PM Modi with CM Revanth: ఢిల్లీలో బిజీగా ఉన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. బుధవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన భేటీ అయ్యారు. తొలుత మహాశివరాత్రి సందర్భంగా ప్రధానికి శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతోపాటు విభజన చట్టంలోని హామీలపై చర్చించారు.
అలాగే రాష్ట్రానికి కేంద్రం సహాయం అందించాలని కోరినట్లుగా తెలుస్తోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు వివరించారు. భారీగా నీరు, బురద కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలిగిందని పేర్కొన్నారు. చేస్తున్న సహాయక కార్యక్రమాలను ప్రధానికి రేవంత్ రెడ్డి వివరించినట్లు సమాచారం. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను ప్రధానితో చర్చించిట్లుగా ఢిల్లీ సమాచారం.
రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై ప్రధాని మోదీతో రేవంత్‌రెడ్డి చర్చించారు. చేపట్టిన పలు ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్ నిధులూ విడుదల చేయాలని కోరారు. మెట్రో ఫేస్-2, ఎయిర్‌పోర్ట్ పొడిగింపు, అందుకు కావాల్సిన ఆర్థిక సహాయం గురించి చర్చించారు.
మూసీ నది సుందరీకరణ నిధులు, వెనకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులు, తెలంగాణకు ఐటీఐఆర్ చర్చించిన అంశాల్లో ఉన్నాయి. అలాగే ఐఐఎం, రీజనల్ రింగ్ రోడ్డుకు అనుమతులు, ఆర్థిక సహాయం చేయాలని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలను ప్రధాని దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు. వాటిని త్వరగా పరిష్కరించాలని కోరారు.
ALSO READ: హైదరాబాద్ లో ఆదియోగి భారీ విగ్రహం
ఈ సమావేశంలో రేవంత్ రెడ్డితోపాటు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. పలువురు కేంద్రమంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యే అవకాశం ఉంది.