థిరీకరించడం వల్ల 811 టీఎంసీల ఉమ్మడి వాటాలో 512 టీఎంసీలు ఏపీ వినియోగించుకుంటుందని, తెలంగాణ కేవలం 299 టీఎంసీలు మాత్రమే వినియోగించుకుంటున్నట్లు సీఎం ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇందుకు ప్రధాన కారణం తెలంగాణ ప్రాజెక్టులు పూర్తిగా కాకపోవడమేనని, ఏపీలో పూర్తయిన ప్రాజెక్టులకు నీటిని కేటాయించడం తగిన కారణమంటూ సీఎం చెప్పొకొచ్చారు.
కృష్ణా నదిలో తలెత్తిన పరిస్థితి గోదావరి విషయంలో జరగకూడదని, నికరజలాలపై తమ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతనే వరద జలాలపై నిర్మించే ప్రాజెక్టుల సంగతి చూడాలంటూ కేంద్ర మంత్రిని కోరామన్నారు. అంతే కాకుండా ఏపీ పెట్టిన అభ్యంతరాలు ఉపసంహరించుకోవాలని, వరద జలాలపై వారు నిర్మించే ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వానికి అభ్యంతరం ఉంటుందన్నారు.
Also Read: తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేది ఎవరో తెల్సిపోయింది.. మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
ఇదే భేటీలో పాల్గొన్న మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం నాగార్జునసాగర్ సహా ఇతర ప్రాజెక్టులలో టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలన్నారు. పదేళ్లపాటు గతంలో తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యం చేసిందని, అవసరమైతే తెలంగాణనే ఆంధ్ర వాటా ఖర్చు భరిస్తామని చెప్పారు. ఈ ప్రతిపాదనకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. కృష్ణా జలాల వివాదంలో రోజువారీగా కేంద్రం జోక్యం చేసుకుంటుందని హామీ ఇచ్చినట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల గురించి ప్రధానంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో చర్చించాం : రేవంత్ రెడ్డి
నీటి వినియోగం, కేటాయింపుల్లో తలెత్తుతున్న సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాం
పలు ప్రాజెక్టులకు అనుమతుల విషయంపై కూడా భేటీలో చర్చ జరిగింది
SLBC ప్రమాదం ఎలా… https://t.co/Kqqlj6qjXm pic.twitter.com/RT1XKCCBkE
— BIG TV Breaking News (@bigtvtelugu) March 3, 2025