Adiyogi Statue in Hyderabad: మహా శివరాత్రి పర్వదినం వేళ సద్గురు గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే కోయంబత్తూర్ లో ఈషా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన భారీ ఆదియోగి విగ్రహాన్ని దర్శించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వెళుతుంటారు. అయితే ఇక హైదరాబాద్ లోనే ఆదియోగిని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తున్నట్లు సద్గురు ప్రకటించారు.
కోయంబత్తూర్ లోని ఆదియోగి విగ్రహం వద్ద మహా శివరాత్రి మహోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ మహోత్సవాలలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రతి ఏడాది మహా శివరాత్రిని పురస్కరించుకొని ఆదియోగి విగ్రహం వద్ద పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. అలాగే శివరాత్రి రోజు భక్తులు జాగారం చేసేందుకు పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను సైతం నిర్వహిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు కోయంబత్తూర్ కు తరలివెళ్లారు. ఈ భక్తులను ఉద్దేశించి ప్రసంగించిన సద్గురు శుభవార్త చెప్పారు.
హైదరాబాద్ నగరంలో ఎప్పటినుండో ఆదియోగి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సద్గురు భావిస్తున్నారు. నిన్న భక్తులతో సద్గురు మాట్లాడుతూ.. హైదరాబాద్ లో ఆదియోగి విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం నుండి అన్ని అనుమతులు వచ్చాయన్నారు. సుమారు రెండేళ్లలో ఎత్తైన ఆదియోగి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మాట సద్గురు చెప్పిన వెంటనే భక్తులు కరతాళ ధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు. అదే జరిగితే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు, కోయంబత్తూర్ వెళ్లకుండా ఆదియోగిని నగరంలో దర్శించే భాగ్యం కలుగుతుంది. నగరవాసులు కూడా ఈ ప్రకటన కోసమే ఎదురుచూపుల్లో ఉండగా, సద్గురు మహా శివరాత్రి రోజు శుభవార్త చెప్పారని భక్తులు తెలుపుతున్నారు. అలాగే అనుమతులు ఇచ్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ఏపీలో ఆదియోగి విగ్రహం ఏర్పాటు
ఏపీలో ఆదియోగి విగ్రహాన్ని భక్తులు ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి అత్యంత సమీపంలో గల ద్వారంపూడి ఇందుకు వేదిక అయింది. ద్వారంపూడిలో 60 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో ఆదియోగి విగ్రహాన్ని నిర్మించారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ప్రారంభోత్సవ మహోత్సవం జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు మహోత్సవంలో పాల్గొని ఆదియోగిని దర్శించుకుంటున్నారు. అలాగే వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఈ ఆదియోగి విగ్రహం దేశంలో మూడవ స్థానంలో ఉంటుందని భక్తులు తెలుపుతున్నారు.
ఏపీలో ఇప్పటికే ఆదియోగి భారీ విగ్రహాన్ని భక్తులు ఏర్పాటు చేయగా, తెలంగాణలో సద్గురు సారథ్యంలో ఆదియోగి విగ్రహం ఏర్పాటు చేయడం విశేషం. ఇప్పటికే హైదరాబాద్ నగరం ఎన్నో పర్యాటక ప్రదేశాలకు నిలయంగా మారగా, ఆదియోగి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే నగరం ఖాతాలో మరో పర్యాటక ప్రదేశం చేరినట్లేనని చెప్పవచ్చు. విదేశీయులు నగర అందాలను చూసి మురిసిపోతుండగా, ఆదియోగి విగ్రహం ఏర్పాటు అనంతరం విదేశీయుల రాక నగరానికి అధికం కావచ్చని పర్యాటకులు తెలుపుతున్నారు. ఏదిఏమైనా మహా శివరాత్రికి హైదరాబాద్ నగర వాసులకు గుడ్ న్యూస్ చెప్పారని భక్తులు తెలుపుతున్నారు. మరో రెండేళ్లలో ఆదియోగిని దర్శించేభాగ్యం నగరవాసులకు కలగనుందని సద్గురు ప్రసంగాన్ని బట్టి చెప్పవచ్చు.