TPCC Chief Mahesh Kumar Goud: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ అభివృద్ధిని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఫైరయ్యారు. ప్రాజెక్టులు, నిధులు రాకుండా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కిషన్ రెడ్డి తీరును ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని.. అభివృద్దిలో బీజేపీ నేతలు భాగస్వామ్యం కావాలని మహేష్ కుమార్ గౌడ్ కోరారు.
రాష్ట్రంలో కొంత మంది కావాలనే అభివృద్ధికి అడ్డుపడుతున్నారని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఎప్పుడూ రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా మారుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు విషం చిమ్ముతున్నాయని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధికి అడ్డుకోకుండా.. తగిన సూచనలు ఇవ్వాలని కోరారు. ఎన్నికల వరకే రాజకీయాలు ఉంటాయని.. ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధి, ప్రజలే తమకు ముఖ్యమని అన్నారు. ముఖ్యంగా ఈ రెండు పార్టీల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా మారారని వ్యాఖ్యానించారు. ఈ విషయానికి సంబంధించి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు లోపాయకారి ఒప్పందం కుదర్చుకున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా మెట్రో సెకండ్ ఫేజ్ పనులు ఆలస్యం అవుతాన్నాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు.
ALSO READ: TGPSC Group-2,3 Results: గ్రూప్-2,3 ఫలితాలపై కీలక అప్డేట్ వచ్చేసింది.. కొత్త నోటిఫికేషన్లు కూడా..?
మరోవైపు భాగ్యనగరానికి కీలకమైన మూసీ నది ప్రక్షాళనకు అడ్డు పడడానికి కారణం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటుందని.. కులగణనకు బీజేపీ తీవ్ర వ్యతిరేకంగా ఉందన్నారు. బీసీ కులగణన చేపట్టవద్దని ఆ పార్టీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చిన విషయం నిజమా.. కాదా..? చెప్పాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కులు అసలు బీజేపీ లేనే లేదని తీవ్ర స్థాయిలో మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఒక వేళ బీజేపీకి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీసీలపై చిత్త శుద్ధి కనుక ఉంటే.. దేశ వ్యాప్త సర్వే చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఒత్తిడి తీసుకురావాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఛాలెంజ్ చేశారు.